సామాన్యుడి గుండెల్లో గునపం దించిన బీజేపీ 

BJP has no benevolence
ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని క్రూరజంతువు అమాయక జింకలమీద పడి గొంతుకోరికి రక్తం తాగినట్లు సామాన్య ప్రజలమీద నిర్దాక్షిణ్యంగా చేసిన దాడిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను అభివర్ణించవచ్చు.  కరోనా కారణంగా కోట్లాదిమంది ప్రజలు ఉపాధిని కోల్పోయి విలవిలలాడుతుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నట్లు ప్రజల కష్టాల పట్ల ఏమాత్రం జాలి లేకుండా ప్రవేశ పెట్టిన బజెట్ అక్షరాలా మధ్యతరగతి వారి మీద దాడే.  
 
BJP has no benevolence
BJP has no benevolence
బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆదాయపు పన్ను పరిధిని పెంచుతారని ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకుంటారు.  కనీసం పదివేల రూపాయలైనా పెంచకపోతారా…ఆదాయపు పన్ను భారం కొంతైనా తగ్గుతుందని ఆశిస్తారు.  కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఆదాయపు పన్ను పరిధిని ఐదు లక్షలు చెయ్యాలని బీజేపీ డిమాండ్ చేసేది.  కానీ వారు ఏడేళ్లనుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పరిధిని పెంచలేదు.  మెజారిటీ ప్రజలు ఉపయోగించే ఉత్పత్తుల మీద పన్ను భారం అధికం చెయ్యడం, ఎప్పుడో ఒకసారి స్వల్పంగా కొనుక్కునే బంగారం, వెండి మీద పన్నులు తగ్గించడం చూస్తుంటే ఈ బజెట్ కేవలం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా రూపొందించింది మాత్రమే అనిపిస్తుంది.  ఒకవంక ఢిల్లీలో రెండు నెలల నుంచి రైతులు ఆందోళనలు చేస్తుంటే వ్యవసాయ సెస్ పేరుతో ఇంధనం ధరలు పెంచడం ఏమన్నా సమంజసంగా ఉన్నదా?  
 
ఇంధనం ధరలు పెంచడం మధ్యతరగతి వాడి నడ్డి విరగ్గొడుతుంది.  అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి.  ప్రభుత్వ ఉద్యోగులకంటే అన్ని రక్షణలు ఉంటాయి, వారికి ఒక నిర్ణీతవ్యవధిలో వేతనాలు పెరుగుతాయి  కాబట్టి వారికి పెద్ద భారం అనిపించకపోవచ్చు.  కానీ, ప్రయివేట్ రంగంలో చిరు ఉద్యోగాలు చేసుకుంటూ పొట్టపోసుకునేవారి సంగతి ఏమిటి?  ఇంధన ధరల పెంపు వలన రవాణా చార్జీలు పెరుగుతాయి.   నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి.   బస్సు చార్జీలు పెరుగుతాయి.  రాజకీయనాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పారిశ్రామికవేత్తలు లాంటి గొప్పవారు ఎర్రబస్సుల్లో ప్రయాణించరు కాబట్టి వారికి పేదవారి కష్టాలు తెలియవు.   
 
ఇక డెబ్బై ఐదేళ్లు దాటినవారు ఆదాయపు పన్ను వివరాలు తెలపాల్సిన అవసరం లేదంటూ ప్రకటించడం క్రూరపరిహాసం మాత్రమే.  మనదేశంలో పదవీవిరమణ వయసు 58 , 60  సంవత్సరాలుగా ఉన్నది.  ఆ తరువాత వారికి వచ్చే పెన్షన్ నామమాత్రంగా ఉంటుంది.  2004  సంవత్సరం తరువాత ఉద్యోగాల్లో చేరినవారికి ఆ మాత్రం కూడా ఉండదు.  సగం ఆదాయం పొందుతూ వృద్ధాప్యంలో రోగాలతో, కుటుంబ సమస్యలతో అల్లాడేవారికి  ఆదాయపు పన్ను చెల్లించడం ఎంత భారంగా ఉంటుంది!  పూర్తి మినహాయింపు పొందటానికి వారు మరో పదిహేనేళ్ళు ఎదురు చూడాలా?  అసలు మనదేశంలో మానవుల సగటు ఆయుర్దాయం ఎంత?  డెబ్బై ఐదేళ్లు దాటినదాకా జీవించేవారు ఎందరుంటారు?  కనీసం రిటైర్ అయినవారికి కూడా పన్ను మినహాయింపు ఇవ్వలేరా?  
 
ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయింపులు ఘోరాతిఘోరంగా ఉన్నాయి.  ప్రత్యేకహోదా మాట లేదు.  పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల గూర్చి ఊసు లేదు.  రోడ్ల విస్తరణ పధకాలు లేవు.  కేంద్రీయ విద్యాలయాల ప్రస్తావన లేదు.  సామాన్యులకు ఊరటనిచ్చే ఒక అంశం కూడా లేకపోవడం విచారకరం.  రెండు తెలుగు రాష్ట్రాలకు రిక్తహస్తాలు మాత్రమే చూపించి తమ అమానుషత్వాన్ని చాటుకున్నారు ఆర్ధికమంత్రి, ప్రధానమంత్రి.  “ఇది ఒక చెత్త బడ్జెట్” అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన విమర్శ నూటికి నూరుపాళ్లు వాస్తవం.  బీజేపీని ప్రజలు ఎన్నటికీ క్షమించరు.
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు