కాపు కులం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలుస్తుందా?

తెలుగు రాష్ట్రంలో కాపులు కాస్త ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. రెడ్లు, కమ్మలు తర్వాత అధికారపీఠం తమదే అనే ధోరణిలో కూడా ఉన్నారు. అధికారం అనుభవిస్తున్న రెడ్లు, కమ్మల తర్వాత అంత బలమైన కులం కాపులే. ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఈ రాష్ట్రంలో మూడో స్థానం వారిదే. అందుకే కమ్మ, రెడ్డి తర్వాత అధికారం తమదే అనే ఆలోచన వారిలో రేకెత్తింది.

విజయవాడలో వంగవీటి రంగా హయాంలోనే కాపులు రాజకీయ పోరాటం మొదలు పెట్టారు. కాపునాడు అలా మొదలయిందే. రంగా నేపధ్యం వేరే అయినా రంగా ప్రత్యర్థి దేవినేని నెహ్రూ టిడిపిలో చేరడంతో కాపులు రంగాపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఉపయోగించుకొని రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేశారు. చిలంకుర్తి వీరాస్వామి, పిళ్ళా వెంకటేశ్వర రావు లాంటి కాపు నేతలు కాపుల్లో ఐక్యతకోసం పనిచేశారు. జక్కంపూడి రామమోహన్ రావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు రంగాకు మద్దతుగా ఉంటూనే రంగాను కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కమ్మ, రెడ్డి కులాలకు తోడుగా ఎదగడమే తప్ప ధీటైన ప్రత్యర్థిగా ఎదిగే అవకాశం కాపులకు కలగలేదు.

ఆ అవకాశంకోసం ఎదురు చూస్తున్న సమయంలోనే మెగాస్టార్ గా వెలుగొందుతున్న చిరంజీవి “ప్రజా రాజ్యం” పేరుతో రాజకీయ పార్టీ పెట్టి కదన రంగంలోకి దూకారు. తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్టీఆర్ తర్వాత అంత పాపులారిటీ కలిగిన చిరంజీవి రాజకీయాల్లోకి రావడంతో కాపులు ఆ పార్టీపై, ఆ నాయకుడిపై గంపెడంత ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవికి ఉన్న పాపులారిటీ ఎలాగైనా తమను అధికార పీఠంపై కూచోబెడుతుందని ఆశపడ్డారు. కాపులు అధికశాతంలో ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో ఆస్తులు అమ్మి రాజకీయంగా చిరంజీవికి అండగా నిలబడ్డారు. ఉభయగోదావరి జిల్లాల్లో కాపులకు ఎస్సిలతో కొన్ని ప్రాంతాల్లో, బిసిలతో కొన్ని ప్రాంతాల్లో, రాజులతో కొన్ని ప్రాంతాల్లో, కమ్మలతో మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రస్థాయి విభేదాలు ఉన్నప్పటికీ చిరంజీవికి అండగా గట్టిగ నిలబడ్డారు. గెలుపు చిరంజీవిదే అనే స్థాయిలో గట్టి విశ్వాసంతో పనిచేశారు. తీరా ఎన్నికల్లో 18 స్థానాలే గెలవడంతో తీవ్ర అవమానంతో తలదించుకున్నారు. అయినా, అధికారంపై కాంక్ష చావక ఎదురు చూస్తూనే ఉన్నారు.

సరిగ్గా అదేసమయంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ “జన సేన” పేరుతో సరికొత్త రాజకీయం మొదలు పెట్టారు. చిరంజీవి “గంజి – బెంజి” అంటే పవన్ కళ్యాణ్ “చే గువేరా” అన్నాడు. చే గువేరా గురించి ఏమాత్రం తెలియకపోయినా పవన్ కళ్యాణ్ లో కనిపించే ఆవేశం చూసి కాపులు మరోసారి ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి సౌమ్యుడు కావడం వల్ల అనకొండలు అయిన కాంగ్రెస్ నాయకులు చిరంజీవిని మింగేశారని, అది చిరంజీవి తప్పు కాదని తమను తాము ఊరడించుకొని సర్దుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు కావడంతో ఇక విజయం తమదే అనే ఆశ మొలకెత్తింది. ఇలా ఆశలు రేకెత్తించిన పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా కొంత నిరుత్సాహపర్చినా ఆయన మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు దక్కుతాయని, టిడిపి వాగ్దానం చేసిన “బిసి” గుర్తింపు లభిస్తుందని ఆశపడ్డారు. అవికూడా తీరని ఆశలే అయ్యాయి.

అందుకే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసినా కాపులు గట్టిగా భుజం కాసి అండగా నిలబడలేదు. పైగా తనను ఒక కులానికి పరిమితం చేయొద్దని పవన్ కళ్యాణ్ బహిరంగ ప్రకటన చేయడం, టిడిపి హయాంలో ముద్రగడ పద్మనాభం నెలల తరబడి గృహనిర్బంధానికి గురైనా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో కాపులు జనసేనకు అండగా నిలవలేదు. అందుకే పార్టీ అత్యంత అవమానకర ఓటమి చూసింది. పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఈ ఎన్నికల్లో జనసేన పరువు నిలిపింది రాపాక వరప్రసాద రావు మాత్రమే. అది కూడా ఒక దళితుడు. అందులోనూ వరప్రసాదరావుకు వ్యక్తిగతంగా ఉన్న బలం, మాయావతితో జనసేన పొత్తు రాపాక గెలవడానికి కొంత దోహదం చేశాయి. ఇప్పుడు పవన్ దళితులను, మాయావతిని, కమ్యూనిస్టులను, చే గువేరాను పక్కన పెట్టి బిజెపితో దోస్తీచేస్తున్నారు. ఆయన రాజకీయలబ్ది కోసమే ఈ నిర్ణయం తీసుకుంటే ఇన్ని వర్గాలను దూరం చేసుకొని ఏమాత్రం ప్రతినిధ్యంలేని పార్టీ పంచన చేరాల్సిన పనిలేదు. అలా చేరడంవల్ల ఆయనకు వచ్చే రాజకీయ లబ్ది కూడా లేదు. పైగా రెండుసార్లు దగా పడ్డ కాపు కులం ఇప్పుడు పవన్ కు అండగా నిలుస్తుందన్న నమ్మకం లేదు.

Written by Aditya for TeluguRajyam.com