కామినేని ఆసుపత్రి యాజమాన్యానికి షాక్ తప్పదా?

కామినేని యాజమాన్యానికి గట్టి షాక్ తగిలేలా ఉంది. గత నెల 13న నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రిలో కాన్పు కోసం వచ్చిన గర్బిణి.. బాబుకు జన్మనిచ్చి సిబ్బంది నిర్లక్ష్య వైద్యంతో మరణించింది. తన బిడ్డను పొట్టన బెట్టుకున్న కామినేని యాజమాన్యాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని వారి అంతు చూస్తామని స్వాతి తండ్రి సత్యనారాయణ, బంధువులు అంటున్నారు. రాజ్యాంగంపైనా, భారత చట్టాలపైన తనకు నమ్మకం ఉందని ఇవాళ పేదవాడు బతుకగలుగుతున్నాడంటే అది న్యాయ వ్యవస్థ పుణ్యమేనన్నారు. తన బిడ్డకు జరిగిన అన్యాయం పై న్యాయ  పోరాటం చేస్తానన్నాడు.

సాపిడి స్వాతి

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన సాపిడి స్వాతి జూలై 13 న డెలివరీ కోసం నార్కట్ పల్లి కామినేనిలో చేరగా డాక్టర్లు రెండు సార్లు మత్తు మందు ఇవ్వటంతో స్వాతి అస్వస్థతకు గురైంది. ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో స్వాతి మృతిచెందిందని ఆయన అన్నారు. న్యాయం కోసం అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండని అవహేళనగా యాజమాన్యం మాట్లాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని విషయాలు స్వాతి తండ్రి సత్యనారాయణ తెలిపురు అవి ఆయన మాటల్లోనే

“ స్వాతి నా కూతురు చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకొని సాధుకున్నాను. చదువులో కూడా నా బిడ్డ ముందుడేది. చదువుకొని పైకి ఎదగాలని నాబిడ్డ ఎన్నో కలలు కన్నది. పెళ్లిడుకొచ్చిందని పెళ్లి చేసినం. జనగాం జిల్లాకు చెందిన క్రాంతి కుమారుకు ఇచ్చి వివాహం చేశాం. అబ్బాయి హైదరాబాదులోని అరబిందో ఫార్మసిలో పనిచేసేవాడు. వారు అక్కడే ఉండేవారు. స్వాతి గ్రూప్స్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేది.  ఈ సమయంలోనే గర్భవతి కావడంతో అంతా సంతోషించాం. డెలివరీ కోసం ఆరెగూడెం తీసుకొచ్చాం. కామినేని హాస్పిటల్ కు నాబిడ్డను నేనే బండి మీద తీసుకపోయిన. నవ్వుకంటూ మాట్లాడుతూ నా బిడ్డ గడిపింది. నా బిడ్డకు అదే ఆఖరి రోజు అవుతుందని, ఆ నవ్వు మమ్ముల ఏడిపించడానికే అని నేను అనుకోలేదయ్యా….

స్వాతి తల్లిదండ్రులు సత్యనారాయణ, నాగాంజలి

బిడ్డను దవాఖానాల చేర్చినం. డాక్టర్లు మంచిగనే ఉన్నది ఏం కాదనం. నా బిడ్డకు కాన్పు అయితుందని సంతోషించినా. ఆపరేషన్ థియేటర్లకు తీసుకపోయిర్రి. మత్తు సూది ఇచ్చి ఆపరేషన్ చేశిరంట.. మగ పిల్లగాడు పుట్టిండు. కుట్లు వేసేటప్పుడు కదిలిందని మళ్లీ మత్తు సూది ఇచ్చి మళ్లీ కుట్లు వేశారట. ఈ లోపుల రక్తం అంతా శరీరానికి సోకి ఇన్ఫెక్షన్ అయ్యిందట. బిడ్డ ఉలుకుపలుకు లేకుండా ఉన్నది. పిల్లగాన్ని మాకు ఇచ్చిర్రు. స్వాతి పరిస్ధితి విషమంగా ఉందని చెప్పిర్రు. మా బిడ్డను చూపించాలని నిలదీస్తే చావు కబుర్రు చల్లగా చెప్పిర్రు. తనకు పుట్టిన కొడుకును కూడా నా బిడ్డ కంటి చూపుకు నోచుకోకుండా చచ్చిపోయింది.నవ్వుకుంటూ తీసుకెళ్లిన బిడ్డను శవంగా తీసుకొచ్చినా…. ఆసుపత్రి ముందు ఆందోళన చేసినం మాకు న్యాయం చేయాలని అడిగినం. దిక్కున్న చోట చెప్పుకోపోండి.. కేసు పెట్టుకో పోండి అని అన్నారు.  రాజకీయ నాయకుల అండతోనే కామినేని వారు ఇష్టమొచ్చినట్టు ఆట ఆడుతున్నారు. నేను న్యాయ వ్యవస్థను నమ్ముతున్నా. పుట్టెడు బాధలో బిడ్డ చావు చేసినం. ఆ పసిపిల్లవానికి అమ్మ ఏది అంటే ఏం చెప్పాలే… నా బిడ్డ చనిపోవడంతో నాకు ప్రాణం ఆవుసుల లేదు. చెయ్యి ఇరిగినట్టైంది. నా భార్య నాగాంజలి బిడ్డ చావుతో సచ్చిన శవమైంది. నేను నా బిడ్డకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తా. ఎందాకనైనా పోతా.. హాస్పిటల్ వారు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే.

 

స్వాతి భర్త క్రాంతి కుమార్, స్వాతి కుమారుడు 

కామినేని ఆసుపత్రి వారి మీద కేసు పెట్టినం. రెండు నెలల్లో ఎస్ ఎస్ ఆర్ రిపోర్టు వస్తదని చెప్పిర్రు. అది వచ్చిన తర్వాత నిపుణుల కమిటీ విచారిస్తదట. కోర్టుల కూడా ప్రభుత్వ న్యాయవాది కేసు వాధిస్తడట. నాకు న్యాయం జరుగుతదని నమ్మకం ఉంది. నాకు న్యాయం జరగకపోతే ప్రైవేటు లాయర్ ను పెట్టైన సరే హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు వెళ్తా. నా బిడ్డ ఎలాగు చనిపోయింది. ఇంకొకరికి అన్యాయం  జరగొద్దంటే కామినేని వారు శిక్ష అనుభవించాల్సిందే. జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ వో లకు ఫిర్యాదు చేస్తా. రెండు రోజుల్లో హెచ్చార్సీని ఆశ్రయిస్తాను. ఇవాళ కామినేని వారి నిర్లక్ష్యం వల్ల రెండు కుటుంబాలు ఆగమైనయి. మేము కంటికి పుట్టెడు ఏడుస్తున్నాం. మా బాధ వాళ్లకు తెల్వాలే. నాకు న్యాయస్థానాల పైన నమ్మకం ఉంది. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సిందే. పైసలు కావాలని కాదు. వీరికి ఇట్ల దెబ్బ తాకితే మళ్లీ ఇంకొ ప్రాణం తీయకుండా ఉంటర్రు. మనుషుల జీవితాలతో ఆడుకుంటున్న వారు  శిక్ష అనుభవించాల్సిందే. న్యాయం జరిగేంత వరకు పోరాడుతా. నా బిడ్డకు న్యాయం జరుగుతదనే అనుకుంటున్నా” అని స్వాతి తండ్రి వాపోయాడు.

కామినేని యాజమాన్యం ఇన్ని రోజులు చేసిన ఆటలకు ఇక చెక్ పడనుందని, వారి ఆట కట్టించేందుకు సత్యనారాయణ చేసే న్యాయ పోరాటానికి తమ మద్దతు తెలుపుతామని పలువురు రాజకీయ పక్షాలు, నాయకులు, యువత తెలిపారు.