స్థానిక ఎన్నికల మూడు స్తంభాలాట

High Court verdict against Nimmagadda Ramesh
ఎలాగైనా సరే, తాను పదవిలో దిగిపోయేలోపల పంచాయితీ ఎన్నికలు జరిపించాలని పట్టువదలని విక్రమార్కుడులా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంత తలక్రిందులు అవుతున్నప్పటికీ అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.  ఈరోజు హైకోర్టులో జరిగిన వాదప్రతివాదనల తరువాత “ఎన్నికలు జరుపుకోవడం నీ ఇష్టం..నీకు తిరుగులేదు” అనే మాట హైకోర్టు నుంచి నిమ్మగడ్డకు రాలేదు.  పైగా ఎన్నికలు జరిపే పరిస్థితులు ఉన్నాయా లేవా అని లోతైన అధ్యయనం చెయ్యమని ఎన్నికల కమీషన్ కు సూచించింది.  అయితే ఇది ప్రభుత్వానికి సానుకూలం అని చెప్పలేము.  చిక్కుముడులు వీడటంలేదని మాత్రం చెప్పుకోవచ్చు. 
High Court verdict against Nimmagadda Ramesh
High Court verdict against Nimmagadda Ramesh
 
నిజం చెప్పుకోవాలంటే నిమ్మగడ్డ సారధ్యంలో ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం అంగీకరించడమే కాక కొంత ప్రక్రియ కూడా పూర్తయింది.  అయితే ఏకగ్రీవాలు ఎక్కువ కావడంతో… మరి ఎవరు ఆయనకు సలహా ఇచ్చారో తెలియదు కానీ…హఠాత్తుగా కరోనా పేరు చెప్పి ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారు నిమ్మగడ్డ.  ఆయన వెనుక చంద్రబాబు ఒత్తిడి ఉన్నదని పలువురి అనుమానం.  ఏమైనప్పటికీ తనను మాటమాత్రం సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వెయ్యడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది.  ఫలితంగా నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించడం, చెన్నై నుంచి జస్టిస్ కనగరాజ్ ను పిలిపించడం, ఎన్నికల కమీషనర్ గా నియమించడం,  దాంతో కుతకుతలాడిపోయిన నిమ్మగడ్డ కోర్టుల చుట్టూ తిరగడం, ఆ పోరాటంలో ఆయన విజయం సాధించడంతో మళ్ళీ నిమ్మగడ్డకు పదవి దక్కింది.  

నిమ్మగడ్డ ప్రవర్తన అనుమానాస్పదం 

అయితే ఏమి లాభం?  మాజీ గా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రవర్తించిన తీరు ప్రభుత్వానికే కాక ప్రజల్లో కూడా సందేహాలు పొడసూపేట్లు చేశాయి.  జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ద్వేషించే బీజేపీ ముసుగులు కప్పుకున్న కరుడుగట్టిన చంద్రబాబు భక్తులు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ లతో నిమ్మగడ్డ అత్యంత రహస్యంగా తెలంగాణాలో పార్క్ హయత్ హోటల్లో కలుసుకుని చర్చలు జరపడం  చూస్తే ఎన్నికల విషయంలో తెలుగుదేశంతో కలిసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుట్రలు చేస్తున్నట్లు సామాన్యుడికి కూడా బోధపడుతుంది.  అలాంటి రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్ గా ఉండగా ఎన్నికలకు వెళ్తారా జగన్మోహన్ రెడ్డి?  ఇంపాజిబుల్.

ఎన్నికలు జరక్కపోతే ఆకాశం కిందపడదులే 

దేశంలో కరోనా కల్లోలం ఇంకా తగ్గలేదు.  మొన్న హైదరాబాద్  గ్రేటర్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బందిలో అనేకమంది కరోనా బారిన పడ్డట్లు వార్తలు వచ్చాయి.  పైగా దేశంలో కరోనా రెండో విడత విజృంభణ మొదలైనట్లు చెబుతున్నారు.  కొన్ని రాష్ట్రాలు మళ్ళీ రాత్రివేళలో కర్ఫ్యూ విధించాయి.  దేశంలో రైళ్ల రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు.  విదేశీయానాలు జరగడంలేదు.  అమెరికాలో మొన్న రెండు మూడు రోజుల్లో రెండు లక్షలమందికి కరోనా సోకింది.  ప్రపంచమే అల్లకల్లోలంగా ఉంటే ఇప్పుడు ఎన్నికలు జరుపుతాం అంటూ నిమ్మగడ్డ వితండవాదం చెయ్యడం ఏమిటి?  చంద్రబాబు పదునాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఒక్కసారి కూడా ఎన్నికలు జరగలేదు.  అయినప్పటికీ ఏమీ కొంపలు మునగలేదు.  “అసలు రెండేళ్ల క్రితం జరపాల్సిన ఎన్నికలను ఎందుకు జరపలేదు”  అని కోర్టులు నిమ్మగడ్డను నిలదీయకపోవడం దురదృష్టం.  దీన్నిబట్టి చూస్తే తేలేదేమిటి?  పంచాయితీ ఎన్నికలు జరపకపోయినా నష్టం ఏమీ లేదనే కదా?  

నిమ్మగడ్డకు భంగపాటు తప్పకపోవచ్చు 

నిమ్మగడ్డకు మరో నూటపది రోజుల అధికారం ఉంది.  ఈ లోగా తానేదో పొడిచేసి ఎవరినో సంతృప్తి పరచడానికి ఆయన పడే తపన, తపస్సు జగన్మోహన్ రెడ్డి సంకల్పం  ముందు ఫలించకపోవచ్చు.  ఎన్నికలు జరిపే వాతావరణం లేదని సాక్షాత్తూ ప్రభుత్వమే స్పష్టం చేస్తుంటే కోర్టులు ఏమి చెయ్యగలవో నాకైతే అర్ధం కావడం లేదు.  ఎందుకంటే గతంలో ఇలాంటి సంఘటనలు జరగలేదు.  కరోనా ఉన్నదో లేదో చెప్పాల్సింది ఆరోగ్యనిపుణులు తప్ప కోర్టులు కావు.  కనుక ప్రభుత్వాలను బలవంతం చెయ్యడం కోర్టులకు కూడా సాధ్యం కాదు.     ఒకవేళ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే (వస్తుంది లెండి) ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు వెళ్తుంది.  మరి కొందరితో పిటీషన్లు వేయిస్తుంది.  జగన్మోహన్ రెడ్డి తలచుకోనిదే ఎన్నికలు జరపడం ఎన్నికల కమీషనర్ కు సాధ్యం కాకపోవచ్చు.   ఆ విషయం నిమ్మగడ్డకు తప్ప అందరికీ తెలుసు.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు