కేంద్ర బడ్జెట్: సామాన్యుడికి కరోనా వాత కెవ్వు కేక.!

Budget to do publicity stunts

‘మేం దేశాన్ని ఉద్ధరించేస్తున్నామహో..’ అని పబ్లసిటీ స్టంట్లు చేయడానికే బడ్జెట్.. అన్నట్టు తయారైంది పరిస్థితి. పన్నులు కూడా ఈ పబ్లసిటీ కోసమే ఉపయోగపడుతున్నాయేమో. గతంలో స్వచ్ఛభారత్ పేరుతో సెస్ వేశారు. నిజంగానే దేశం స్వచ్ఛ భారత్ దిశగా పరుగులు పెట్టిందా.? అంటే లేదాయె. ఇప్పుడు అగ్రి సెస్ రంగంలోకి దిగుతోంది. పెట్రో ఉత్పత్తులపై ఈ అగ్రి సెస్ మంట ఓ రేంజ్లో సామాన్యుడిని పీల్చి పిప్పి చేసెయ్యనుంది. ‘తూచ్, అది అడ్జస్ట్‌మెంట్ మాత్రమే..’ అని ప్రభుత్వం చెప్పొచ్చుగాక. కానీ, అందులో చాలా మతలబుతుంటాయి. నిజానికి, రికార్డు స్థాయిలో పన్నులు పెట్రో ఉత్పత్తుల మీద వున్నాయి. రాష్ట్రాలు, కేంద్రం పోటా పోటీగా పన్నుల మోత మోగిస్తోంటే, సామాన్యుడి బతుకు బండి అయోమయంలో పడిపోతోంది. పెట్రో ధరల పెంపుదల అంటే, అన్ని రంగాల మీదా వాత పెట్టినట్లే. యూపీఏ సర్కారు హయాంలో పెట్రో ధరలు పెరిగితే అప్పట్లో గగ్గోలు పెట్టిన బీజేపీ, తాము అధికారంలోకి వచ్చాక మాత్రం. అప్పటితో పోల్చితే అంతర్జతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గినా, దేశంలో పెట్రో ధరల్ని మాత్రం విపరీతంగా పెంచేయడం చూస్తూనే వున్నాం.

Budget to do publicity stunts

వ్యసాయ రంగానికి ఊతం.. అనే పేరుతో పెద్దయెత్తున ‘అగ్రి సెస్’ వసూలుకు రంగం సిద్ధమయ్యింది. దాదాపుగా ఏడేళ్ళ నుంచీ వ్యవసాయ రంగాన్ని ఉద్ధరించేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతూనే వచ్చింది. కానీ, దేశంలో రైతుల ఆత్మహత్యలు తగ్గలేదు సరికదా, కొత్త వ్యవసాయ చట్టాలతో రైతు నడ్డి విరిచేందుకు కేంద్రం సిద్ధమయ్యింది. వాస్తవ పరిస్థితులు ఇంత స్పష్టంగా అందరి కళ్ళకూ కనిపిస్తోంటే, ఇప్పుడు కొత్తగా అగ్రి సెస్ వేయడం ఎవరి కోసం.? ఎందుకోసం.? అన్న ప్రశ్న తలెత్తకుండా వుంటుందా.? ఇక, లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయబోతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించేసుకున్నారు. ఎప్పుడూ అప్పులేనా.? పన్నులేమైపోతున్నాయ్.? అన్న ప్రశ్నకు కేంద్రం నుంచి సమాధానం లేదు. ఓ పక్క కేంద్రం, తన సంపాదనను పన్నుల ద్వారా పెంచేసుకుంటోంటే, రాష్ట్రాలకు మాత్రం పన్నుల వాటా తగ్గిపోతోందన్న విమర్శ లేకపోలేదు. స్టాక్ మార్కెట్లకు ఉత్సాహమిచ్చిన నిర్మలమ్మ బడ్జెట్, సామాన్యుడ్ని మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కరోనా నుంచి కోలుకోవడం సంగతి దేవుడెరుగు.. పెరుగుతున్న పన్నుల నేపథ్యంలో సామాన్యుడి బతుకు ఏమవుతుందో తెలియని దుస్థితి.