Head Swirls: తలపై రెండు సుడులు ఉంటే.. ఏమవుతుందో తెలుసా..?

తలపై కనిపించే చిన్న సుడులు… మనం సాధారణంగా పెద్దగా పట్టించుకోం. ఇవి సహజంగా ఉండే శరీర లక్షణాలుగానే చూస్తుంటాం. కానీ సాముద్రిక శాస్త్రం దృష్టిలో ఇవి సాధారణం కాదు. ఈ సుడులు వ్యక్తిత్వాన్ని వెల్లడించే సంకేతాలుగా పరిణిస్తారు. తలపై ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ సుడులు ఉండే వ్యక్తుల గురించి సాముద్రిక నిపుణులు కొన్ని ఆసక్తికర విషయం చెబుతున్నారు. తలపై ఉండే సుడుల సంఖ్య, దిశ, ఆకృతి, మన వ్యక్తిగత లక్షణాలపై గాఢ ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

ఒకే ఒక సుడి ఉన్న వారు: ఈ వ్యక్తులు సున్నితమైన మనసు కలిగి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. వారు సహనంగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. ఎవ్వరినీ తక్కువగా చూడరు. ఇతరుల సమస్యలపై చింతించే మనస్తత్వం వీరిది. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య విశ్వసనీయత కలిగి ఉంటారు. నిజాయితీ వీరి బలం.

రెండు సుడులు ఉన్నవారి గుణాలు: తలపై రెండు గుండ్లు ఉన్నవారు సామాన్యంగా భిన్నమైన స్వభావంతో ఉంటారని నిపుణుల అభిప్రాయం. వీరిలో ఒక వైపు గట్టి నమ్మకం, ధైర్యం కనిపిస్తే… మరోవైపు తిరగబడి నిలబడే మొండి ధోరణి ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో అహంకారపూరితంగా వ్యవహరించవచ్చు. చిన్న విషయానికే తీవ్రంగా స్పందించే కోప స్వభావం కలిగి ఉండే అవకాశం ఉందని చెబుతారు.

బాల్యంలో వీరు ఎక్కువ అల్లరి చేస్తారని, పెద్దయ్యాక విభిన్న ఆలోచనలతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారని సాముద్రిక నిపుణులు చెబుతున్నారు. అయితే, సరిగ్గా మార్గనిర్దేశం చేస్తే.. వీరు ఎంతో శక్తివంతమైన వ్యక్తులుగా ఎదగవచ్చు. రెండు సుడులు ఉన్నవారి సంబంధాలు కొన్నిసార్లు అంతగా నిలబడవు. భావోద్వేగాల్లో కొద్దిగా తడబడే వీరి నడవడిలో సమస్యలు తలెత్తవచ్చు. కానీ సానుకూల దృక్పథంతో వారిని సమర్థంగా తీర్చిదిద్దగలిగితే, గొప్ప వ్యక్తులుగా మారే అవకాశం ఉన్నదని నిపుణుల అంటున్నారు.

తలపై కనిపించే ఈ చిన్న గుండ్లు, సాధారణంగా తీసిపారేసే అంశాలు కావు. సాముద్రిక శాస్త్రం ప్రకారం వీటిని శరీరంపై ఉన్న సంకేతాలుగా, వ్యక్తిత్వానికి అద్దం పట్టే లక్షణాలుగా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్రం, వాస్తు శాస్త్రం ఎంతగానో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నప్పటికీ, శరీర లక్షణాలను బట్టి మన భవిష్యత్తును అంచనా వేసే సాముద్రిక శాస్త్రం కూడా అంతే విశిష్టమైనది. (గమనిక: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు సాముద్రిక శాస్త్రానికి సంబంధించిన సామాన్య నమ్మకాలపై ఆధారపడి ఉన్నవి. వాటిని వ్యక్తిగతంగా అంగీకరించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)