చంద్రబాబుతో బిజెపి చదరంగం మొదలు పెట్టిందా? , బలవంతంగా ఆయన నుంచి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గుంజుకుందా?, ఆయనకు ఏమాత్రం ఇష్టం లేని సోము వీర్రాజును ఎమ్మెల్సీగా తెరపైకి తెచ్చిందా?, ఏపీ అసెంబ్లీలో బంపర్ మెజార్టీ ఉన్నప్పటికీ చంద్రబాబు అటు బిజెపికి, ఇటు పవన్ కళ్యాణ్ కి వంగి పని చేయవలసి వస్తోందా?, బిజెపి వేగంగా పావులు కద పడంతో చంద్రబాబు చేతులు ఎత్తేశారా?, అంటే అవును అనే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన విజయ్ సాయి రెడ్డి బిజెపిలో చేరకుండా విజయవంతంగా అడ్డుకున్న సీఎం చంద్రబాబు నాయుడు… సోము వీర్రాజు ఎమ్మెల్సీ కాకుండా చెక్ చెప్పడంలో విఫలం అయ్యారన్న విశ్లేషణలు రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి. అందుకే చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా సోము వీర్రాజు ను ఎమ్మెల్సీగా అంగీకరించవలసి వచ్చింది. బిజెపి ఆడిన ఈ చదరంగంలో చంద్రబాబు సింపుల్ గా చేతులెత్తేయడం తప్ప మరి ఏమి చేయలేకపోయారు.
విజయ్ సాయి రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తరువాత ఆయన బిజెపిలో చేరతారని కీలకమైన పదవిని ఆయన కట్టబెడతారని ఊహాగానాలు మీడియాలో హల్ చల్ చేశాయి. ఇక రేపో మాపో విజయ్ సాయి రెడ్డి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంటారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే చంద్రబాబు నాయుడు చక్రం అడ్డు వేయడం వల్లే బిజెపిలోకి విజయసాయిరెడ్డి చేరలేకపోయారని అంటున్నారు. గడచిన కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శించిన నాయకుల్లో విజయ్ సాయి రెడ్డి ఒకరు. వైఎస్ఆర్సిపి అగ్ర నాయకుడిగా, పార్టీ పార్లమెంటరీ నేతగా విజయ్ సాయి రెడ్డి చంద్రబాబుపై పరుషమైన పదజాలంతో విరుచుకుపడేవారు. ఒక్కోసారి శృతి మించి మరీ చంద్రబాబుపై విమర్శలు చేసేవారు.
అటువంటి విజయ్ సాయి రెడ్డి తమ కూటమిలో ఉన్న బిజెపిలో చేరడానికి చంద్రబాబు ససేమిరా ఇష్టపడలేదని అంటారు. అందుకే ఆయనను బిజెపిలో చేర్చు కోవద్దని ఆ పార్టీ అధిష్టానానికి చంద్రబాబు చెప్పారని అంటారు. విజయ్ సాయి రెడ్డి కూడా వైఎస్ఆర్సిపికి గుడ్ బై చెప్పిన తర్వాత అటు చంద్రబాబును ఇటు పవన్ కళ్యాణ్ ను ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో తనకు వ్యక్తిగత వైరం లేదని, పవన్ కళ్యాణ్ తనకు ఎప్పటినుంచో మిత్రుడని సాయి రెడ్డి చెప్పుకున్నారు. చంద్రబాబు పవన్ ను కూల్ అయితే బిజెపిలో తన ప్రవేశం సులువు అవుతుందన్నది సాయి రెడ్డి అంచనా. కానీ ఇన్నాళ్లు తన్ను తీవ్రంగా విమర్శించిన సాయి రెడ్డి బిజెపిలో చేరితే తనకు అవమానం అని భావించని చంద్రబాబు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
తెలంగాణకు చెందిన ఒక కేంద్ర మంత్రి ద్వారా రెండుసార్లు బిజెపి అధిష్టానం చంద్రబాబును ఈ విషయంలో ఒప్పించడానికి ప్రయత్నించిననా ఆయన ససే మిరా అన్నారు. ఇక చేసేది లేక పొత్తు ధర్మంలో భాగంగా చంద్రబాబు మాటకు విలువనిచ్చిన బిజెపి అధిష్టానం.. సాయి రెడ్డి చేరికను తాత్కాలికంగా వాయిదా వేసింది అని రాజకీయ పరిశీల కులు అంటుంటారు. అయితే మళ్లీ అలాంటి సంకట పరిస్థితి ఇటీవల చంద్రబాబుకు ఎదురయింది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే విషయంలో చంద్రబాబుకు పెద్ద తలనొప్పే ఎదురైంది. పార్టీ అధికారానికి దూరమైన ఐదేళ్లు తెలుగుదేశం కోసం కష్టపడి పనిచేసిన నాయకులు పలువురు ఎమ్మెల్సీ పై ఆశలు పెట్టుకున్నారు. వారందర్నీ ఎలా సంతృప్తి పరచాలని చంద్రబాబు తల పట్టుకుంటే ఒకపక్క బీజేపీ, మరో పక్క పవన్ కళ్యాణ్ ఆయనపై మరింత ఒత్తిడి పెంచారు.
తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ స్థానం ఈసారి ఇచ్చి తీరాల్సిందేనని పవన్ కళ్యాణ్ ఓ పక్క పట్టుబట్టి మరీ సాధించుకున్నారు. మరో పక్క బీజేపీ సడన్ గా రంగంలోకి దిగి ఐదింటిలో ఒక ఎమ్మెల్సీ స్థానం పార్టీకి ఇచ్చి తీరాల్సిందేనని పట్టు పట్టింది. ఢిల్లీ స్థాయి నుంచి ఈ విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు బిజెపికి ఓకే చెప్పి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తానని అన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరును ఆ పార్టీ తెరపైకి తెచ్చింది.
చంద్రబాబు విధానాలను పూర్తిగా వ్యతిరేకించడమే కాక ఆయనపై ఘాటైన వ్యాఖ్యలు, విమర్శలు చేసిన సోము వీర్రాజు అంటే తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఇష్టం ఉండదు. అటువంటి నాయకుడిని ఎమ్మెల్సీగా ఎలా చేస్తాం అని చంద్రబాబు ప్రశ్నించినట్టు సమాచారం. ఎమ్మెల్సీగా చేయడం అనేది తమ పార్టీ అధిష్టానం నిర్ణయమని, సోము వీర్రాజు ఎంపిక బిజెపి అంతర్గత వ్యవహారమని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. గతంలో విజయసాయిని బిజెపిలో చేర్చుకోవద్దంటే తాము అంగీకరించామని, ప్రతిసారీ బిజెపి తీసుకునే రాజకీయ నిర్ణయాలకు ఈ విధంగా చంద్రబాబు అడ్డు రావడం తగదని ఆ పార్టీ నాయకులు బాబుకు స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది.
ఇక విధి లేని పరిస్థితుల్లోనే సోము వీర్రాజు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు అంగీకరించక తప్పలేదు. అయితే మిత్రపక్షంగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తమ సొంత బలాన్ని, బలగాన్ని పెంచుకోవడానికి ఎత్తులు వేస్తోంది అన్నది ఈ ఎపిసోడ్ ద్వారా అర్థమవుతుంది. చంద్రబాబు ఇష్టం అయిష్టాలతో సంబంధం లేకుండానే బిజెపి రాష్ట్రంలో రాజకీయం చేస్తుందని ఒక సందేశాన్ని ఇచ్చింది. దేశవ్యాప్తంగా తమ మిత్రపక్షలతో భారతీయ జనతా పార్టీ వ్యవహరించే తీరు ఈ విధంగానే ఉంటుంది. తమ పార్టీని బలపరుచుకునే విషయంలో అవసరమైతే మిత్రపక్షాలను చాలా లా ఘవంగా పక్కన పెట్టడంలో బిజెపి పెద్దలది అంది వేసిన చేయి.
ఇందుకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉదాహరణలు అయినా చెప్పుకోవచ్చు. బీహార్ మహారాష్ట్రలో బిజెపి అక్కడి మిత్రపక్షాలతో ఎన్ని రకాలుగా చదరంగం ఆడిందో అందరికీ తెలిసిందే. అదే క్రీడ ఆంధ్రప్రదేశ్లో కూడా బిజెపి మొదలెట్టింది అన్నది సోము వీర్రాజును ఎమ్మెల్సీ గా ఎంపిక చేయడం స్పష్టం చేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓపక్క అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తూ, చంద్రబాబును అంతగా పరిగణంలో తీసుకోకపోవడం ద్వారా బిజెపి ఇప్పటికే బాబుతో మైండ్ గేమ్ ఆడుతోంది. ఏపీ అసెంబ్లీలో సంఖ్యాబలం రీత్యా చూస్తే కూటమి పార్టీలైన జనసేన, బిజెపి మైనర్ వర్గమే అయినప్పటికీ ఆ పార్టీలకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.
తనకు ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ బిజెపి, జనసేనను కాదని ముందుకు పోయే పరిస్థితి ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో చంద్రబాబుకు సాధ్యం కాదు. అందుకనే అటు జనసేన, ఇటు బిజెపి చంద్రబాబుపై ఎన్ని రకాల ఒత్తిడులు తెస్తున్నా మౌనంగా భరిస్తున్నారు. మొన్న కు మొన్న తమ వల్లే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నప్పటికీ టిడిపి నుంచి ఎటువంటి స్పందన లేదు. అలాగే తమకు సొంతంగా ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిపించుకునే బలం లేకపోయినా బిజెపి తమకు ఎమ్మెల్సీ ఇవ్వాలని పట్టుబడితే ఇవ్వక తప్పని పరిస్థితిలో చంద్రబాబు ఓకే అన్నారు.
అయితే పార్టీని నమ్ముకుని ఎప్పటినుంచో పనిచేస్తున్న సీనియర్ తెలుగుదేశం నాయకులు తమకు ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము సొంతంగా ఎన్నికలకు వెళ్తే అధికారంలోకి వచ్చేవారమని బిజెపితో, జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించిందని అంటున్నారు. ఎమ్మెల్సీ పదవిని ఆశించి భంగపడ్డ పార్టీ సీనియర్లు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్, పిఠాపురం వర్మ వంటి వారు చంద్రబాబు వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు సొంత పార్టీ నాయకులకు నచ్చ చెప్పుకోలేక, అటు బీజేపీ, జనసేన నాయకులను ఎదిరించలేక చంద్రబాబు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు.