ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ప్లాన్ చేశారు. కేడర్ లో కొత్త ఉత్సాహం నింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతున్నారు. ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే… ఈ టూర్ లో ఒక విషయం మాత్రం బాబుని తెగ టెన్షన్ పెడుతుందని అంటున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబుకు… సత్తెనపల్లి నియోజకవర్గం పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. కారణం… ఇక్కడ ముగ్గురు బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేతలు సీటుకోసం పోటీ పడుతున్నారు. అవును… సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తానే టీడీపీ ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నానంటూ ఇప్పటికే దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామకృష్ణ ప్రచారం చేసుకుంటున్నారు.
అదేవిధంగా… మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు శ్రీనివాస్ అదే సీటును ఆశిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయపాటి శ్రీనివాస్, కోడెల శివరాం అనుచరుల మధ్య అనుచరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఈ సమయంలో… తనకు సత్తెనపల్లి సీటు ఇవ్వాలని బాబు దగ్గర మాటకూడా తీసేసుకుని.. పార్టీలో చేరిపోయారు కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ!
కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇప్పటికే సత్తెనపల్లిలో తన అనుచరులతో సమావేశాలు నిర్వహించేసుకుంటున్నారు. ఈసారి సత్తెనపల్లిలో టీడీపీ నుంచి పోటీచేయబోయేది తానేనని ఫ్లెక్సీలు కట్టించేసుకుంటున్నారు. దీంతో టీడీపీలో సత్తెనపల్లి సీటు, మూడుముక్కలాటగా మారిపోయింది. సరిగ్గా ఈ టైంలో చంద్రబాబుకు సత్తెనపల్లి పర్యటనకు వస్తున్నారు!
దీంతో ఎవరికి వారు వర్గాలుగా ఏర్పడి బాబు పర్యటనకు మద్దతు తెలుపుతున్నారని తెలుస్తుంది. సభలకూ, సమావేశాలకూ వర్గాలుగా వచ్చినా పర్లేదు కానీ… ఎన్నికల సమయానికి కూడా ఈ వర్గపోరు ఇలానే కంటిన్యూ అయితే మాత్రం… టీడీపీ ఓటమిని ఎవరూ ఆపలేరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విషయంలో చంద్రబాబు.. మేల్కొని ఎంత తొందరగా ఈ సమస్యను పరిష్కరిస్తే అంత మేలని సూచిస్తున్నారు!