ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఈ ముగ్గురూ వైసీపీలో రెబల్స్‌గా మారారు. వైసీపీ నుంచి గెంటివేయబడ్డారు కూడా.! అలా గెంటివేయబడటానికి బలమైన కారణమూ లేకపోలేదు.
నియోజకవర్గంలో ప్రజలతో మమేకం కావడంలేదన్నది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీదున్న ఆరోపణ. ఆనం రాంనారాయణరెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం వేరే. దుందుడుకు స్వభావం.. పైగా, తన ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం.. ఇవన్నీ ఆయనకు శాపంగా మారాయి.
ఈ ముగ్గురూ వైసీపీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ వున్నట్టు కాదు. కానీ, త్వరలో టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఈ ముగ్గురూ టీడీపీలో చేరతారట. నెల్లూరు జిల్లాలో ఈ మేరకు ఆయా నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తనకు అసెంబ్లీ టిక్కెట్ 2024 ఎన్నికల్లో ఇవ్వమని పదే పదే ముఖ్యమంత్రిని అడిగినా, ఆయన ఇవ్వలేదనీ, అందుకే వైసీపీకి దూరమయ్యానని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిజానికి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్ ధిక్కరించాన్న కారణంగా, వీరిపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ. సరే, తెరవెనుక పైన చెప్పుకున్న కారణాలున్నాయన్నది వేరే చర్చ.
ఇంతకీ, ఈ ముగ్గురూ టీడీపీలో చేరితే, టీడీపీకి లాభమెంత.? ఖచ్చితంగా లాభమైతే వుంటుంది. అదే సమయంలో కొంత నష్టం కూడా జరగొచ్చు.! రాజకీయాల్లో రెండు ప్లస్సులు కలిస్తే, మైనస్సు కూడా అవుతుంది.