బిజెపి ‘తెలుగు డ్రీం’ నిజమవుతుందా

ప్రధాని నరేంద్రమోదీ వంటి ‘బాహుబలి’ ఉన్నా తెలుగురాష్ట్రాలలో బిజెపిని స్వతంత్రంగా నడిపించే మొనగాడే లేడని రుజువయింది. ఒక సన్యాసి, స్వామీజీ ఆ బాధ్యతను స్వీకరించారు.

పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, విద్యాసంస్థల అధినేతలు, కాకాలు తీరిన నాయకులు, ఆర్  ఎస్ ఎస్ నేపథ్యంతో వచ్చిన నేతలు ఎవరూ బిజెపిని  తెలుగు రాష్ట్రాలలో ఒక బలమయన పార్టీగా మార్చలేకపోయారు. ఎవరూ ఈ  పార్టీని ఒక రాజకీయ శక్తిగా తీర్చదిద్ద లేక పోయారు.

ఈ పార్టీకి అయోధ్య రామాలయ ఉద్యమం ఉపయోగప డలేదు. కార్గిల్ విజయం పనికారాలేదు. తెలంగాణకు పార్టీ ఇచ్చిన మద్దతు కూడా ఓట్లు తీసుకురాలేకపోయింది. చివరకు బిజెపిని కేంద్రంలో సునాయాసంగా అధికారంలోకి నడిపించిన నరేంద్ర మోదీ శక్తి, అమిత్ షా యుక్తి కూడా పని చేయలేదు.  పొత్తు ఉంటే తప్ప పదివోట్లు కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉన్న ఈ పార్టీకి ఇపుడున్న ఖద్దరు నేతలెవరూ పనికిరారని బిజెపి అధిష్టానం గుర్తించింది.

ఒక సన్యాసికి పార్టీ పగ్గాలు అప్పగించి  ఉత్తరప్రదేశ్ ప్రయోగం  చేయాలనుకుంటున్నది. అందుకే  బిజెపి చివరకు కాకినాడ శ్రీ పీఠానికి సంస్థాపకుడు స్వామి పరిపూర్ణానందను బిజెపిలోకి ఆహ్వానించింది. ఆయన శుక్రవారం నాడు ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీ లో చేరారు.

స్వామీజీ చేరికతో హిందూ ఓట్లన్ని ఒక్కటై బిజెపి బలోపేతం చేసి 2019లో మోదీ మరొక సారి ప్రధాని అయ్యేందుకు అవసరమయిన లోక్ సభ స్థానాలు  తెస్తాయని బిజెపి ఆశ.  యూపిలో యోగి అధిత్యనాథ్ దాస్ ప్రయోగం విజయవంతమయింది. అలా ఆంధ్ర, తెలంగాణలో కూడా స్వామి పరిపూర్ణానంద ప్రయోగం  నడుస్తుందని, దక్షిణాదిలో మరొక ఉత్తర ప్రదేశ్ తయారవుతుందని బిజెపి దూరాలోచనలాగా కనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్ అవుతాయా?

స్వామి పరిపూర్ణానంద  తెలుగు రాష్ట్రాలలో యోగి అదిత్య నాథ్ అయ్యే అవకాశం ఉందా? ఉత్తర ప్రదేశ్ పరిస్థితులు ఆంధ్ర , తెలంగాణలలో ఉన్నాయా?

ఉత్తర ప్రదేశ్ ఎపుడూ మత రాజకీయాలో అగ్ని గుండంలా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలెపుడూ అలాగ లేవు. మతఘర్షణలు ఎపుడైనా ఉండినా అవి హైదరాబాద్ కే పరిమితమయ్యాయి. అవిపుడు చరిత్రలో భాగమయ్యాయి. ఇపుడు హైదరాబాద్ ఎకానమీలో కీలక పాత్ర పోషిస్తున్న మిల్లీనియల్ జనరేషన్ అంటే 1994 తర్వాత పుట్టిన జనరేషన్ కు మత ఘర్షణలంటే ఏమిటో, మత ఉద్రికత్త అంటే ఏమిటో తెలియదు. అసలు పార్టీల వూరేగింపులకు యువకులే దొరకడం లేదు. పార్టీ ల యూత్ వింగ్ లలో  యూతే వుండటమే లేదు. పార్టీలకు స్టూడెంట్ వింగ్స్ లేవు. ఉన్నా అవి నామమాత్రమే, లీడర్ల కొడుకులకు, వాళ్ల  మిత్రులకే పరిమితమయ్యాయి.యువకులు, విద్యార్థులు బాగా డిపొలిటిసైజ్ అయిపోయారు.   పార్టీల జనసమీకరణ భారీ  వ్యాపారమయింది. డబ్బులిస్తే, వేయి, రెండు వేలు, మూడు వేల నుంచి 50 వేల దాకా జనాలను సమీకరించే కొత్త ‘ఈవెంట్ మేనేజ్ మెంట్ ’ తయారయింది. ఈ జనరేషన్ కు ఫుల్ డబ్బుంది. వీళ్లే హైదరాబాద్ ను ఫుడ్ లోగాని, పబ్ లలోగాని, ఫ్యాషన్ లోగాని గ్లోబల్ సిటి చేస్తున్నది. వీళ్లకి కుల, మత రాజకీయాలు సెకండరీ. వీళ్ల చూపంతా అమెరికా మీద ఉంటుంది. అమెరికా వెళ్ల లేకపోయిన ఈ తరం హైదరాబాద్ లో అమెరికన్ లాాగా బతకాలనుకుంటుంటారు. వీళ్లే హైదరాబాద్ కు ప్రాణం. వీళ్ల కుటుంబాలన్నీ ఈ సంపదను అనుభివిస్తూ హ్యాపీ గా అమెరికన్ డ్రీం కంటున్నాయి. 

 

ఉత్తర ప్రదేశ్ ఈ స్థితికి రాలేదు. అక్కడి సమ ాజం మతావేశంతో వూగుతూ ఉంది. దేశంలో మత సంబంధ ఘర్షణలేవయినా ఎక్కడయినా జరిగాయంటే అవి మొదట ఉత్తర ప్రదేశ్ లోనే పుడుతున్నాయి. తర్వాత ఎక్కడెక్కడికో పాకుతున్నాయి. ఈ వాతావరణంలో 1994లో అజయ్ సింగ్ బిస్త్ అనే బిఎస్సి చదివిన యువకుడు దీక్ష తీసుకుని యోగి అదిత్య నాథ్ అయ్యాడు. అపుడాయన వయస్సు 22 సంవత్సరాలు.

 

ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాలి. అజయ్ సింగ్ బిస్త్ ఠాకూర్ కులానికి చెందిన వాడు.  ఉత్తర ప్రదేశ్ లో ఠాకూర్ల జనాభా దాదాపు 5 నుంచి ఆరు శాతం దాకా ఉంటుంది. అందుకే ఆయన రాజ్ నాథ్ సింగ్ లాంటి సంప్రాదాయిక బిజెపి నేతను పక్కకు తోసేసినా ఠాకూర్లు ఆగ్రహించలేదు.

 

26 సం. వయసులో ఆయన గోరఖ్ పూర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన రాజకీయాలన్నీ హిందూ మతం , ముస్లిం విద్వేషం చుట్టూ తిరుగుతుంటాయి. సన్యాసం, వీధిరాజకీయాలు ఆయన వ్యూహం. రక్తానికి రక్తం ఆయన విధానం. 1999లో సమ ాజావాది పార్టీ జైల్ భరో ఆందోళన నిర్వహిస్తున్నపుడు  ఆ పార్టీనేత తలత్ అజీజ్ ఒక సభలో ప్రసంగిస్తున్నారు.అపుడు స్టేజీ మీద కు కాల్పలు జరిపారు. దీని వెనక యోగి హస్తముందన్నది ఆరోపణ. ఇలా యోగి రాజకీయ జీవితంతో హిందూ మతావేశం, ముస్లిం విరోధం,సాయుధం, రక్త సిక్తం… అయింది. ఇది మతకల్లోలానికి దారి తీసింది. యోగి మీద ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. 2002లో ఆయన హిందూ యువ వాహిని అనే సాంస్కృతిక సంస్థను స్థాపించారు. పేరుకే ఇది సాంస్కృతిక సంస్థ. అయితే, ఆయన  ముస్లింలకు వ్యతిరేకంగా ఆయన తయారు చేసిన  అర్మీ లాంటిది.  2005లొో ఆయన అయిదువేల అంది క్రైస్తవులను, ఇతర మతాల వారిని హిందువులు  మార్చి ఉత్తర ప్రదేశ్ ను, భారత దేశాన్ని  హిందూ  ప్రాంతంగా మార్చేస్తానని శపథం చేశారు. నిజానికి  ఇది మొదట చిన్న గోరక్షక్ మంచ్ గా తయారయింది. హిందూమతావేశం రేకెత్తించేందుకు ఇది చాలదు కాబట్టి ఆయన దీనిని హిందూ యువ వాహినిగా మార్చారు. హిందూ మతం,గో రక్షణ పేరుతో  ప్రతి సంఘటనని  ఈ సంస్థ హిందూ మత క్యాంపెయిన్ గా మార్చింది.  ఈ సంస్థ ఏర్పడినప్పటినుంచి 2007 దాకా 22 మత కల్లోల ఘటనలు జరిగాయని చెబుతారు.

ఆయన ప్రసంగాలు మొత్తం ముస్లిం వ్యతిరేక, పాకిస్తాన్ వ్యతిరేక సందేశంలో నిండిపోయి ఉంటాయి. షారుఖ్ ఖాన్ ని ఆయన పాక్ టెర్రరెస్టు  హఫీజ్ సయీద్ తో పోల్చాడు. భారత్ లో ఉన్నవారంతా సూర్యనమస్కారాలు చేయాలని, అలా చేయని వాళ్లు భారత్ లో ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పారు. ఈ ధోరణి యే అన్ని అయిదు సార్లు ఎంపిని చేసింది. 7500 మించిన ఆయన తొలి అధిక్యత  లక్షా డెబ్బయిదు వేలు దాటింది.

 

ఇలా యోగి రాజకీయ జీవితం హిందూ మతావేశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది.  తెలుగు రాష్ట్రాలలో, చివరకు హైదరాబాద్ నగరంలో కూడా, ఎక్కడా హిందూమతావేశం పెల్లుబికే పరిస్థితులే లేవు. ఆంధ్రలో ముస్లింలు చాలా ప్రాంతాలలో హిందువులతో కలసిపోయే ఉంటారు. రాయలసీమ లో ముస్లింలు సగం హిందువులు. హిందువులకు ముస్లింల మీద అంత శత్రు వైఖరి లేదు. మొక్కులు తీర్చుకునేందుకు దర్గాలను సందర్శించడం ఒక సంప్రదాయం.

 

ఇలాంటి వాతావాతరణంలో  శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద శుక్రవారం బీజేపీలో చేరి, ఆ పార్టీ ని హిందూ సమీకరణ కోసం  సాధనంగా వాడగలరా? అనుమానమే. 

 

అంతేకాదు, పరిపూర్ణానంద కూడా చక్కని దక్షిణ భారత స్వామీజీ. దక్షిణాన పెద్దగా హిందూ ఉద్యమాల్లేవు. యోగిగారి ‘గోరక్ష’కుల సైన్యాలు ఇక్కడ తయారు కాలేదు. తెలుగు నాట ఉన్న ఏ స్వామీజీ కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు. చేసినా సాధ్యమయ్యేది కాదు. ఇక్కడ నేరుగా ముస్లింలను అటాక్ చేయడం సాధ్యం కాదు. చరిత్రను చూపో, పాకిస్తాన్ నుచూపో హిందువులను ఏకం చేయాలి. ఇక్కడి ముస్లింలను మిలిటెంట్లు చేసేందుకు ముస్లిం సంస్థలకే చేత కాలేదు. తెలుగు రాష్ట్రాల ముస్లింలు ఇక్కడి సమాజంలో బాగా ఒదిగిపోయారు. అందుకే ఎంఐఎం  ఎంత ప్రయత్నించినా హైదరాబాద్ బయట నిలబడలేకపోతున్నది. ఇక సౌమ్యుడయిన తెలుగు స్వామీజీకి  ఆవేశం వచ్చెదెట్లా, హిందూ సమాజం, వందేమాతరం వంటి నినాదాలు  తెలుగు రాష్ట్రాలలో పని చేసేలా లేవు.

స్వామి పరిపూర్ణానంద కూడా ఈ మధ్య కత్తి మహేశ్ వల్ల  మిలిటెంట్ హిందూ అయ్యారు గాని ఆయన ఎపుడూ  హిందూ ఆవేశంతో ప్రసంగించి, గొడవలు సృష్టించి వార్తలకెక్కిన దాఖల లేదు. 

 

  ఇలాంటి  స్వామీజీని తెలుగు ప్రజలు రాజకీయనాయకుడిగా చూడగలరా? రాజకీయ నాయకుడి బాధ్యతలను ఆయన నిర్వర్తించగలరా. అనుమానమే.

 

తెలుగు రాష్ట్రాలలో  రాజకీయ నాయకుడంటే చాలా బాధ్యతలు నిర్వర్తించాలి. రాజకీయ నాయకుడంటూ ప్రజలలో బాగా దురభిప్రాయం ఉంది. అదే వారి క్వాలిఫకేషన్ కూడా.  పైరవీలు చేయాలి, కమిషన్లు వాటాలు దండుకోవాలి, దాడులు చేయించాలి, చిన్న చిన్నమాఫీయ పనులు చేయాలి, మాఫీయాకు అండగా ఉండాలి.  స్థానిక సమస్యల మీద వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలి. అరెస్టయిన వారిని విడిపించాలి,అరెస్టులు చేయించాలి. బెదిరించాలి, భయపెట్టాలి. లేదా ఈ బాపతు జనాన్నిపోగేసుకొవాలి. ప్రోత్సహించాలి.

 

ఉత్తర  ప్రదేశ్ యోగి రాజకీయప్రవేశం రాజకీయాలతోనే మొదలయింది. అక్కడి పరిస్థితులు ఆయన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చాయి. ఇక్కడి పరిస్థితులు స్వామి పరిపూర్ణానందను రాజకీయల్లోకి తీసుకువస్తున్నా ఆయన విజయవంతమయ్యేందుకు హిందూ సమీకరణ జరిగే పరిస్థితులు ఆంధ్రలో గాని, తెలంగాణలో గాని ఉన్నట్లు కనిపించవు. ఈ రాష్ట్రాలలలో ఖద్దరు నేతలు బాగా పాతుకుపోయి ఉన్నారు. వాళ్లని రీప్లేస్ చేయాలంటే వాళ్లను అన్నింటా మించిపోవాలి.

 

 హిందూ ఆవేశంతో ఉత్తర ప్రదేశ్ రాజకీయాలలో యోగి సులభంగా కల్యాణ్ సింగ్, రాజ్ నాథ్ సింగ్ వంటి వాళ్లను పక్కకు తోసేయ గలిగారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కెసియార్ చాలా బలమయిన ప్రాంతీయ నాయకులు. వాళ్లు జాతీయ పార్టీలను ఇక ఎదగనీయరు. మహా అంటే పొత్తు పెట్టుకుని నాలుగు సీట్లివ్వగలరు. మత భావాలు రెచ్చగొట్టి, హిందువులను ఏకం చేసి, తమ కాళ్లకింద భూమి కదిలేలా బిజెపి చేస్తే వూరుకునే నాయకులు కాదు. ఇలాంటి నేతలు తెలుగు రాష్ట్రాలలో స్వామీజీకి  సూదిమొన మోపేంత రాజకీయ జాగాను కూడా ఇవ్వరు. 

ఇలాంటి వాతావరణంలో మోదీ- అమిత్ షా చేయలేని పనిని శ్రీ పీఠం స్వామీజీ చేయగలరా?