మన నాయకులు కళ్ళు తెరవకపోతే ఉత్తరాది పెత్తనం కొంప ముంచనుందా?, దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాల వివక్షకు గురై అభివృద్ధికి దూరంగా ఉండిపోనున్నాయా?, సొంత దేశంలోనే మనం పరాయి వాళ్లుగా మిగిలిపోనున్నామా?.
ఈ ప్రశ్నలు ప్రస్తుతం దక్షిణాది సమాజంలో వివిధ వర్గాల వారిని తొలి చేస్తున్నాయి. స్వతంత్ర భారతావనిని ఇప్పటివరకు ఉత్తరాది ప్రధాన మంత్రులే ఎక్కువ కాలం పరిపాలించారు. ఈ కారణంగా దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుక పడ్డాయని, ఉత్తరాది పెత్తనాన్ని మనమంతా సంయుక్తంగా ఎదుర్కోవాలని, లేకుంటే మనం మరింత వెనుకబడి పోతామని మన నాయకులు తరచు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఈ ఆందోళన మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఒకటి మనకు పొంచి ఉంది.
అదే లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన. వచ్చే సంవత్సరం జరుగుతాయని భావిస్తున్న లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన లో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరగనుందని మన నాయకులు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు. జనాభా ప్రాతిపదికన ఈ డీలి మిటేషన్ జరిగితే దక్షిణాదిలో లోక్ సభ సీట్లు గణనీయంగా తగ్గిపోతాయి. ఎందుకంటే అభివృద్ధిలోనే కాకుండా జనాభా విషయంలో కూడా ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాదిని ఇప్పుడో మించిపోయాయి, గడచిన అర్ధ శతాబ్ద కాలంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా పెరిగింది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల బాగా తగ్గుముఖం పట్టింది.
ఈ పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 42 లోక్ సభ స్థానాలు 34కి తగ్గిపోతాయి. కర్ణాటకలో ఉన్న 28 స్థానాలు 26 కు, కేరళలో 20 నుంచి 12 కు, తమిళనాడులో 39 నుంచి 31కి లోక్ సభ స్థానాలు తగ్గిపోతాయి. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 91కి లోక్ సభ స్థానాలు పెరుగుతాయి. బీహార్లో 40 నుంచి 50కి, మధ్యప్రదేశ్లో 29 నుంచి 33కి లోక్ సభ స్థానాలు పెరుగుతాయి. లోక్ సభ సభ్యుల సంఖ్య ఆధారంగానే భారతదేశ ప్రధానమంత్రి ఎవరు అనే నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ప్రధానిని ఎన్నుకోవడంలో ఉత్తరాది వారి ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. అంటే కేంద్ర రాజకీయాల్లో దక్షిణాది వారి పాత్ర ఇప్పుడున్న పరిస్థితి కంటే మరింత దిగజారిపోతుందన్నమాట.
నిధులు తెచ్చుకోవడంలో గాని, అభివృద్ధి ప్రాజెక్టులను సాధించుకోవడంలో గానీ మరీ వెనకబడిపోతామన్నమాట. ఉత్తరాదిలో వచ్చిన మెజార్టీతోనే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు అయిపోతే ఇక దక్షిణాది వారిని ఎందుకు పట్టించుకుంటారు. ఇప్పటికే జీఎస్టీ రూపంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మన నాయకులు తరచు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది నుంచి వసూలు చేసే జీఎస్టీ శాతం కన్నా తిరిగిచ్చే నిధుల శాతం మరీ తక్కువగా ఉంటుంది. అదే ఉత్తరాది రాష్ట్రాలకు అయితే వారి నుంచి వసూలు చేసే జీఎస్టీ శాతం కన్నా వారికి తిరిగి ఇచ్చే నిధుల శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఉత్తరాది చకచకా అభివృద్ధి చెందుతుండగా దక్షిణాది రాష్ట్రాల ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటోంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే దక్షిణాది లోక్ సభ స్థానాలు తగ్గకుండా చూసుకోవలసిన బాధ్యత మన నాయకులపై ఉంది.
అయితే డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఒక్క లోక్ సభ స్థానం కూడా తగ్గదని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించారు. దీన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. అమిత్ షా లోక్ సభ స్థానాలు తగ్గవు అని చెప్తున్నారు తప్ప, దానికున్న ప్రాతిపదికను ఏమి వివరించలేదని సిద్ధ రామయ్య అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆందోళనలు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోటే అమిషాల ప్రకటించారు కానీ జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ జరిగితే దక్షిణదికి లోక్ సభ స్థానాలు కచ్చితంగా తగ్గుతాయని సిద్దరామయ్య చెబుతున్నారు.
అందుకని 2011 లేదా 2031 జనాభా లెక్కల ప్రాతిపదికగా కాకుండా 1971 సెన్సెస్ ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచిస్తున్నారు. ఇలా అయితే ఇప్పుడున్న లోక్ సభ స్థానాలకు దామాషా ప్రాతిపదికన స్థానాలు అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతాయి. అప్పుడు ఉత్తర, దక్షిణాది బేధాలు లేకుండా అందరికీ సమన్యాయం జరుగుతుంది. ఇందుకోసం దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ పార్టీలకతీతంగా కలిసి రావాలని అందరూ కోరుకుంటున్నారు కూడా.
దేశంలో జనాభా విష్పోటనాన్ని అరికట్టడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం 1970 లలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలను మాత్రమే కనండి అనే నినాదాన్ని తీసుకువచ్చింది. దేశ అభివృద్ధి, భవిష్యత్తు రీత్యా జనాభాను అరికట్టాలని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ విధానానికి కట్టుబడి దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పద్ధతులను పాటించి తమ దేశభక్తిని చాటుకున్నాయని చెప్పవచ్చు. అదే సమయంలో ఉత్తరాదివారు ఈ విషయాన్ని లైట్ గా తీసుకోవడంతో అక్కడ జనాభా దక్షిణాదిని మించిపోయింది. అయితే చిత్రంగా దేశం కోసం జనాభా నియంత్రణ పాటించిన దక్షణాదికి ఎటువంటి ప్రోత్సాహాలు దక్కక పోగా నిధుల పంపిణీలో తీవ్ర అన్యాయం జరుగుతోంది.
ఎందుకంటే కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేసే నిధులు గ్రాంట్ల కు సంబంధించి జనాభానే ఇప్పటికీ ప్రాతిపదిగా తీసుకోవడం వల్ల దక్షిణది తీవ్రంగా నష్టపోతోంది. దీనికి విరుగుడా అన్నట్టు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… ప్రజలారా జనాభాను పెంచండి అభివృద్ధి ఫలాలు పొందండి, ఎంత మంది పిల్లలను కంటే దేశం అంత అభివృద్ధి చెందుతుంది అని పలుమార్లు జనానికి పిలుపు ఇచ్చారు కూడా. అయితే అభివృద్ధి మాట ఎలా ఉన్నా మళ్ళీ తిరో గమనం దిశగా పయనించినట్టు అవుతుందని.. చంద్రబాబు సూచన సరికాదనే వారు కూడా ఉన్నారు.
అందుకే కేంద్ర నిధుల కోసం, లోక్సభలో ఆధిపత్యం కోసం జనాభాను ఎలా పెంచాలి అని ఆలోచించే కన్నా సిద్ధరామయ్య సూచించినట్టు ఇప్పుడున్న లోక్ సభ స్థానాల ఆధారంగా డీలిమిటేషన్లో దక్షిణాదికి స్థానాలు పెంచాలని అడగడమే సరైనది. ఇందుకోసం దక్షిణాది రాష్ట్రాల నాయకులు నడుం బిగించాలి. టీ లిమిటేషన్ ప్రక్రియను శాస్త్రీయంగా ముగించడానికి, దేశంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడ్డానికి అవసరమైతే ఒక నిపుణుల కమిటీని నియమించాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా దక్షణాదిని రాజకీయంగా పాగా వేయలేకపోతున్న భారతీయ జనతా పార్టీ డీలిమిటేషన్ ప్రక్రియను నిష్పక్షపాతంగా పూర్తి చేయదని సీతారామయ్య వంటి వారు గట్టిగా నమ్ముతున్నారు.
దాన్ని ఎదుర్కోవాలంటే పార్టీలకతీతంగా నాయకులందరూ ఏకం కావాలి. సిద్ధరామయ్య ప్రయత్నాలకు మిగతా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులు అండగా నిలవాలి. అప్పుడే మన లోకసభ స్థానాల సంఖ్య తగ్గకుండా చూసుకోగలుగుతాం. కాబట్టి నాయకులరా ఏకంకండి… దక్షిణాదికి పొంచి ఉన్న పెనుముప్పును తప్పించండి అని జనం ముక్తకంఠంతో కోరుతున్నారు.