Sunita Williams: సునీత విలియమ్స్.. భూమిపైకి ఇలా చేరుకున్నారు!

ఇంతకాలం అంతరిక్షంలో కీలక శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు చేసిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయలుదేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ ‘ఫ్రీడమ్’ క్యాప్సూల్ సునీతతో పాటు బుచ్ విల్మోర్, నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్‌కాస్మస్ వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్‌లను భూమికి తీసుకువచ్చింది. 17 గంటల అంతరిక్ష ప్రయాణం తర్వాత ఫ్లోరిడా తీరంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర జలాల్లో క్యాప్సూల్ ల్యాండ్ కావడంతో వీరి ప్రయాణం విజయవంతమైంది.

రక్షణ బృందం క్యాప్సూల్‌ను పడవపైకి ఎక్కించి, వ్యోమగాములను ఒకదాని తర్వాత ఒకటి బయటికి తీసుకువచ్చింది. సునీత విలియమ్స్ భూమిపైకి వచ్చిన క్షణం ఎంతో హృద్యంగా మారింది. క్యాప్సూల్ సముద్రంలో దిగిన సమయంలో డాల్ఫిన్లు చుట్టూ తిరుగుతూ కనిపించాయి. తొలుత నిక్ హేగ్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి విజయచిహ్నంగా బొటనవేలు చూపించగా, అనంతరం సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ బహిర్గతమయ్యారు.

286 రోజుల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం తర్వాత భూమిని తాకిన ఈ క్షణాలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి. హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు వెళ్లేముందు, రికవరీ నౌకలో కొంత సమయం గడిపారు. వైద్య పరీక్షల అనంతరం వారి కుటుంబాలను కలుసుకునే అవకాశముంది. నాసా తాత్కాలిక అడ్మినిస్ట్రేటర్ జానెట్ పెట్రో మాట్లాడుతూ, “సునీతా, బుచ్, నిక్, అలెగ్జాండర్ అంతరిక్షంలో 900 గంటల పరిశోధనలు, 150 ప్రయోగాలు నిర్వహించారు. మిషన్ పూర్తయి భూమిపైకి రావడం ఆనందంగా ఉంది” అన్నారు.

నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ మాట్లాడుతూ, “క్రూ అంతా క్షేమంగా ఉన్నారు. హ్యూస్టన్‌కు వెళ్లేముందు రికవరీ నౌకలో విశ్రాంతి తీసుకుంటారు. వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని నిర్ధారించిన తర్వాత, వారు తమ కుటుంబాలను కలుసుకుంటారు” అని తెలిపారు.

సునీతా విలియమ్స్ భూమికి చేరుకున్న వార్తతో భారత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామం గుజరాత్‌లోని ఝూలాసన్‌లో సంబరాలు మిన్నంటాయి. బాణాసంచా కాల్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రభుత్వం సునీతను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆమె తన అంతరిక్ష అనుభవాలను ప్రపంచానికి తెలియజేయనున్నారు.

డీలిమిటేషన్ అంటే ఏమిటి.? || Analyst Chinta Rajasekhar Reacts On Delimitation || BJP || Telugu Rajyam