ఎన్టీయార్ ఫ్యామిలీలో ‘రెబెల్’ హరికృష్ణ

ఎన్టీరామారావు ఇతర కుటుంబ సభ్యుల్లాగానే హరికృష్ణ కూడా రాజకీయాల్లో విఫలమయ్యారు. ఆయన రాజకీయ జీవితం డెడ్ ఎండ్. తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడికి కుమారుడవడమే కాదు, తెలుగుదేశం రథసారధిగా  పార్టీ ఆవిర్భావంలో కీలకపాత్ర వహించినా, ఆయన ఎన్టీయార్ రాజకీయ వారసుడుకాలేకపోయాడు. ఎన్టీయార్ రథంలో కనబడకుండా ఎలా కథ నడిపారో రాజకీయాల్లో కూడా ఎపుడూ ఆయన ప్రముఖుడు కాలేకపోయాడు.  రెబెలేగాని ఆయన రెబెలియన్ విజయవంతం కాలేదు. అందుకే రాజకీయాల్లో కేవలం ఎన్టీయార్ డ్రైవర్ గానే కీర్తి పొందారు తప్ప వారసుడు కాలేక పోయారు.

ఆయనకు ఎన్టీయార్ పోలికలు చాలా ఎక్కువ అని, సినిమాల్లో డైలాగులు ఆయన అచ్చం ఎన్టీయార్ లాగా చెబుతారని అంతా అంగీకరించినా, సినిమాల్లో కూడా  ఆయన వారసుడు కాలేకపోయాడు. అలాగే, రాజకీయాల్లో కూడా ఆయన వారసుడు కాలేకపోయాడు. అందుకే ఆయన ఎంచుకున్నరాజకీయాలన్నీ డెడ్ ఎండ్ లోనే ముగిశాయి. ఈ అసంతృప్తి ఆయనలో కనిపిస్తుంది. అయితే, ఆయనెపుడూ బహిరంగ  తిరుగుబాటు చేయలేదు. ఒక వేళ ఎపుడయిన ఆగ్రహోదగ్రుడయినా మళ్లీ రాజీకొచ్చేవారు.  తెలుగుదేశం నాయకత్వం మీద అసంతృప్తి ఉన్నా ఆయన పార్టీ కి హాని చేసేవిధంగా ఎపుడూ ప్రవర్తించలేదు. ఏ మార్గంలో పార్టీ నిలబడుతుందో ఆమార్గాన్నే ఎంచుకున్నారు. అది ఎన్టీరామారావుకు ఆశయాలకు వ్యతిరేకమయినా ఆయన విబేధించేందుకు వెనకాడలేదు. అందుకే కుటుంబంలో ఆయన సైలెంట్ రెబల్ అయిపోయారు. దీనికి ఉదాహరణ ఎన్టీరాామారావు మీద చంద్ర బాబు నాయుడు జరిపిన తిరుగుబాటు సమయంలో ఆయన పాత్ర.

ఆ సమయంలో ఆయన పార్టీ నడప గల శక్తి తండ్రికి లేదని, చంద్రబాబు నాయుడే నడపగలరి నమ్మాడు తప్ప టిడిపి వారసత్వం తనకు దక్కాలనే విధంగా గొడవ చేయలేదు. తిరుగుబాటు సమయంలో ఆయన బావ చంద్రబాబు నాయుడి నాయకత్వాన్ని సమర్థించారు. దీనికి ప్రతిఫలంగా 1995 లో చంద్రబాబునాయుడిక్యాబినెట్ లో ఆయన రవాణా మంత్రి అయ్యారు. అది అర్థాంతరంగా ముగిసింది. బావతో రాజీ కొనసాగలేదు. ఇలా ఆయన టిడిపి దారి   మొండిదారి అయింది.  క్యాబినెట్ పదవి దక్కాక పార్టీలో ఆయన పవర్ సెంటర్ కాలేకపోయారు. టిడిపి నాయకత్వం చేపట్టే స్థాయికి ఎదగలేకపోయారు.

 ఈ అసంతృప్తితో, తొందర్లోనే ఆయన బావ చంద్రబాబు నాయుడితో  విబేధించారు. 1999  జనవరి 26 న ఆయన ‘అన్నా టిడిపి’  అని కొత్త పార్టీ పెట్టారు. 1999 ఎన్నికల్లో పోటీ  చేసినా హరికృష్ణ పార్టీకి ఒక్కసీటు కూడా రాలేదు. చంద్రబాబు నాయుడితో గొడవకు దిగారు.  నాయుడు ఎన్టీయార్ వారసత్వం లేకుండా నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

సోదరుడు నందమూరి బాలకృష్ణ పూర్తిగా చంద్రబాబు నాయుడితో కలసి పోతే, హరికృష్ణ ఎపుడూ అలా టిడిపిలో ఒదిగి పోలేకపోయారు. టిడిపి లో ఎపుడూ ఆయన కంఫర్టబుల్ లైఫ్ కాదు.

కొద్ది రోజుల తర్వాత ఆయన అన్నా టిడిపిని మూసేసి టిడిపికి దగ్గరయ్యారు. చంద్రబాబు నాయుడితో రాజీ అయ్యారు. తర్వాత ఆయన రాజ్యసభ నామినేషన్ వచ్చింది. చనిపోయే నాటికి ఆయన టిడిపి పాలిట్ బ్యూరో గా కూడా అన్నారు. అయితే, ఆయనెపుడూ పార్టీ సమావేశాల్లో పాల్గొన్న దాఖలా లేదు. ఎన్టీయార్ కొడుకుగా ఆయన పార్టీలో గౌరవం దక్కింది తప్ప ఆయనెపుడూ  మనస్ఫూర్తిగా బాధ్యతలు భుజానేసుకున్నట్లు కనిపించదు. తెలుగుదేశం  పార్టీలో ఉన్నా అంటీఅంటనట్లుగానే ఉంటూ వచ్చారు. చనిపోయే నాటికి కూడా అదే పరిస్థితి. ఒక పుడు టిడిపిలో ఉండి బయటపడిన చంద్రబాబు వ్యతిరేకులే ఆయన చుట్టు కనిపించే వారు. టిడిపి నుంచి బయటకు వెళ్లిన వారితో హరికృష్ణ కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూనే వచ్చారు. ఇది చంద్రబాబు నాయుడికి నచ్చేది కాదని పార్టీనేతలు చెబుతుంటారు