మరోసారి నవ్వులపాలైన కాంగ్రెస్ పార్టీ 

Sonia Gandhi and Rahul Gandhi
“ఈ భారాన్ని నేను మొయ్యలేను.  మరొకరిని చూసుకోండి”  అంటుంది సోనియా గాంధీ.  
 
“ఇంత పెద్ద పదవికి నేను న్యాయం చెయ్యలేను…గాంధీయేతర కుటుంబం నుంచి మరొక సమర్దుడిని ఎన్నుకోండి” అని కిరీటాన్ని తీసి కింద పడేసి అంటాడు రాహుల్ గాంధీ..
 
తీరా పార్టీ నాయకత్వం మార్పిడి జరగాలి అని కొందరు సీనియర్ నాయకులు లేఖ వ్రాస్తే “ఈ సమయంలో లేక రాస్తారా?  మీరంతా బీజేపీతో కుమ్మక్కయ్యారు” అంటాడు మహా అజ్ఞాని రాహుల్ గాంధీ.  
 
Sonia Gandhi and Rahul Gandhi
 
గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్, వీరప్పమొయిలీ లాంటి నేతలు రాహుల్ గాంధీ కళ్ళు తెరవకముందునుంచి కాంగ్రెస్ పార్టీలో నాయకులు.  ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీల  తరాలు చూడటమే కాక, వారితో కలిసి పనిచేసిన అనుభవజ్ఞులు.  ముఖ్యమంత్రులుగా, కేంద్రమంత్రులుగా వివిధ స్థాయిల్లో పనిచేసిన అగ్రనేతలు.  వారితో పోల్చితే ఇందిరాగాంధీ మనుమడు అనే అర్హత తప్ప రాహుల్ గాంధీలో ఏమైనా ఒక నాయకత్వ లక్షణం ఉన్నదా?  నాయకులంతా కోరి కోరి పార్టీ అధ్యక్షుడిని చేస్తే దాన్ని నిర్వహించడం చేతకాని అసమర్ధుడు.  పైగా సీనియర్లు అడ్డం పడుతున్నారంటూ కుంటిసాకులు చెపుతూ తన సోమరితనాన్ని బహిర్గతం చేసుకున్న మూర్ఖుడు.  సీనియర్లు, జూనియర్లు అందరినీ సమన్వయము చేసుకుంటూ పార్టీని నడిపించడమే నాయకుల లక్షణం.  
 

2004 లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వాళ్ళ అధికారంలోకి వచ్చిందా?

2004 లో కేవలం సోనియాగాంధీ ప్రతిభ వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎవరైనా భావిస్తే వారిని పిచ్చివారికింద జమకట్టాలి.  అప్పట్లో కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్న నాయకులు తమ సమర్థతతో గెలిపించారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు దేశంలోనే అత్యధికంగా ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి సహకరించారు.  సోనియాగాంధీని భారతీయులు ఎన్నడూ తమ వ్యక్తిగా భావించలేదు.  ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను “మన ఇంటి మనుషులు” అనుకున్నట్లుగా సోనియాగాంధీని భారతీయులు స్వీకరించలేదు.  ఆమెకు భారతీయ భాషలు తెలియవు.  భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు తెలియవు.  భారతదేశపు కోడలు కాబట్టి సాంకేతికంగా ఆమె  భారతీయురాలు కావొచ్చు.  కానీ మానసికంగా ఆమె భారతీయుల హృదయాలకు చేరువ కాలేదు.  ప్రధాని పదవిని తిరస్కరించిన త్యాగమూర్తి అని ఆమెను కొందరు మెచ్చుకుంటారు కానీ దానిలో ఏమాత్రం వాస్తవం  లేదు.  తనను ప్రధానిగా ఈ దేశప్రజలు అంగీకరించరు అని ఆమెకు తెలుసు. అందుకే కీలుబొమ్మ లాంటి మన్మోహన్ సింగ్ ను పీఠం మీద కూర్చోబెట్టి అవధులు లేని అధికారాన్ని చెలాయించారు ఆ తల్లీకొడుకులు.  
 
 
ఇక పదిహేనేళ్లుగా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఉన్నారు.  పార్టీకి ఆయనే ఆకర్షణ.  2014 లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది.  మరి అలాంటప్పుడు యువకుడైన రాహుల్ గాంధీ దేశంలో పర్యటించి కాంగ్రెస్ పార్టీని బతికించడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా?  బీజేపీని అధికారంలోకి తీసుకుని రావడానికి అద్వానీ ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు రెండు మూడు సార్లు  రథయాత్ర చేశారు.  ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితమే చంద్రశేఖర్ దేశవ్యాప్తంగా నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేనువందల కిలోమీటర్ల పాదయాత్రను చేశారు.  చంద్రబాబు నాయుడు సుమారు మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.  జగన్ జైలులో నిర్బంధించబడినపుడు షర్మిల ముప్ఫయి రెండు వందల  కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీని బ్రతికించారు. జగన్ మూడువేల అయిదు వందల కిలోమీటర్ల పాదయాత్రను చేశారు.  వారందరి యాత్రలు ఫలించాయి.  మరి అలాంటి ప్రయత్నం ఏమీ చెయ్యకుండా రాహుల్ గాంధీ ఈరోజు వరకు ప్రజల్లో తన ప్రభావాన్ని చూపించలేక చతికిలబడ్డారు.  

కుమ్మక్కు మాటలతో ఒరిగిందేమిటి

ఇక బీజేపీతో కుమ్మక్కయ్యారని అహంభావంతో సీనియర్లను అవమానించిన రాహుల్ గాంధీ పొడించింది ఏమిటి?  తమ పార్టీకి బద్ధ శత్రువు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఆయన కుమ్మక్కు కాలేదా?  తెలుగుదేశం తో కలిసి కూటమి కట్టలేదా?  సీనియర్లను అంతమాట అనడానికి రాహుల్ గాంధీకి అసలు సిగ్గు అనేది ఉన్నదా?  వారంతా ఆగ్రహించగానే నేను అలా అనలేదని వారికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి వారిని శాంతింపజేశారు. సీనియర్ నాయకులను అవమానించడం అనే దుర్లక్షణం గాంధీల కుటుంబంలోనే ఉన్నది.  పార్టీలో సీనియర్ అయినా సర్దార్ పటేల్ ను కాదని నెహ్రూకు పదవి కట్టబెట్టారు మహాత్మా గాంధీ. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం, ఎన్జీ రంగా లాంటి మహానాయకులు కాంగ్రెస్ పార్టీని వదలడానికి కారణం అధిష్టానం కాదా? ఆ తరువాత ఇందిరాగాంధీ హయాంలో నీలం సంజీవరెడ్డి, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్, జయప్రకాశ్ నారాయణ్, చంద్రశేఖర్, మర్రి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, శరద్ పవర్, మూపనార్  లాంటి సీనియర్ నాయకులను అవమానించి పార్టీకి దూరం చేశారు.  రాజీవ్ గాంధీ హయాంలో ప్రణబ్ కుమార్ ముఖర్జీ, ఎన్డీ తివారి లాంటి సీనియర్ నాయకులను పార్టీనుంచి దూరం చేశారు. 
 
 
తగినంత సంఖ్యాబలం లేకపోయినా, అయిదేళ్లపాటు పార్టీని అధికారంలో ఉంచి, దేశాన్ని ఆర్ధికంగా అభివృద్ధిపధంలోకి తీసుకెళ్లిన పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం ఏమిటి?  ఆయనకు లోక్ సభ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడమే కాక, ఆయన మరణించిన తరువాత పార్ధివదేహాన్ని పార్టీ ఆఫీసులోకి అనుమతించని దురాత్మురాలు సోనియాగాంధీ.nవైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత ఆయన పేరును సిబిఐ ఛార్జ్ షీట్లలో చేర్చడమే కాక, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా అవమానించి పార్టీనుంచి వెళ్లేట్లు చేశారు.  అంతటితో ఆగకుండా ఆయన మీద అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైల్లో బంధించారు.  జగన్ మీద కేసులు బనాయించడానికి, జైల్లో ఉంచి బెయిల్ రాకుండా చూడటం వెనుక రాహుల్ గాంధీ ఒత్తిడి ఉన్నదని, చాలామంది సోనియా గాంధీని అనుమానిస్తారని, కానీ, అసలు దొంగ రాహుల్ గాంధీ అని కొన్నాళ్లక్రితం ఒక కాంగ్రెస్ నాయకుడు నాతో చెప్పారు.  సొంతబలం కలిగిన నాయకులను  ఏనాడూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సహించలేదు. నిన్నగాక మొన్న సచిన్ పైలట్ ను ఎంత దారుణంగా పరాభవించారు?   సింధియా ఎందుకు దూరం అయ్యాడు?  కాంగ్రెస్ అధిదేవతలకు కావలసింది  కేవలం భజనలు చేసే బానిసలు.  “నువ్వు తప్ప దిక్కులేదు” అని కాళ్లావేళ్లా పడి ప్రార్ధించే పాదవాహకులు. 

కాంగ్రెస్ ముందున్న దారేంటి

 
Sonia Gandhi, Congress Party President
 
సోనియా గాంధీ పని అయిపొయింది.  ఆరోగ్య రీత్యా ఆమె చురుకుగా ఉండడం కష్టం.  రాహుల్ గాంధీ ఏనాడో చేతులు ఎత్తేశాడు.  ఆయన పరమ అసమర్ధుడుగా ఏనాడో రుజువు చేసుకున్నాడు. ప్రియాంక గాంధీ చిరునవ్వులు, నాయనమ్మ పోలికలు చూసి జనం బుట్టలో పడరు అని ఇప్పటికి రెండుసార్లు విస్పష్టంగా తేలిపోయింది.  
 
 
అదృష్టం ఏమిటంటే ఈనాటికీ కాంగ్రెస్ పార్టీకి ఊరూరా అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని సొంతం చేసుకున్నవారు ఉన్నారు.  కానీ, నాయకత్వమే పరమ అసమర్ధత, సోమరితనంతో నిండి ఉంది. ఈ దేశాన్ని అభివృద్ధి చేశారన్న కృతజ్ఞత కాంగ్రెస్  పార్టీ పట్ల ఉన్నది.  బలమైన ప్రతిపక్షం ఉండాలన్న ప్రజాస్వామ్యబద్ధమైన కోరిక ఉన్నది.  ఇలాంటి  సమయంలో కాంగ్రెస్ పార్టీని బతికించడానికి యువరక్తం కావాలి.  సమర్థులు, చురుకైనవారు, ప్రజాకర్షణ కలిగినవారు, వాగ్ధాటి కలిగినవారు, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల మీద అవగాహన కలిగినవారు పార్టీ అధినేతలు కావాలి. వంశాల ప్రతిష్టలు చూసి జనం ఓట్లు వేసే రోజులు ఏనాడో అంతరించాయి.  ఆ రహస్యం గుర్తించనన్నాళ్లు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు.  ముఖ్యంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీల కబంధహస్తాలనుంచి పార్టీని రక్షించాలి.   పార్టీ కాకుండా  వ్యక్తులే  ముఖ్యం  అనుకుంటే కాంగ్రెస్ పార్టీని భగవంతుడు కూడా కాపాడలేడు.  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు