బంగారు కొనేవాళ్లకు శుభవార్త

రెండు వారాల్లో ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్డెట్ లో బంగారు మీద ఇపుడున్న భారీ దిగుమతి సుంకాన్ని సగానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నది.

ఈ నిర్ణయం ఎన్నికల వాసన వేస్తున్నా మంచిదే.

ఇపుడు బంగారు మీద పది శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు. దీనికితోడు మరొక మూడు శాతం జిఎస్ టి కూడా ఉంది. దీని వల్ల చాలా అవాంఛనీయ పరిణామాలు ఎదురువుతూ ఉండటంతో దిగుమతి సుంకాన్ని సగానికి అంటే 5 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తున్నది.

రుపాయి బలహీనంగా ఉండటం,పెట్రోలియం ధరలు విపరీతంగా ఉండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతూ ఉండటంతో బంగారు దిగుమతులను తగ్గించే ఉద్దేశంతో 2013 లో కేంద్రం దిగుమతి సుంకాన్ని మూడు రెట్లు పెంచి పదిశాతం చేసింది.

 అయితే, దీని వల్ల చాలా అనర్థాలువచ్చాయి. సుంకం,పన్నులు ఎక్కువ ఉండటంతో దిగుమతులు తగ్గాయి గాని స్మగ్గింగ్ తీవ్రమయింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెగ్యూలర్ గా, భారీగా స్మగ్లింగ్ బంగారు పట్టుకుంటున్న వార్తలు మనం వింటున్నాం. టాక్స్ ఎక్కువగా ఉండటంతో రిస్క్ ఉన్నాసరే ల బంగారు స్మగ్గింగ్ లాభసాటి అని స్మగ్లర్లు కనిపెట్టేశారు.

2017-18 లో కస్టమ్స్ అధికారులు 3223 కెజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. దీని విలువ రు.974 కోట్లు. అంతకు ముందు సంవత్సరం (1422 కెజీలు, ధర రు. 472 కోట్లు) కంటే ఇది 103 శాతం ఎక్కువ. ఇలా వదిలిస్తే, ప్రభుత్వం ఆదాయానికి గండికొడుతూ బంగారు స్మగ్లింగ్ దారిలో దేశంలోకి ప్రవేశిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది.

 దిగుమతి సుంకం ఎక్కువగా ఉన్నందున బంగారు దిగుమతులయితే  తగ్గాయి, స్మగ్గింగ్ పెరిగినట్లు ప్రభుత్వం దగ్గిర ఉన్న లెక్కలు చెబుతున్నాయి.

2017-18 లో దిగుమతులు 4.48 శాతం తగ్గాయి. ఒక్క డిసెంబర్ లోనే 23.33 శాతం తగ్గాయి. ఇదే సమయంలో ముడిచమురు ధర కూడా తగ్గడంతో కరెంట్ అకౌంట్ డఫిసిట్ మీద వత్తిడి లేదని చెబుతూ బంగారు మీద దిగమతి సుంకం తగ్గించి, కొత్త బంగారు విధానాన్ని ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1 ప్రకటించబోయే తాత్కాలిక బడ్జెట్ దిగుమతి సుంకాన్ని 5 శాతానికి తగ్గించనున్నారని టెలిగ్రాఫ్ ఇండియా రాసింది.

ఇపుడు సుంకం,టాక్స్ లతో బంగారు దిగుమతులు బాగా పడిపోయాయి. 2017 లో 876 టన్నుల బంగారం దిగుమతి అయితే, 2018 లో ఇది 759 టన్నులకు పడిపోయింది. దీనికి తోడు ఈ సారి రుతుపవనాలు బలహీనంగా ఉండి కరువు పరిస్థితులు ఏర్పడటం, కేరళ వంటి కొన్ని ప్రాంతాలలో వరదలు రావడంతో బంగారు కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. దీనితో బంగారు వ్యాపారానికి కొంత ఊతం ఇవ్వాల్సి వస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికలు కూడా సమీపిస్తున్నందున, బంగారు మీద దిగుమతి సుంకం తగ్గిచేందుకు ఇది అనువయిన సమయమని కేంద్రం భావిస్తున్నది.