ఎన్నికల సంరంభం మొదలైన తరువాత కూడా ఎన్నికల కమీషన్, ప్రభుత్వం పరస్పరం విమర్శలు చేసుకోవడం ఆగలేదు. ఎన్నికల కమీషనర్ గా హుందాగా వ్యవహరించాల్సిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకటో తరగతి పిల్లాడిలా చీటికిమాటికి రాజ్యాంగబద్ధ రాష్ట్రాధినేత అయిన గవర్నర్ కు పితూరీలు చేస్తుండటం హాస్యాస్పదంగా ఉన్నది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మాజీ భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి స్వర్గీయ టి ఎన్ శేషన్ తో పోల్చుతూ కొన్ని పత్రికలు, ఛానెల్స్ చేస్తున్న భజన నవ్వు తెప్పిస్తుంది. ఆనాడు టి ఎన్ శేషన్ ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎందరు విమర్శలు చేసినా తన అధికారాలతో ఎదుర్కొన్నారు తప్ప రోజుకు నాలుగు సార్లు రాష్ట్రపతికి ఫిర్యాదులు చెయ్యలేదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, తన అధికారాలను ఎలా వినియోగించుకోవాలో తెలియక, అసలు తన అధికారాల మీద తనకే స్పష్టత లేక, వెనుకనుంచి ఎవరో కీ ఇచ్చి ఆడిస్తున్నట్లు నిమ్మగడ్డ శైలి ఉన్నది తప్ప ఒక సర్వస్వతంత్రుడైన అధికారి శైలిలా లేదు.
నిమ్మగడ్డ నిన్న గవర్నర్ కు ఒక లేఖ వ్రాస్తూ కొందరు మంత్రుల మీద, ఎంపీల మీద, సలహాదారుల మీద, అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, వారిని పిలిపించి మందలించాలని, లేకపోతె కోర్టుకు వెళ్తానని బెదిరించారని ఒక పత్రిక వ్రాసింది. దానికి తగ్గట్టే హైకోర్టులో సీఎస్ ఆదిత్యనాధ్, మాజీ సీఎస్ నీలం సాహ్నిల పై కోర్టు ధిక్కరణ కేసు వేశారట నిమ్మగడ్డ. ప్రభుత్వ పెద్దలతో, అధికారులతో చర్చించి వారి సహకారం అందుకుని సజావుగా ఎన్నికలు నిర్వహించమని న్యాయస్థానాలు నిమ్మగడ్డను కోరితే, అందుకు భిన్నంగా అయన ప్రతి ఒక్క అధికారిని, వ్యవస్థను హెచ్చరిస్తూ, బెదిరిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా ఆయన ఏమి చేసినా ప్రశ్నించలేని పరిస్థితి ఉన్నదనడంలో సందేహం లేదు. కానీ, ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించారని సత్కీర్తి మూటగట్టుకుని వెళ్ళిపోయి, తరాల తరువాత కూడా ప్రజల మనసుల్లో టి ఎన్ శేషన్ లా గుర్తుండి పోవాలని కోరుకుంటున్నారా లేక రిటైర్ ఐన మరుక్షణమే “పీడా వదిలింది” అనుకునేట్లు చెయ్యదలచుకున్నారా నిమ్మగడ్డ గారు?
నిమ్మగడ్డ ప్రవర్తన చూస్తూ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించడంలో ఆశర్యం ఏమీ లేదు. వారు రాజకీయ నాయకులు. వారు విమర్శించకుండా, నిమ్మగడ్డ నిర్ణయాలు తప్పనిపిస్తే ఆక్షేపించకుండా ఎలా ఉంటారు? రాజకీయనాయకులు ఆరోపణలు చెయ్యడం సహజం. ఆ విమర్శలను సీరియస్ గా తీసుకుని భుజాలు తడుముకోవడం ఎందుకు? నిమ్మగడ్డ లేఖల రూపంలో తన విమర్శలను రాజ్ భవన్ కు, కోర్టుకు పంపిస్తుంటే, వారు మీడియా సమావేశాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిమ్మగడ్డను ఎవ్వరూ పన్నెత్తి మాట అనడానికి వీలు లేదని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో ఎక్కడైనా పేర్కొన్నదా? తనను ఎవ్వరూ విమర్శించరాదని శాసించే అధికారం నిమ్మగడ్డను ఎవరిచ్చారు? విమర్శలకు నిమ్మగడ్డ అతీతులు కారే? తనమీద విమర్శలు అనుచితం అని ఆయన భావిస్తే కోర్టుకు వెళ్లే హక్కు ఆయనకు ఉంటుంది. పరువునష్టం దావాలు వేసుకోవచ్చు. ఎవరొద్దన్నారు? తెలుగుదేశం వారు చేస్తున్న భజనలు ఆనందంగా ఆస్వాదిస్తూ, వైసిపి వారి విమర్శలను సహించలేనంటే ఎలా?
పంచాయితీ ఎన్నికలు అనేవి పార్టీ రహితంగా, గుర్తుల రహితంగా సాగేవి అయినపుడు అసలు ఎన్నికల కోడ్ దేనికి? ఎల్లుండి నుంచి ప్రభుత్వం తలపెట్టిన సన్నబియ్యం పంపిణీని అడ్డుకుని పేదవారి కడుపు మీద గుద్దటం ఎంతవరకు సమంజసం? ఆ బియ్యం తినగానే అందరూ వైసిపికే ఓట్లు వేస్తారా? బియ్యం చూసి, కిరోసిన్ చూసి తమ మనసు మార్చుకుంటారని భావిస్తే అది పేదవారి ఆత్మగౌరవాన్ని అవమానించడమే అవుతుంది. బియ్యం అందుకునేవారి ఇళ్లలో ఓటు హక్కు లేని చిన్న పిల్లలు, పసిపిల్లలు కూడా ఉంటారని గ్రహించాలి. ఆ పసివారి ఉసురుపోసుకుని ఎన్నికల కమీషన్, తెలుగుదేశం వారు సాధించేది ఏమిటి? తన అవివేకపు చర్యలు, చేష్టలతో రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు చెప్పలేనంత అపఖ్యాతి తెచ్చిన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొన్నాళ్లపాటు గుర్తుండిపోతారు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు