మూడు రాజ‌ధానుల బిల్లుపై చంద్ర‌బాబు ధీమా అదే?

మూడు రాజ‌ధానుల బిల్లును జ‌గ‌న్ స‌ర్కార్ రెండ‌వ‌సారి అసెంబ్లీలో ఆమోదించి మ‌ళ్లీ శాస‌న‌మండ‌లికి పంపించిన నేప‌థ్యంలో మండ‌లి మ‌ళ్లీ పాత పాటే పాడిన సంగ‌తి తెలిసిందే. తొలుత ఇదే బిల్లును మండ‌లి సెల‌క్ట్ క‌మిటీకి పంప‌డం జ‌రిగింది. బిల్లు ఇంకా అక్క‌డే ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి అదే బిల్లును మ‌ళ్లీ అసెంబ్లీ లో ఆమెదించి మండ‌లికి పంపించ‌డం వెనుక జ‌గ‌న్ స‌ర్కార్ వ్యూహం ఏంట‌న్న‌ది తెలిసిందే. శాస‌న స‌భ లో ఆమోదం పొందింది కాబ‌ట్టి పెద్ద‌ల స‌భ అయిన మండ‌లిలో ఆమోదం పొందినా.. పొంద‌కపోయినా ఆమెదించిన‌ట్లు గా భావించి గ‌వ‌ర్న‌ర్ కు పంపించి చ‌ట్ట రూపం దాల్చేలా చేసుకోవాల‌న్న‌ది ప్ర‌భుత్వం ప్లాన్.

కానీ ఇక్క‌డ స‌ర్కార్ ఓ విష‌యం మ‌రిచిపోయిన‌ట్లు అనిపిస్తోంది. ఇప్పుడా ఆ లీగ‌ల్ పాయింట్ తోనే టీడీపీ ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు. సెల‌క్ట్ క‌మిటీకి వెళ్లిన బిల్లును మ‌ళ్లీ అసెంబ్లీలో ఆమెదించడం ఏంటి? దాన్ని మండ‌లికి తీసుకురావ‌డం ఏంటి? ఇదంతా రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని హై కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసారు. ఈ బిల్లు విష‌య‌మై హైకోర్టులో ప్ర‌భుత్వ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ఈ బిల్లు సెల‌క్ట్ కమిటీకి వెళ్లింద‌ని హైకోర్టుకు స్వ‌యంగా తెలిపారు. ప్ర‌భుత్వం త‌రుపున ప్ర‌మాణ ప‌త్రం కూడా స‌మర్పించారు. ఇప్పుడీ విచార‌ణ‌లో అంశం కీల‌కంగా మార‌నుంది. ఈ పాయింట్ తో టీడీపీ ఎమ్మెల్సీ , చంద్ర‌బాబు నాయుడు న్యాయ‌పోరాటానికి దిగారు.

దీంతో ఈ బిల్లు విష‌యం మ‌రోసారి రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ‌కు దారి తీస్తోంది. చంద్ర‌బాబు ఆ ధీమాతోనే తొలి నుంచి ఉన్నార‌ని తెలుస్తోంది. చంద్రబాబు ఏదీ చేసినా లాజిక్ ఉంటుంది. అత‌ని స్ర్టాట‌జీని అంచ‌నా వేయ‌డం అంత వీజీ కాదని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ స‌ర్కార్ కు హైకోర్టు ప‌లు అంశాల్లో మొట్టికాయ‌లు వేసిన సంగ‌తి తెలిసిందే. ఈనేప‌థ్యం లో రాజ‌ధానుల బిల్లు పై ఎలాంటి తీర్పు వ‌స్తుంది! అన్న దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.