నిజాం నవాబులు గుర్రాలపై మంచినీరు తెచ్చుకున్నది ఈ బావి నుంచే

నిజాం రాజులు పోయారు, వారి రాజ్యం అంతరించి పోయింది. అయినా నిజాం కాలం నాటి సంఘటనలు ఇప్పటికి ప్రజలకు ఆసక్తికరంగానే ఉన్నాయి. తాజాగా నిజాం కాలం నాటి ఆసక్తి కరమైన విషయం చర్చలోకి వచ్చింది. నిజాం ప్రభువులు మంచినీళ్లను ఎక్కడి నుంచి తెచ్చుకునే వారో తెలుసా? కిలో మీటర్ల కొద్ది దూరంలోని బావి నుంచి గుర్రాలపై మంచి నీళ్లు నీళ్లi తెచ్చుకున్న అంశg వెలుగులోకి వచ్చింది. ఆ బావికున్న ప్రత్యేకత ఏంటి.. నిజాం రాజులు అక్కడి నుంచే నీళ్లు ఎందుకు తెచ్చుకున్నారు. ఈ విషయాలన్ని తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే మరీ…

మొలంగూరు కోట ముఖ ద్వారం

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామం. ఈ గ్రామంలో దూద్ బావి అని ఉంటది. ఈ బావిలో నీరు ఎంత టేస్టుగా ఉంటాయంటే… ఆ నీళ్ల గురించి ఎంత చెప్పిన తక్కువే అని జనాలు చెబుతారు. బ్రాండెడ్ గా చెప్పుకొని నీళ్ల దందా  చేస్తున్న కార్పొరేట్ కంపెనీల నీళ్లు కూడా ఈ దూద్ బావి నీళ్ల ముందు పనికిరావని గ్రామస్థులు అంటున్నారు.

కోట పైకి మెట్ల దారి

వెయ్యి సంవత్సరాల క్రితం కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో మొలంగూర్ కోట నిర్మించారు. ఆ కోట ప్రవేశ ద్వారం ఎదురుగా రాతి కట్టడంతో దూద్ బావిని ఏర్పాటు చేశారు. దూద్ బావి నీటి విశిష్టత ప్రజలకు, ,చరిత్రకారులకు ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. పాలు, నీళ్లు కలిపిన రీతిలో తెల్లగా ఉండే ఈ బావి నీటిని నిజాం నవాబులు ఇష్టంగా తెప్పించుకొని తాగేవారని గ్రామస్థులు ద్వారా తెలుస్తోంది. నిజాం నవాబులు ఈ బావి విశిష్టత తెలుసుకొని ఇక్కడి నుంచి మరికొన్ని సార్లు గుర్రాలపై తీసుకెళ్లేవారు. ఆ నీటిని తాగిన నవాబుల కుటుంబాలు దూద్ బావి నీరు బాగుందని అవసరమైతే ఈ గ్రామం నుంచి హైదరాబాద్ కు పైపులైన్ కూడా వేయించుకుందామని ప్రణాళిక చేశారని గ్రామస్థులు తెలుపుతున్నారు. ఇక్కడ ఊట నీరు కావడంతో పైపు లైను ఏర్పాటు సాధ్యం కాదని ఆగిపోయారని పెద్దలు చెబుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేసి వెళ్లిన కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికీ కూడా ఈ బావి నీటిని తెప్పించుకొని తాగటానికి ఆసక్తి చూపిస్తారు. అడుగు మొదలు పై భాగం వరకు రాతి కట్టడంతో ఉన్న దూద్ బావి నీటిలో నాణెం వేసినా అది స్పష్టంగా కనిపించడం ఈ బావిలోని నీటి పారదర్శకతకు నిదర్శనం. ఈ బావి నీటిని తాగితే ఎటువంటి రోగాలు రావని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా నమ్ముతారు. మొలంగూర్ తో పాటు రాజాపూర్, ఆముదాలపల్లి, మెట్ పల్లి, చింతలపల్లి,గద్దపాక, కాచాపూర్, కన్నాపూర్, మఖ్త, కేశవపట్నం, కొత్తగట్టు, చింతల పల్లె, లింగాపూర్ తదితర గ్రామాల ప్రజలు ఈ బావి నీటినే ఇప్పటికి కూడా తమ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. బావిలో ఊటనీరు చేరగానే నీరు తీసుకెళ్లాడానికి రాత్రింబవళ్లు జాగారం చేసి ఆ నీటిని పట్టుకెళ్తారు.

కోట పక్కన ఏర్పాటు చేసిన దూద్ బావి ఇదే

ఏళ్ల తరబడి చరిత్రగానే మిగిలిపోయిన దూద్ బావి నీటి విశిష్టత ఏంటో తెలుసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు నీటి విశిష్టతను పరీక్షించాలనుకున్నారు. పర్యాటక శాఖకు కలెక్టర్ కూడా మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన భూగర్భ జలశాఖ అధికారులు ఈ బావి నీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పరీక్షించి చూసి మార్కెట్ లో లభించే మినరల్ వాటర్ కన్నా దూద్ బావి నీళ్లు నాణ్యంగా  ఉన్నాయని నివేదించారు.

జిల్లాల విభజన అనంతరం ఆలయాలు, పర్యాటక స్థలాలను కోల్పోయిన కరీంనగర్ జిల్లాకు ఆ లోటును తీర్చే ప్రయత్నాల్లో భాగంగా అటు మొలంగూరుకోట, ఇటు దూద్ బావి పరిసరాలను పర్యాటకంగా గుర్తింపు తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే బావి నీటి మీద పరిశోధనలు సాగడం ఆ నీరు చాలా విశిష్టతను కలిగి ఉన్నదని తేలడంతో పర్యాటక శాఖ ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొలంగూరు  గ్రామంలోని తాగునీటి బావులు, శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటి ప్రవాహ ప్రాంతాల బావుల నుండి భూగర్భ జల శాఖాధికారులు నీటి నమూనాలను సేకరించి విశ్లేషించారు. కరీంనగర్ పురపాలికలో సరఫరా చేస్తున్న నీటిని, మార్కెట్ లో సరఫరా చేస్తున్న కెన్లీ,ఆక్వాఫైనా కంపెనీల నీటిని కూడా అధికారులు పరిశోధించారు. ఈ విశ్లేషణలో దూద్ బావి నీరు ఎంతో తియ్యగా, స్వచ్చంగా తేలికగా ఉన్నట్టు తేల్చారు. దూద్ బావి నీటిలో ఖనిజ లవణాల సాంధ్రత తక్కువగా కూడా ఉన్నట్టు తేలింది.

మొల్లంగూరు గ్రామ ముఖ చిత్రం

మొల్లంగూరు ఖిల్లాకు  ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ కాకతీయుల కాలం నాటి ఆనవాళ్లు నేటికి కూడా చెక్కుచెదరకుండా కనపడుతాయి. ఖిల్లాపైన రాజులు తీర్పు చెప్పటానికి ఏర్పాటు చేసుకున్న ఖిల్లా ఒక్కటి ఉంది. రాజవంశీయులు స్నానం చేయడానికి రాజు కోనేరు, రాణి కోనేరు వేర్వేరుగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. రాజుకు కాపలాగా రక్షకులు ఉపయోగించిన ఫిరంగి ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉండటం మరో ప్రత్యేకత.

గొప్ప గొప్ప వారి  గొంతులు తడిపిన దూద్ బావి నేటికి కూడా అంతే విశిష్టతతో నీటిని అందిస్తుంది. మొలంగూర్ కోట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి దూద్ బావి విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రజలు కోరుతున్నారు.