జగన్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందా?

Is there a conspiracy to overthrow the Jagan government?
నాలుగైదు రోజుల క్రితం ఒక వెబ్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.  అదేమంటే రాజ్యాంగవిచ్ఛిన్నం అంటూ జస్టిస్ రాకేష్ కుమార్ ధర్మాసనం తన తీర్పును ఇరవై ఒకటో తారీఖున (యాదృచ్చికంగా ఆరోజు జగన్ జన్మదినం) ఇవ్వబోతోందని, రాష్ట్రంలో రాజ్యాంగవైఫల్యం చెందిందని ధర్మాసనం తీర్పు ఇచ్చే అవకాశం ఉందని, ఆ తీర్పు వెలువడిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజీనామా చెయ్యాల్సివస్తుందని, తదనంతరం రాష్ట్రపతి పాలన విధిస్తారని అంటూ రాసుకొచ్చింది.  
 
Is there a conspiracy to overthrow the Jagan government?
Is there a conspiracy to overthrow the Jagan government?
వారి కథనం ఊహాగానమే కావచ్చు…కానీ, రాకేష్ కుమార్ ధర్మాసనం అలాంటి తీర్పే ఇచ్చి ఉన్నట్లయితే పర్యవసానాలు ఎలా ఉండేవో తలచుకుంటేనే అల్లకల్లోలం ఏర్పడుతుంది.  అలాంటి కంక్లూజన్ కు రావడానికి కారణాలు కూడా తేటతెల్లమే.  అక్కడ వేసింది హెబియస్ కార్పస్ పిటిషన్.  ధర్మాసనం దానిమీద విచారణ జరపకుండా రాజ్యాంగవిచ్ఛిన్నం అనే ఒక కొత్త అంశాన్ని తెచ్చింది.  అసలు రాజ్యాంగ విచ్ఛిన్నం అనే అంశం మీద తమకు విచారణ జరిపే పరిధి ఉన్నదా లేదా అని కూడా ధర్మాసనం పరిశీలించుకోలేదంటే ఇక ఆ న్యాయమూర్తులకున్న రాజ్యాంగ పరిజ్ఞానం ఎలాంటిదని భావించాలి?     
 
అవతల వాదనలు వినిపిస్తున్నది ఎవరు?  అత్యున్నత ప్రభుత్వ న్యాయవాదులు.  వారి వాదనలు కనీసం వినాలి కదా?  సాధారణ జేబుదొంగల కేసు విచారణలో కూడా సాక్షులు, నిందితులు, లాయర్లు హాజరు కాని పరిస్థితుల్లో కేసుల విచారణను వాయిదా వేస్తుంటారే!  మనదేశంలో మూడు నాలుగు దశాబ్దాలపాటు కూడా విచారణలు వాయిదా పడుతుంటాయి.  ఎప్పుడో 1984 లో జరిగిన అల్లర్ల కేసుల విచారణ కూడా ఇంకా కొనసాగుతున్నది.  అలాంటప్పుడు ఈ కేసు సుప్రీమ్ కోర్టులో ఉన్నది కాబట్టి మరో మూడు రోజులు వాయిదా వెయ్యండి మహాప్రభో అని ప్రభుత్వ న్యాయవాదులు మొరపెట్టుకుంటున్నా కూడా కుదరదని తిరస్కరించడం ఏమిటి?  పాత సుప్రీమ్ కోర్టు తీర్పులను కూడా ప్రస్తావించవద్దని హుకుం జారీ చేయడం ఏమిటి?  ఎందుకంత తొందర?  జస్టిస్ రాకేష్ కుమార్ రిటైర్ కావడానికి ఇంకా పదిరోజుల గడువు ఉన్నది.  తన పదవీవిరమణ లోగానే తీర్పు ఇవ్వాలని, చరిత్రలో నిలిచిపోవాలని న్యాయమూర్తికి కీర్తికండూతి ఉంటె ఉండవచ్చు.  తన కీర్తి కోసం హడావిడి ముగింపు ఇవ్వాలనుకోవడంలో ఆంతర్యం ఏమిటి?  
 
ఒకవేళ ధర్మాసనం తీర్పు ఇచ్చిందే అనుకుందాము.  అసలు రాజ్యాంగ విచ్ఛిన్నం అనే అంశాన్ని విచారించే అధికారం హైకోర్టుకు లేదని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది కదా?  అలాంటి నేపథ్యంలో జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పు ఇచ్చి ఉన్నట్లయితే ఆయన పరువుమర్యాదలు శాశ్వతంగా మంటకలిసిపోయేవి కావా?  అంత తొందరగా ప్రభుత్వం కాళ్ళుచేతులు కట్టేసి విచారించి తీర్పు ఇవ్వాలనే పట్టుదల వెనుక ఏవైనా అదృశ్యహస్తాల ఒత్తిడి ఉన్నదా?  
 
పేషెంట్ చనిపోయే చివరి క్షణంలో ఎవరో సంజీవని వాసన చూపించి ప్రాణం పోసినట్లు నిన్న సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి తన అరచేతిని అడ్డుపెట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించారని చీఫ్ జస్టిస్ బొబ్దే పట్ల ప్రశంశల జల్లులు కురుస్తున్నాయి.  అంతేకాదు…రాష్ట్ర హైకోర్టు తీర్పులు ఆందోళనకరంగా ఉన్నాయంటూ బొబ్దే చేసిన వ్యాఖ్యలు హైకోర్టు వ్యవహారసరళి పట్ల తీవ్రమైన అభిశంసనగా చెప్పుకోవాలి.  రాష్ట్ర హైకోర్టు పనితీరు పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని పూర్తిగా నిర్మూలించింది అని సామాన్యప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు.   అంతేకాకుండా గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుల పట్ల ఇప్పుడు ప్రజలకు సందేహాలు కలుగుతున్నాయి.  న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లితే రాజ్యాంగసంక్షోభం ఏర్పడినట్లే.  ఆ పరిస్థితులు రాకుండా న్యాయస్థానాలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.  న్యాయమూర్తుల పట్ల ప్రజలకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలి.  రాజకీయనాయకుల క్షుద్రనాటకాల్లో పావులుగా మారి ప్రజాస్వామ్యాన్ని చిదిమివేయరాదు.  
 
చీఫ్ జస్టిస్ బొబ్దే ఈరోజు నేలరాలిపోతున్న ప్రజాస్వామ్యసౌధాన్ని ఒక కాపు కాసి రక్షించిన ధర్మమూర్తిగా ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారు.  
 
న్యాయదేవత వర్ధిల్లాలి.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు