వివాదంలో నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్

ఏదైనా జ్వరం వచ్చినా రోగమొచ్చినా డాక్టర్లను దేవుళ్ళకంటే ఎక్కువగా నమ్ముతాం. ఎందుకంటే కనిపించని దేవుని కన్నా మన ప్రాణం నిలిపే డాక్టర్ నే దేవుడిగా చూస్తాం. కానీ నేడు ఆ వైద్య వృత్తి కొంత మంది కాసుల కక్కుర్తి, నిర్లక్ష్యం వల్ల ప్రాణాలనే తీస్తుంది. ఏ మహిళకైనా అమ్మ  కావడం తన జీవితంలో ఎంతో సంతోషకరమైన విషయం. అటువంటి ఆనందాన్ని పొందకముందే పురిట్లోనే ఎంతో మంది మహిళలు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోతున్నారు. తల్లి లేని పిల్లలుగా చిన్నారులు మిగిలిపోతున్నారు. చిన్నారులు చనిపోతే మానసిక క్షోభతో తల్లులు నరకం అనుభవిస్తున్నారు. కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ నిర్లక్ష్యాల వల్ల అమాయకులు బలైపోతున్నారు. పోలీస్ వ్యవస్థను, రాజకీయ అండను తమ అదుపులో పెట్టుకొని తానా తందానా అంటూ మనుషుల ప్రాణాలతో ఆటలాడుతున్నాయి ఆసుపత్రులు. నెల రోజుల వ్యవధిలోనే రెండు నిండు ప్రాణాలు బలిగొన్న నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ నిర్లక్ష్యంపై తెలుగు రాజ్యం ప్రత్యేక స్టోరీ…

స్వాతి, భర్త క్రాంతికుమార్

         స్వాతి దంపతుల కుమారుడు

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన సాపిడి స్వాతిని గత సంవత్సరం జనగాం జిల్లాకు చెందిన క్రాంతికుమార్ కిచ్చి వివాహం జరిపించారు. దంపతులిద్దరూ హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో ఉండేవారు. క్రాంతికుమార్ అరబిందో ఫార్మసిలో పనిచేసేవారు. స్వాతి ఇంటి వద్దే ఉంటూ గ్రూప్స్ ఎగ్జమ్స్ కు ప్రిపేర్ అయ్యేది. స్వాతి గర్భం దాల్చగా డెలివరీ కోసం అమ్మగారి గ్రామమైన ఆరెగూడెంకు వచ్చి కామినేని హాస్పిటల్ నార్కట్ పల్లిలో చికిత్స తీసుకుంటుంది. గత నెల 13న స్వాతి డెలివరీ కోసం హాస్పిటల్ లో చేరగా ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు సిద్దమయ్యారు. అయితే ముందుగా ఒక ట్రైనీ డాక్టర్ వచ్చి స్వాతికి మత్తు సూది ఇచ్చారు. ఆ తర్వాత ఇది తెలియని మరో డాక్టరు వచ్చి స్వాతికి మళ్లీ మత్తు సూది ఇచ్చారని బంధువులు తెలిపారు. దీంతో ఆమెకు డోస్ ఎక్కువైంది. ఆపరేషన్ చేయగా స్వాతి బాబుకు జన్మనిచ్చింది. బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ స్వాతి ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. ఆపరేషన్ చేసిన గంటలోపు పేషంట్ ను బంధువులకు చూపించాల్సి  ఉన్నా ఐసీయూలో ఉంది చూడటానికి వీల్లేదు అంటూ డాక్టర్లు నాటకమాడారని బంధువులు తెలిపారు. ఆ తర్వాత బంధువులు ఆందోళన చేయగా స్వాతి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణించిదని చావు కబురు సల్లగా చెప్పారు. స్వాతి బంధువులు ఆందోళన చేయగా దిక్కున్న చోట చెప్పుకోపోండి అవసరమైతే కేసు పెట్టుకోండని హస్పిటల్ యాజమాన్యం నిర్ధాక్షిణంగా మాట్లాడారని బందువులు వాపోయారు. బంధువులు ఆందోళన చేస్తున్న క్షణంలోనే పోలీసులు అక్కడకు చేరుకొని ఎటువంటి హామీని కూడా ఇప్పించకుండా వారిని అక్కడి నుంచి పంపించారు.  స్వాతి వయస్సు 24 సంవత్సరాలే కావడం బిడ్డ పెళ్లి అయిన సంవత్సరంలోనే చనిపోవడంతో స్వాతి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. స్వాతి భర్త క్రాంతి కుమార్ తన కొడుకును చేతిలో పట్టుకొని  ఈ బిడ్దకు దిక్కెవరంటూ రోధించిన తీరు అందరిని కలిచివేసింది. అందరూ ఏడుస్తుంటే తన తల్లి లేదన్న విషయం తెలియక ఆ చిన్నారి నవ్వుతున్నా కూడా అందరి ముఖాలు బోసి పోయాయి. ప్రైవేటు డాక్టర్ల నిర్లక్ష్యంతో రెండు జీవితాలు, రెండు కుటుంబాలు దిక్కులేని పక్షిలా అయ్యాయి.

 

ఈ వీడియో స్వాతి బంధువుల సహకారంతో తీసుకున్నది

వర్రె లక్ష్మీపార్వతి

తాజాగా మంగళవారం శాలిగౌరారం మండలం ఊట్కూరు  గ్రామానికి చెందిన వర్రె లక్ష్మీపార్వతి డెలివరీ కోసం కామినేని ఆస్పత్రిలో చేరగా ఉదయం  11 గంటలకు ఆపరేషన్ చేయగా ఆమె బాబుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమెకు బ్లీడింగ్ అయ్యి రక్తస్రావం కంట్రోల్ కాలేదు. దీంతో వైద్యులు ఆమె కుట్లు విప్పి మళ్లీ ఆపరేషన్ చేశారు. బ్లీడింగ్ కంట్రోల్ అయినప్పటికి వెంటవెంటనే రెండు సార్లు ఆపరేషన్ కావడంతో ఆమె పరిస్థితి విషమించడంతో కన్ను మూసింది. ఊట్కూర్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వగ్రామం, పార్వతి బంధువులు  ఆందోళన చేయగా క్షణాల్లో వాలిన ఖాకీలు వారిని ఆందోళన చేయకుండా అడ్డుకొని అక్కడి నుంచి పంపించివేశారు. అయితే కామినేని హాస్పిటల్ లో ఎవరైనా చనిపోతే ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారంగా కామినేని యాజమాన్యం చెల్లించదు. పోలీసులు కూడా క్షణాల్లో వాలిపోతారు. అసలు పోలీసులకు, డాక్టర్లకు లింకేంటి అని బాధితురాలి బంధువు తీగ లాగితే కొన్ని నిజాలు తెలిశాయి. అవి తెలుగు రాజ్యానికి వివరించారు. అవేంటో మీరు కూడా చదవండి.

“కామినేని హాస్పిటల్స్డ్ సీఎండీగా కామినేని సూర్యనారాయణ, ఎండీగా కామినేని శశిధర్ వ్యవహరిస్తున్నారు.దాదాపు వేలాది మంది ఉద్యోగులు ఈ హాస్పిటల్స్ లో పని చేస్తున్నారు. పోలీసులకు కల్పించే ఆరోగ్య భద్రత ఈ ఆసుపత్రులలో వర్తిస్తుంది. దీనిని అదునుగా చేసుకున్న యాజమాన్యం పోలీసులతో మంచి మైత్రినే కొనసాగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కుటుంబాలకు ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించింది. పోలీసు సమావేశాలకు ఎల్బీ నగర్ లోని కామినేని హాస్పిటల్ లో ఉన్న  హాల్‌ను పోలీసులు ఉపయోగించుకుంటారు. నిత్యం వందలాది మంది పోలీసులు ఈ ఆసుపత్రిలో తక్కువ రాయితీతో వారి బంధువులకు కూడా చికిత్ప చేయించుకుంటారు. ఇలా ఎవరైనా చనిపోయి ఆందోళన చేస్తే పోలీస్  డిపార్టుమెంట్ అంతా క్షణాల్లో గద్దలలాగా కామినేని ఆసుపత్రి ముందు వాలిపోతారు. మెడికల్ కళాశాల అనుబందంగా ఉన్న ఆసుపత్రి తక్కువ ఫీజులకు మిగతా చికిత్సలు చేయాలనే నిబంధన ఉంది. అందుకే కామినేని వారు క్యాంపులని, ఉచిత చికిత్సలని ప్రజలను మోసం చేసి ఆసుపత్రికి వచ్చాక శవాలను అప్పగిస్తారు. పోలీసుల సహాయం  ఉందనే కామినేని యాజమాన్యం బాధితుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది” అని బాధితురాలి బంధువు తెలిపారు. కామినేని యాజమాన్యం అందులో పనిచేసే ఉద్యోగులకు కూడా మూడు నెలలకు ఒక్కసారి అది కూడా ఒక్క నెల జీతం చెల్లించి మిగిలిన రెండు నెలల జీతాలు పెండింగ్ లోనే పెడుతుందని తెలుస్తోంది. ఎవరైనా ఉద్యోగి జీతాల గురించి అడిగితే నిర్థాక్షిణంగా డ్యూటి నుంచి తొలగిస్తారట. దీంతో బతుకుజీవుడా అనుకుంటూ కామినేని ఉద్యోగులు తమ జీవితాలు వెళ్లదీస్తున్నారని కుటుంబాలు గడవక, వేరే పనులు చేయలేక అద్వాన్న స్థితిలో దుర్భర జీవితాలు గడుపుతుంటారని ఓ మాజీ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల రక్తం పిండి డబ్బులు వసూలు చేసే యాజమాన్యం జీతాలు మాత్రం చెల్లించదని ఆ మాజీ ఉద్యోగి తెలిపారు. కామినేని ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న మెడికల్ కళాశాల విద్యార్థులు అధిక శాతం చికిత్స చేస్తారని వారికి తెలిసి తెలియక చేసిన చికిత్సలతో మనుషుల ప్రాణాలు తీస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ డాక్టర్లు చికిత్స చేసేటప్పుడు వారి టీం లీడర్ గా ప్రొఫెసర్ కానీ లేనిచో సీనియర్ డాక్టర్ కానీ ఉండాలి అవేవి పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్దంగా చికిత్స అందిస్తారని బాధితురాలి బంధువు తెలిపారు.

స్వాతి బంధువు విజయ్ కుమార్ 

కామినేని యాజమాన్యం చేసే తప్పులన్నీ ప్రభుత్వానికి కూడా తెలుసునని, రాజకీయంగా పలుకుబడి ఉండటంతో కామినేని ఆసుపత్రి చేసిందే ఆటగా నడుస్తుందని పలువురు వాపోతున్నారు. కామినేని పై చర్యలు తీసుకోవాలని పలుసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటంలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, మెడికల్ అధికారులు, ఎంసీఐ వారు కామినేని ఆసుపత్రి పై చర్యలు తీసుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు.

        

       స్వాతి ఫైల్ ఫోటోస్