ఎంపీ రాఘురామరాజు వైకాపా హైకమాండుకు కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యవహారాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తనవైపు తప్పుందని ఒప్పుకోవడం, అధినాయకత్వానికి లొంగడం లాంటివి అస్సలు చేసేలా లేరు. ఇక ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఆయన అందులో కూడా తన తప్పేమీ లేదంటూ చాలా తెలివిగా తన చర్యలను సమర్థించుకున్నారు. దీంతో హైకమాండ్ ఈగో శాటిసిఫై కాలేదు. మాములుగానే ఏకపక్ష ధోరణి కలిగిన అధినాయకత్వం ఎంపీగారి తెలివి తేటలతో మరింత ఫైర్ అవుతున్నట్టు, ఇక లాభం లేదని ఆయన్ను పార్టీ నుండి బయటికి పంపాలనుకుంటున్నట్టు సమాచారం.
రాజుగారి మీద ఇలా కఠిన చర్యలు తీసుకుని నాయకులందరికీ క్రమశిక్షణ విషయంలో గట్టి సంకేతాలు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. కానీ అసలు రాఘురామరాజును పార్టీ నుండి తొలగించడం అంత సులభమైన పనా అంటే కాదనే అనాలి. ఎందుకంటే రాఘురామరాజును వైకాపా నుండి బయటకు పంపాలి అంటే ఒకటి తనంతట తానే పార్టీకి రాజీనామా చేయాలి. అప్పుడే ఆయన అన్ని సభ్యత్వాలను కొల్పోతారు. కానీ ఆయన పార్టీకి రాజీనామా చేయరు. సో.. ఆయనకై ఆయనే పార్టీని వీడటం అనేది జరగని పని. ఇక రెండవది పార్టీ నిర్ణయాలకు అంటే సభలో పార్టీ విప్ ను ధిక్కరించి ఉన్నట్టయితే ఆయన మీద అనర్హత వేటు వేసే వీలుంది. కానీ అలా జరగలేదు.
లోక్ సభలో ఎలాగూ వైకాపా బీజెపీకి అనుకూలంగానే వ్యవహరిస్తోంది. కేంద్రం బిల్లులన్నింటికీ మద్దతు ఇస్తోంది. ఎలాగూ రాఘురామరాజు భాజాపాకు అనుకూలం కాబట్టి లోక్ సభలో ఆయన వైఖరికి, వైకాపా వైఖరికి సరిగ్గా సరిపోతోంది. కనుక ఆయన మీద విప్ ధిక్కరణ చర్యలు తీసుకునే వీలు లేనే లేదు. ఇక మూడవ పాజిబిలిటీ రాజుగారు స్వచ్చంధంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం. అలా వదులుకుంటే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడు అవుతారు. అంటే రఘురామరాజు రాజీనామా చేయడం మాత్రమే కాదు స్వచ్చంధంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారని స్పీకర్ భావించాలి.
ప్రస్తుతం ఇదే పని మీద ఉంది వైకాపా. ఇప్పటికే పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసే పనిలో ఉన్నారు. స్పీకర్ వద్ద తమ అభియోగాలన్నింటినీ పెట్టి రఘురామరాజు మీద అనర్హత వేటు వేసే పరిస్థితులు కల్పించాలని వైకాపా హైకమాండ్ పథకమట. ఇది జరగాలంటే రాఘురామరాజు ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లేలా పనులు చేసి ఉండాలి. కనుక రఘురామరాజు చర్యలను ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం తగ్గించే చర్యలని స్పీకర్ దగ్గర వైకాపా ప్రూవ్ చేయాలి. అయితే అది కూడా అంత సులభమైన పని కాదు. ఎందుకంటే రఘురామరాజు పార్టీ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసింది లేదు. పార్టీకి తాను విధేయుడిని కాదని ప్రకటించింది లేదు. ఎప్పుడూ తాను సీఎంకు విధేయుడిననే పదే పదే చెబుతున్నారు.
ఆయన చేసిందల్లా పార్టీ నిర్ణయించిన నిర్భంధ ఇంగ్లీష్ విద్య సబబు కాదని అనడం. దానికి కూడా రాజ్యాంగం పరంగా మాతృభాషలో విద్యను అభ్యసించడం ప్రతి ఒక్కరి హక్కని, తాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిని స్వీకరించాను కాబట్టి రాజ్యాంగ బద్దంగానే మాట్లాడతానని, అందుకే నిర్భంధ ఇంగ్లీష్ విద్య అనే పార్టీ నిర్ణయాన్ని విమర్శించానని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఈ అంశం లెవనెత్తితే వైకాపా రాజ్యాంగ విరుద్ద నిర్ణయం తీసుకున్నది కాబట్టే రఘురామరాజు దాన్ని వ్యతిరేకించారనే వాదన తెరపైకి వస్తుంది. ఇక ఇసుకలో అవినీతి జరిగిందని అనడం, ఎల్లో మీడియా ఛానెళ్ళలో ఇంటర్వ్యూలు ఇవ్వడం, పార్టీలో సీఎం చుట్టూ కోటరీ ఉందనడం లాంటివన్నీ పార్టీకి విరుద్దమైన చర్యలని చెప్పేంత బలమైన చర్యలు కావు.
అయినా వాటినే చూపించి రాఘురామరాజును సస్పెండ్ చేయాలని అంకుంటే వెనుక లోక్ సభ స్పీకర్ సహకారం మెండుగా ఉండాలి. ఆయన తన అధికాలన్నింటినీ ప్రయోగిస్తే రఘురామరాజును ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. కానీ అలా జరగడం అసాధ్యం. ఎందుకంటే స్పీకర్ బీజెపీ వ్యక్తి. ఆయన తమ సొంత మనిషిలాంటి రాఘురామరాజు మీద చర్యలకు పూనుకుంటారా అంటే అది జరగని పని. వైకాపా ఈ తరహా వ్యూహానికి పూనుకుంటుందని పసిగట్టే రాఘురామరాజు ఢిల్లీ వెళ్లగానే స్పీకర్ ఓంబిర్లాను కలిసి మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేశారు. సో.. స్పీకర్ ద్వారా ఆయన్ను కట్టడి చేయడమనేది కూడా వైకాపాకు అసాధ్యం. ఈ సాధ్యాసాధ్యాలన్నింటినీ బట్టి వైకాపా నుండి రఘురామరాజును బయటకి సాగనంపడం అంత సులభం కాదని స్పష్టంగా తెలుస్తోంది.