పుడో రెండున్నరేళ్లక్రితం జరగాల్సిన స్థానికసంస్థల ఎన్నికలను నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటికే ప్రజల్లో తమ ప్రభావం క్షీణించిందని వారికి ఆనాడే సందేహం కలిగింది. ప్రభుత్వ సందేహాలతో పనిలేకుండా, ఎన్నికలు జరిపించాల్సిన రాజ్యాంగ బాధ్యతను ఎన్నికల సంఘం విస్మరించింది. ఆ తరువాత రాజకీయ పరిణామాలు మారిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని వారు నిర్ణయించి ప్రక్రియను మొదలు పెట్టారు. అప్పటినుంచి జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవే. ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య పెద్ద యుద్ధమే సాగింది. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే ముందురోజు వరకు ప్రతి విషయంలోనూ హైకోర్టు, సుప్రీం కోర్ట్ ఎన్నికల సంఘాన్నే బలపరచి దానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికల సంఘం ముందు ప్రజాప్రభుత్వం తలవంచాల్సి వచ్చింది. ఎన్నికలు జరపక తప్పని పరిస్థితి వచ్చింది.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక విచిత్రంగా ఎన్నికల కమీషనర్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగలడం మొదలైంది. ఆయన తీసుకున్న చర్యలు అక్రమం అంటూ ప్రభుత్వం కోర్టుకెక్కడం, అన్ని కేసుల్లోనూ హైకోర్టు ప్రభుత్వాన్నే సమర్ధించడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంగు తినాల్సివచ్చింది. అందుకు కారణాలు లేకపోలేదు. కోర్టు తీర్పుల్లోని స్ఫూర్తిని గ్రహించి ప్రభుత్వంతో సహకరిస్తూ ఎన్నికలు జరపాల్సింది విడనాడి న్యాయస్థానాలు సమర్ధించాయి కదాని నిమ్మగడ్డ అతిపొకడలకు పోయారు. తన శాసనాలకు తిరుగులేదని విర్రవీగారు. అందుకే ఆయన అత్యున్నతాధికారులమీద కూడా అధికారదర్పాన్ని ప్రదర్శించారు. చివరకు ఎన్నికలు జరిపే బాధ్యత కలిగిన పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ళుచేతులు, నోరు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టడానికి సాహసించారు. అంతే కాకుండా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, మరొక మంత్రి కొడాలి నాని మీద కూడా ఆంక్షలు విధించారు. మరీ దుర్మార్గం అనిపించే సంఘటన ఏమిటంటే పేదవారికి అందించే రేషన్ సరుకుల వాహనాల మీద వైసిపి జెండా రంగులు ఉన్నాయనే సాకుతో ఆ వాహనాలపై రంగులు తొలగించేంతవరకు రేషన్ అందించడానికి వీల్లేదని శాసించారు.
నిమ్మగడ్డ చర్యలను నిరసిస్తూ ప్రభుత్వం కోర్టు గడప తొక్కింది. పెద్దిరెడ్డి మీద విధించిన ఆంక్షలను కోర్టు కొట్టేసింది. అలాగే జోగి రమేష్ మీద ఆంక్షలు కూడా కొట్టేశారు. తాజాగా వాహనాల మీద రంగులు ఉన్నంతమాత్రాన అవి వైసిపి రంగులు అనలేమని, రేషన్ అందించడం ఎప్పటినుంచో ఉన్నదని, అలాగే వాహనాల మీద ముఖ్యమంత్రి ఫోటో ఉండకూడని ఏ చట్టంలోనూ లేదని తీర్పు చెబుతూ రేషన్ అందించే వాహనాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిమ్మగడ్డ షాక్ తినాల్సివచ్చింది.
వాస్తవం చెప్పుకోవాలంటే కేవలం పార్టీ జెండా రంగులు చూసి జనం ఓట్లు వేస్తారని భావిస్తే అంతకన్నా భ్రమ మరొకటి ఉండదు. రంగులు చూసి పేదలు లొంగి పోయి ఓట్లు కుమ్మరిస్తారనుకుంటే అది పేదల ఆకలిని, ఆత్మగౌరవాన్ని అవమానించడమే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసిపి జెండా రంగులు ఏ వాహనం మీదా లేవు. చివరకు వారి ఫ్లెక్సీలు కూడా గ్రామాల్లో కట్టడానికి పార్టీవారు భయపడ్డారు. అందుకు భిన్నంగా అన్న క్యాంటీన్లు, వాటర్ హెడ్ ట్యాంకులు, బస్ షెల్టర్లు, చివరకు తినే అప్పడాలు. సరుకులు అందించే సంచుల మీద కూడా తెలుగుదేశం రంగులు, చంద్రబాబు ఫోటోలను నింపేశారు. అయినా వారు గెలిచారా? జెండా రంగులు ఉన్నంతమాత్రాన విజయావకాశాలు పెరుగుతాయనుకోవడం కేవలం అవివేకం.
ఇక్కడ మరొక విషయాన్నీ గమనించాలి. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలగానే నిమ్మగడ్డ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా నిమ్మగడ్డ మీద విమర్శలు తగ్గాయి. ఇది సంతోషించాల్సిన పరిణామం. ఇద్దరి నడుమా గవర్నర్ రాజీ కుదిర్చారంటున్నారు. నిజమైనా కాకపోయినా రాజ్యాంగ స్ఫూర్తిని ఇరు వర్గాలు అర్ధం చేసుకోవడం అవశ్యం. ఇక కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం చూస్తుంటే ప్రభుత్వ సహకారంతో జరగాల్సిన ఎన్నికలయజ్ఞానికి అవాంతరాలు కలగకుండా రెండు వ్యవస్థల గౌరవాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్నదని భావించాలి. జెండా రంగులు వాహనాలకు ఉండటం, పధకాల మీద ముఖ్యమంత్రి ఫోటో ఉండటం తప్పుకాదని తీర్పు ఇవ్వడం ద్వారా న్యాయస్థానం ఒక కొత్త ఉత్తమ సంప్రదాయానికి నాంది పలికిందని చెప్పాలి.
పంచాయితీ ఎన్నికల మాదిరిగానే మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సజావుగా జరిగిపోతాయని ఆశిద్దాం. అలాగే కోర్టుకు హామీ ఇచ్చినట్లు మునిసిపల్ ఎన్నికలు గతంలో ఎక్కడ ఆగాయో అక్కడనుంచే మొదలు పెట్టడం సత్సంప్రదాయం. దాన్ని పాటించినందుకు ఎన్నికల సంఘానికి కూడా అభినందనలు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు