ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. నభూతో నభవిష్యతి అన్నట్లుగా అమరావతి రాజధాని ప్రాంతంలో 50,793 మంది నిరుపేద కుటుంబాలకు సెంటు చొప్పున నివాస స్థలాల పట్టాలను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఇది చరిత్రలో మునుపెన్నడూ జరగని విషయం.. ఇకపై జరుగుతుందని కూడా గట్టిగా చెప్పలేని విషయం. దీంతో పేదలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా జగన్ చేసిన ప్రసంగం వైరల్ అవుతుంది.
ఇంతకాలం అమరావతి అంటే కమ్మ సామాజిక వర్గం రాజధానిగా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు కూడా ఇదే కోణంలో విమర్శలు చేసేవారు. అయితే తాజాగా జగన్ తన ప్రసంగంలో అమరావతిపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. “అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నా. ఇవి ఇళ్ల పట్టాలే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు కూడా” అని సీఎం జగన్ హర్షధ్వానాల మధ్య అన్నారు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ సామాజిక అమరావతి అని జగన్ అనడంలో కూడా ఒక కీలక అంశం దాగిఉంది. తాజాగా చేపట్టిన ఈ ఇళ్ల పట్టాల పంపిణీలో సామాజిక న్యాయానికి జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు తెలుస్తుంది. 50,793 మంది లబ్ధిదారుల్లో అత్యధికంగా బీసీలు 26,869, అగ్రవర్ణాల పేదలు 13,850, ఎస్సీలు 8,495, ఎస్టీలు 1,579 మంది ఉన్నట్లుగా జగన్ సర్కార్ లెక్కలు చెబుతోంది. ఇదే… జగన్ ప్రత్యేకంగా “సామాజిక అమరావతి” అని నొక్కి చెప్పడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
ఏది ఏమైనా… ఎవరు ఎన్ని అడ్డంకూ సృష్టించినా.. జగన్ చెబుతున్నట్లు పేదలకూ పెత్తందారులకూ జరిగిన ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో… అల్టిమెట్ గా పేద ప్రజలే గెలవడం ఏపీ చరిత్రలో ఒక కీలక అధ్యాయం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!