గత సార్వత్రిక ఎన్నికల్లో తగిలిన దెబ్బ కరోనా కంటే గొప్పదని బలంగా భావిస్తున్న ఏపీ టీడీపీ నేతలకు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వ్యాక్సిన్ లా పనిచేశాయి! అనంతరం జరిగిన వివిద బహిరంగ సభలు కూడా బాబు & కో కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. తాజాగా జరిగిన మహానాడులో మేనిఫెస్టోపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి కానీ… కేడర్ లో మాత్రం ఉత్సాహం కంటిన్యూ అయ్యింది. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వనంటూ… తమతో పొత్తు కోసం పవన్ వేచి చూస్తున్న అంశం కూడా తమ్ముళ్లకు కాస్త ఉపశమనం కలిగించింది. ఈ సమయంలో బీజేపీ నుంచి కూడా చిన్న చిన్న ఆశ రేపుతున్న మాటలు తెరపైకి వచ్చాయి.
ఏపీలో చంద్రబాబుకు జనసేనతో పొత్తు కంటే… బీజేపీ – జనసేనలతో కలిసిన పొత్తు మజా ఇస్తుంది! అధికారికంగా చెప్పలేకపోతున్నా… బాబు మనసులో మాట ఇదే అనేది టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మోడీని ఆకాశనికెత్తేశారు బాబు. అసలు విజన్ విషయంలోనూ, అభివృద్ధి విషయంలోనూ మోడీ – తాను ఒకేలా ఆలోచిస్తామని చెప్పే సాహసం కూడా చేశారు!
ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లో భేటీ అయ్యారు ఏపీ బీజేపీ నేతలు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుతో పాటు కీలక నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి… ఏపీలో బీజేపీ బలోపేతం, పొత్తులపై చర్చించామని తెలిపారు. దీంతో.. ఎక్కడో ఆశరేపే మాటలు మాట్లాడారని అంటున్నారు పరిశీలకులు!
ఏపీలో ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్నామని చెబుతూనే.. పొత్తుల విషయంలో అధిష్టాణానిదే ఫైనల్ నిర్ణయం అని పలుకుతూనే.. ఎన్నికలకు 2 నెలల ముందు పొత్తులు ఖరారవుతాయని వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. దీంతో… బీజేపీతో పొత్తు విషయంలో ఆశలు చంపేసుకోవాల్సిన అవసరం లేదని.. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ బీజేపీతో పొత్తుపై కాస్త హోప్ తోనే ఉండొచ్చని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయంట. ఇది చంద్రబాబుకు కచ్చితంగా గుడ్ న్యూస్ అని అంటున్నారు విశ్లేషకులు.
మరి ఇలా ఆశలు రేపిన బీజేపీ నాయకులు.. ఎన్నికలకు రెండు నెలల ముందు అయినా గుడ్ న్యూస్ చెప్పి… బాబుకు 2014 ఎన్నికల నాటి ధైర్యం ఇస్తారా.. లేక, తీరా ఆశలు రేపి సరిగ్గా ఎన్నికల ముందు “తూచ్” అంటూ గాలి తీసేస్తారా అనేది వేచి చూడాలి. అయితే… ఏపీలో జనసేనతోనే తమ పొత్తు ఉంటుందని మాత్రమే ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ పెద్దలు… ఇప్పుడు ఎన్నికలకు రెండు నెలల ముందు పొత్తుల విషయం ఖరారు చేస్తామని చెప్పడం కొత్త విషయమే!