అమరావతిపై మంత్రి కొడాలి నాని తాజా వ్యాఖ్యలతో చెలరేగిన రగడకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫుల్ స్టాప్ పెట్టదలిచారా?…లేక ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు తమకు సమస్యాత్మకంగా పరిణమించిన అమరావతి అంశాన్ని ఎలాగైనా సద్దుమణిగేలా చేసేందుకు సరి కొత్త వ్యూహం మొదలు పెట్టడం, దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేపనిలో ఉన్నారా?…
అనేది ఉత్కంఠకరంగా మారింది. ఏదేమైనా మంత్రిమండలి లోని ఇద్దరు కీలకమైన మంత్రులు రెండు రోజుల వ్యవధిలో అమరావతిపై రెండు విభిన్న వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానిపై స్పష్టత ఇచ్చేందుకా అన్నట్లుగా సిఎం జగన్ బుధవారం ఇదే విషయమై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక ప్రముఖ జాతీయ ఆంగ్ల పత్రికకు సిఎం వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ఇస్తూ అమరావతిపై తన అభిమతాన్నిఆలోచనలను సుదీర్ఘంగా సవివరంగా తెలియచేశారు. ఇదే సందర్భంలో అమరావతి విషయమై చంద్రబాబు వైఖరిపై సిఎం జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ముందే చెప్పినట్లు ఇది అమరావతి వివాదానికి ముగింపు పలికేందుకా?…లేక ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే వ్యూహంలో భాగంగా ఫీడ్ బ్యాక్ కోసమా?…అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.
మంత్రుల వ్యాఖ్యలతో గందరగోళం
అమరావతిలో శాసన సభ కూడా ఉండరాదంటూ హఠాత్తుగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపగా దానికి అనుబంధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. అయితే మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఒకవైపు ప్రకంపనలు రేపుతుండగానే మరోవైపు క్యాబినెట్ లోని మరో కీలక మంత్రి అందులోను సిఎం జగన్ తో సన్నిహితుడుగా గుర్తింపు పొందిన ఆదిమూలపు సురేష్ అమరావతి విషయమై మరోమారు స్పష్టత ఇచ్చారు.
సిఎం జగన్ ముందు ప్రకటించిన విధంగా మూడు రాజధానులే కొనసాగుతాయని, అందులో అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని ప్రకటనకే తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. దీంతో అమరావతిపై వైసిపి కొత్త మెండ్ గేమ్ స్టార్ట్ చేసిందని అందులో భాగంగానే ఇలా మంత్రులు పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేస్తున్నారనే విశ్లేషణలు జోరందుకున్నాయి. ఇలాంటి ఉత్కంఠభరితమైన వాతావరణం అలుముకున్న నేపథ్యంలో సిఎం జగన్ అమరావతి విషయమై వ్యాఖ్యలు చేయడం సహజంగానే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
సిఎం జగన్ ఏమన్నారంటే
బెంగళూరు, చెన్నై, హైదరాబాదుల్లా భారీ ఆదాయాన్ని సంపాదించే నగరాన్ని నిర్మించాలన్న గత సిఎం చంద్రబాబు చేపట్టిన అమరావతి మహానగర నిర్మాణం గురించి మీ ఆలోచన ఏమిటనే ప్రశ్నకు సమాధానంగా సిఎం జగన్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణా,ఎపిగా విడిపోయినప్పుడు హైదరాబాద్ కోల్పోవడం ద్వారా నవ్యాంధ్రకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా ఒక నూతన రాజధానిని…రాష్ట్రానికి ఆదాయాన్ని ఆర్జించి పెట్టే ఒక గొప్ప క్యాపిటల్ సిటీని నిర్మించాలని, అందుకు అమరావతిని నిర్మించనున్నట్లు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన అనంతరం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సిఎం జగన్ గుర్తుచేశారు. అయితే ఆదాయాన్ని ఆర్జించే గొప్ప రాజధాని నిర్మాణం అనే కాన్సెప్ట్ ను సిఎం జగన్ ఒక వికృత ఆలోచన(పర్వెర్టెడ్ థింకింగ్) గా అభివర్ణించారు. గొప్ప నగరాలు నిర్మాణం వల్ల భారీ ఆదాయాన్ని ఆర్జిస్తామనే గ్యారెంటీ లేదని, పైపెచ్చు అలాంటి వాటి వల్ల అప్పుల్లో కూరుకుపోతామని సిఎం జగన్ తేల్చేశారు.
ఇంకా ఏమన్నారంటే…
గొప్ప నగరాలు గొప్ప ఆదాయాన్ని ఆర్జించిపెడతాయనే కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడా నిరూపించబడలేదన్నారు. ఇలాంటి గొప్ప నగరాలు తయారయేందుకు దశాబ్దాలు, శతాబ్దాలు పడుతుందని వివరించారు. కాబట్టే ఒక మహానగరాన్నిగా నిర్మించేందుకు లక్ష కోట్ల రూపాయలు వెచ్చించడం సరికాదన్నారు. అంతటి వ్యయంతో నిర్మించే మహా నగరాల వల్ల అదనపు ఆదాయం సంగతేమో గానీ వాటికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం చేసే ఖర్చు వల్ల ఆ అప్పులు కూడా తీర్చే పరిస్థితి ఉండదన్నారు. ఈ సందర్భంగా అమెరికా మిడ్ వెస్ట్రన్ రాష్ట్రమైన నెబ్రాస్కాలో కేవలం 40 వేల మంది మాత్రమే నివసించే ఒమాహా నగరం గురించి సిఎం జగన్ ఉదహరించారు. ఈ చిన్న నగరంలోనే అమెరికాలోనే అతి పెద్ద కార్పొరేషన్ల ప్రధాన కార్యాలయాలన్నీ కొలువు తీరి ఉన్నాయని, అంతేకాదు ఈ నగరంలోనే ప్రపంచ ప్రసిద్ద ఐశ్వర్యవంతుడైన వారెన్ బఫెట్ ఉంటారని చెప్పారు. అలాగే వాయువ్యంలో ఉండే మరో రాష్ట్రం వాషింగ్టన్ లో 60 వేల మంది జనాభాతో ఉండే మరో చిన్న నగరం సీటెల్ లోనే నుంచే ప్రముఖ బిజినెస్ మాగ్నెట్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రధాన కార్యాలయం ఉంటుందని, ఆయన అక్కడ నుంచే పనిచేస్తుంటారని చెప్పుకొచ్చారు.
మహా నగరాలే పరిష్కారం కాదు
మహా నగరాల నిర్మాణం కొన్ని పరిస్థితుల్లో అవాంఛనీయమని, అవి ఉన్న వనరులు అన్నింటిని హరించడం వల్ల ప్రజలకు భారంగా మారుతాయన్నారు. అభివృద్ధి చెందిన టాప్ 10 దేశాలలో ఏదీ మెట్రో, మెగా సిటీ లేదని చెప్పారు. “నార్వే, స్వీడన్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్…ఈ అభివృద్ధి చెందిన దేశాలన్నింటికీ మెగా సిటీలు లేవన్నారు. అసలు అభివృద్ధి అంటే పారిశ్రామికీకరణ లేదా పట్టణీకరణ కాదని, అభివృద్ధి అంటే తలసరి ఆదాయం వృద్ది మరియు ఆనందం సూచిక వంటి అనేక విషయాలతో ముడిపడి ఉంటుందని వివరించారు. కేరళకు కూడా పెద్ద నగరాలు లేవని, అయినా అనేక విషయాల్లో ఇతర రాష్ట్రాల కంటే కేరళ ముందుందని జగన్ పేర్కొన్నారు. అభివృద్ధిని రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకరణ చేయాలనేది తన అభిమతమని, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు మరియు తిరుపతి ఇంకా మరికొన్ని నగరాలు అభివృద్ధి సమూహంగా మారేలా చేస్తామన్నారు. ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నాం, అలాగే వ్యవసాయ కేంద్రంగా ఉన్న మధ్య ఆంధ్రాలో కొన్ని వ్యవసాయ-లాజిస్టిక్ పార్కులు ఉన్నాయని, అవన్నీ అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆదాయం వాటి వల్ల రాదు
ఆదాయం రావాలంటే మహా నగరాల వల్ల కాదని తయారీ, సేవా రంగాల ద్వారా ఆదాయం వస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు. అసలు పరిశ్రమలు పట్టణ ప్రాంతాల్లోనే ఎందుకు ఉండాలి?…ఉదాహరణకు, విశాఖపట్నం మన రాజధాని కాదు. ఇది ఒక చిన్న పట్టణంగా ఉన్నప్పుడు, కొన్ని దశాబ్దాల క్రితమే అక్కడ స్టీల్ ప్లాంట్ మరికొన్ని పరిశ్రమలు స్థాపించబడ్డాయి…అదే ఇప్పుడు ఒక ప్రధాన నగరంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. అంతేకాదు కోవిడ్ -19 అనుభవం అనేది చాలా పెద్ద నగరాలు పెద్ద ఎత్తున దెబ్బతింటాయని చూపిస్తోందని, ప్రధాన నగరాలు లేదా మెట్రోలు నుంచి అభివృద్దిని మధ్య స్థాయి మరియు చిన్న పట్టణాలకు క్రమంగా మార్పు చేయాల్సి ఉందన్నారు.
కిక్కిరిసినట్లు ఉండే పట్టణం నిర్మాణం కోసం డబ్బు ధారపోయడం సరికాదన్నారు. వివిధ ప్రాంతాలను కలపడం, తద్వారా వాటి మధ్య వేగంగా అనుసంధానం జరగడం, దానివల్ల ఖర్చు ఆదాచేయగలగడం వంటి వాటి కోసమే డబ్బు ఖర్చు చేయాలన్నారు. “నగరాలు ఎక్కువ డబ్బు సంపాదిస్తాయనేది తప్పు అభిప్రాయం. కొన్ని నగరాలు మినహాయించి, గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగరాలు ప్రపంచంలో ఎక్కడా విజయవంతం కాలేదు. ” అని సిఎం జగన్ పునరుద్ఘాటించారు.
అసలు ఇవన్నీ కాదు
అసలు చంద్రబాబు చెప్పేవిధంగా అమరావతిని నిర్మించడానికి మన రాష్ట్రానికి వనరులు ఉన్నాయా అని సిఎం జగన్ ఎదురు ప్రశ్నించారు. ఇదే విషయమై అమెరికా మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఆర్థిక కోణంలో విశ్లేషించి ఇలాంటి పెట్టుబడులు ఆచరణలో సత్ఫలితాలు ఇవ్వవని తేల్చాయన్నారు. విశాఖపట్నం, కర్నూలు మరియు అమరావతిలో రాష్ట్ర కార్యనిర్వాహక, న్యాయ, శాసన సభల కోసం మూడు ప్రత్యేక రాజధానులను కలిగి ఉండాలనే తన ప్రణాళికను ఆయన సమర్థించుకున్నారు. ఎవరైనా తమ గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో ఉంచడం కరెక్ట్ కాదన్నారు. రాజధాని యొక్క వేర్వేరు విధులు వేర్వేరు ప్రదేశాల నుంచి పనిచేయబడతాయి. ఈ పనులన్నీ ఒక నిర్దిష్ట ప్రదేశం నుంచే ఎందుకు చేయాలి?… గతంలో మద్రాసు ఒకసారి, హైదరాబాద్ ను మరోసారి పోగొట్టుకోవడం వల్ల ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రెండుసార్లు దెబ్బతింది.మీరు మీ గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో వేస్తే బాధపడటం ఖాయం…దీన్నే చరిత్ర మనకు చెబుతుంది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా మీరు అదే విధానాన్ని ఎందుకు కొనసాగించాలనుకుంటున్నారు?…ఇది లాజికల్ గాని, హేతుబద్ధమైన ఆలోచన కాని కాదన్నారు.
చంద్రబాబు చేసింది అభివృద్ది కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం
చంద్రబాబు తయారుచేసిన ప్రణాళిక ప్రకారం అమరావతిలో కొత్త రాజధానిని నిర్మించడానికి 1,00,000 కోట్ల రూపాయలు అవసరమని సిఎం జగన్ చెప్పారు. అలు భారీ నిర్మాణాలు నిర్మించడానికి అనువుగాని ప్రదేశంలో అలాంటి వాటి కోసం పేద రైతుల నుంచి స్వాధీనం ద్వారానో, లేక పూలింగ్ తోనో 33,000 ఎకరాలు సేకరించడం ఎందుకు?…అలాంటి నిర్మాణాలు అనువుగా ఉన్న చోట 500 ఎకరాలు తీసుకుంటే సరిపోయోది కదా అన్నారు. ఇక ఇప్పుడు తమ ముందున్న చంద్రబాబు, ఆయన మిత్రుల భూ ఒప్పందాలను ప్రత్యేక దర్యాప్తు బృందం పరిశీలిస్తోందని సిఎం జగన్ తెలిపారు. “స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది…పేద రైతుల నుండి భూములు కొన్నారని…ఆ తరువాతే రాజధాని ప్రకటన ఆ తరువాత ఒక భారీ కుంభకోణం చోటుచేసుకుందని అన్నారు. చౌకగా భూమిని కొనుగోలు చేసిన వారు వేల కోట్ల రూపాయల లబ్ధి పొందారు. ఇది ఒక నిర్దిష్ట వర్గానికి ప్రయోజనం చేకూర్చడానికి జరిగిందని, ఇక్కడ జరిగింది పాలన కాదని రియల్ ఎస్టేట్ వ్యాపారమని తేల్చేశారు.
అమరావతిని దెబ్బతీయడమా?
అమరావతిని ఉద్దేశ్యపూర్వకంగా దెబ్బ తీస్తున్నారనే విమర్శను సిఎం జగన్ తోసిపుచ్చారు. అసలు మనం కేవలం అమరావతి గురించే ఎందుకు బాధపడాలి?…రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి ఆలోచించాలి…అలా జరుగుతుందని మాకు నమ్మకం ఉంది. మేము అమరావతిని వదిలేయలేదు.
శాసనసభ అమరావతి నుండి పని చేస్తూనే ఉంటుంది. అసలు ప్రజాభిప్రాయ సేకరణకు రిఫరెండం అవకాశం ఉంటే మేము దానికే వెళ్లేవాళ్లం…ప్రజలు కూడా మాకే మద్దతు పలికేవారు. ఏదేమైనా మా అభివృద్ది వికేంద్రీకరణ ను ప్రజలు పూర్తిగా హర్షిస్తారనే నమ్మకం తమకు ఉందని జగన్ వివరించారు. ఏదేమైనా అమరావతిపై తాజాగా నెలకొన్న రగడ నేపథ్యంలో సిఎం జగన్ అదే విషయం గురించి ఇంత వివరంగా అదీ ఒక జాతీయ మీడియాకు ఎందుకు చెప్పారనేది ఇప్పుడు లేటస్ట్ హాట్ టాపిక్ గా మారింది.