ఎన్ .టి  రామారావు రాజకీయ ప్రవేశానికి కారణం తెలుసా ?

NTR on Chaitanya Ratham

భారత రాజకీయాల్లో నందమూరి తారక రామారావు గారిది ఓ ఉజ్వల చరిత్ర . మూడున్నర దశాబ్దాల పాటు వెండితెర మీద రారాజుగా వున్న ఎన్ .టి రామారావు 1982లో హఠాత్తుగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఈ ప్రకటన ఓ కుదుపు. అయితే కాకలు తీరిన కాంగ్రెస్ నాయకులు మాత్రం “రామారావు ను డ్రామా రావు గా అభివర్ణించి.. అయన పెట్టిన తెలుగు దేశం పార్టీ నామ రూపాలు లేకుండా పోతుంది. రాజకీయమంటే మేకప్ వేసుకున్నంత తేలిక కాదు” అంటూ తేలిగ్గా మాట్లాడారు. అయితే ఆ తరువాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు.

మే 28 ఈరోజు మహానటుడు , మహోన్నత రాజకీయ నాయకుడు ఎన్ .టి . రామారావు 97వ జయంతి. ఈ సందర్భంగా రామారావు వ్యక్తిత్వం , ప్రారంభ రాజకీయ జీవితం గురించి వివరిస్తాను .రామారావు గారిని ఓ సినిమా జర్నలిస్టుగా సన్నిహితంగా చూసే అవకాశం కలిగింది. 1975లో అక్కినేని నాగేశ్వర రావు అప్పటి ప్రభుత్వం నుంచి  బంజారాహిల్స్ లో 22 ఎకరాలు తీసుకొని అన్నపూర్ణ స్టూడియోస్ ను ఏర్పాటు చేశారు. 1976లో ఎన్ .టి రామారావు గోల్కొండ క్రాస్ రోడ్ లో వున్నా తన  స్వంత  స్థలం లో  రామ కృష్ణ స్టూడియోస్ ను ప్రారంభించారు. బయటి చిత్రాలు మద్రాస్ లోనో , మరో  ప్రాంతంలోనే జరిగేవి. అయితే రామారావు గారి స్వంత సినిమా షూటింగ్ లు మాత్రం  హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోస్లో జరిగేవి అప్పుడు తప్పకుండా నేను జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక  రిపోర్టర్ గా హాజరవుతూ ఉండేవాడిని. సినిమా కవరేజ్  వెళ్ళినప్పుడు తన పక్కనే కుర్చీ వేసి ఆప్యాయంగా మాట్లాడేవారు .షూటింగ్ జరుగుతూ  వుండే సమయలో ఫోటోలు వద్దనేవారు. షాట్ షాట్ మధ్యలో ఆ సినిమా , ముఖ్యంగా ఆ సన్నివేశం వివరిస్తూ ఉండేవారు. ఇక ఆయన స్వంత సినిమా అయితే రామారావు గారు సెట్లో వుంటే ఎవరూ మాటాడే సాహసం చేసేవారు కాదు. షాట్ తరువాత తరువాత షాట్ కోసం కెమెరామన్ ఆయన కుమారుడు మోహన్ కృష్ణ లైటింగ్ ఏర్పాటు చేసుకునేటప్పడు తన పడక కుర్చీలో కూర్చొని కూని రాగాలు తీస్తుంటే ఆయన మూడ్ బాగున్నట్టు. ఆ సమయంలో ఎవరైనా  మాట్లాడటానికి వెళ్లేవారు. ఇక లంచ్  బ్రేక్ కు 15 నిమిషాల ముందు షూటింగ్ ఆపుచేసి మాకు ఫోటోలకు సమయం కేటాయించేవారు. రామారావు గారిని షూటింగ్ సమయంలో నిర్మాతలు దర్శకులు కలవడానికి వచ్చేవారు కాదు.

NTR with Bhageeradha
NTR with the article author Bhageeradha

రామారావు గారి పెద్ద అబ్బాయి జయకృష్ణ ఎప్పుడయినా వచ్చి మాట్లాడి వెళ్లేవారు. షూటింగ్ జరిగేటప్పుడు హరికృష్ణ మాత్రం ఫ్లోర్ బయటే వుండి ప్రొడక్షన్ పనులు చూసుకునేవారు. రామ కృష్ణ స్టూడియోస్ లోకి ప్రవేశించగానే కుడి చేతి వైపు రామారావు గారి కార్యాలయం ఉండేది. క్రింద రిసెప్షన్ , టెలిఫోన్ ఆపరేటర్ , రామారావు గారి కోసం ఎవరైనా వస్తే కూర్చోవడానికి కొన్ని కుర్చీలు ఉండేవి.  రామారావు గారి  గది మొదటి అంతస్తులో ఉండేది . ఆయన కూర్చునే కుర్చీ సింహాసనం లా ఉండేది. దాని వెనుక మౌల్డింగ్ చేసిన పెద్ద పులి ఉండేద.  ఆరు కుర్చీలతో పెద్ద టేబుల్. దాని మీద ఓ టెలిఫోన్ ఉండేది. అయితే ఆ టెలిఫోన్ మ్రోగటం నేను ఎప్పుడూ చూడలేదు.

రామారావు గారిని కలవడానికి ఎవరైనా నిర్మాతలు వస్తే బాయ్ వచ్చి చెప్పేవాడు తప్ప టెలిఫోన్ ఆపరేటర్ ఫోన్ చేసేది కాదు. ఆయన నిర్మాతలు , దర్శకులు కూడా ఫోన్ చేసి మాట్లాడేవారు కాదు స్వయంగా వచ్చేవారు. ఒకసారి నేను ఈ ఫోన్ అలంకారప్రాయంగా ఉండటం గురించి ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసే ప్రసాద్ ను అడిగాను. ముఖ్యమంత్రులు ఎవరైనా మాట్లాడనుకున్నప్పుడు ఆ ఫోన్ నెంబర్ ఇచ్చేవారట. అప్పటివరకు ఆయన తన సినిమాలు , తన థియేటర్ లు పిల్ల గురించి తప్ప మరొకటి పట్టించుకునేవారు కాదు. ఎప్పుడన్నా నాలాంటి జర్నలిస్ట్ కలిసినప్పుడు మాత్రం  “రాజకీయాలు ఎలావున్నాయి బ్రదర్” అని అడిగేవారు. ఆయన ధ్యాస అంతా సినిమా మీద ఉండేది. ఆయన చెయ్యాలనుకునే  సినిమా ల గురించి  స్క్రిప్టులు తయారు చేసుకుంటూ ఉండేవారు.

1980లో దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన “సర్దార్ పాపారాయుడు ” సినిమా షూటింగ్ లో మొదటిసారి రామారావు ద్రుష్టి రాజకీయాలపై మళ్లింది. బహుశ ఆ సినిమా లో ఆయన ధరించిన ప్రభావం కావచ్చు . లేదా అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న టంగుటూరి అంజయ్య పట్ల హై కమాండ్ ప్రవర్తించిన తీరు కావచ్చు. అప్పుడు ఆయన మనసులో రాజకీయం అనే బీజం నాటుకుపోయింది. ఆ తరువాత కొన్ని సినిమా చేసిన తరువాత 1982లో మళ్ళీ దాసరి నారాయణ రావు దర్శకత్వంలో “బొబ్బిలి పులి ” అనే సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ పాత్ర ప్రభావం ఆయన మీద పడింది. అప్పటికె  ఆంధ్రుల ఆత్మ గౌరవం ఢిల్లీలో మంటకలుపుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పు కూడా జరిగిపోయింది.

NTR during his political hustings
NTR having his lunch in the car, during his political hustings

స్వతహాగానే రామారావు గారు ఆవేశపరులు. ఈ సంఘటనలు ఎన్ .టి .ఆర్ లో మరింత ఆజ్యం పోశాయి. అప్పటికి రామారావు గారి వయసు 59 సంవత్సరాలు. బొబ్బిలి పులి సినిమాతో 279 సినిమాలో నటించారు. 24 సినిమాలు స్వంతంగా నిర్మించారు. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడుగా అప్పటికే జేజేలందుకుంటున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు , వారి ప్రవర్త పట్ల విసిగిపోయారు. రాజకీయ శూన్యత  (పొలిటికల్ వాక్యూమ్ ) వచ్చేసింది. సరిగ్గా ఇదే సమయంలో నాదెండ్ల భాస్కర రావు లాంటి సీనియర్ నాయకుడు ఎన్ .టి .రామారావు తో కలిసిపోయాడు. ఇన్నాళ్లు తెర  మీద ప్రజలకు వినోదాన్ని పంచినతాను  ఇక మీదట ప్రజల జీవితాల్లో తానూ ఆశించే మార్పు తీసుకురావాలనుకున్నాడు. అదే తన జీవితానికి అర్థం , పరమార్థం అనుకున్నాడు.

రామారావు ఒక నిర్ణయం తీసుకుంటే అది శిలాశాసనమే.  రామారావు కు  తన ప్రజలకు మెరుగైన జీవితం ,  దారిద్ర రేఖ కు దిగువున వున్న వారి జీవితాల్లో మార్పు తీసుకు రావాలనుకున్నాడు . తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు . అదే తెలుగు దేశం అనే ప్రాంతీయ పార్టీ ఆవిర్భావానికి దారితీసింది . 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీ ని ప్రారంభించాడు . 9 నెలలపాటు చైతన్య రథంపై ఆంధ్ర దేశమంతా సుడిగాలి పర్యటన చేశాడు . తెలుగు ప్రజలను జాగృతం చేశాడు . సంఘటితం చేశాడు . ఆయన కష్టం ఫలించింది. ఆయన ఆశయం సిద్దించింది. ఆ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం విజయం సాధించింది. 289 సీట్లకు పోటీ చేస్తే 201 సీట్లలో విజయం  సాధించాడు. 1983 జనవరి 9న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పదవీ ప్రమాణం చేశారు.

NTR as Chief Minister in his office
NTR as Chief Minister in his office

– భగీరథ