ఈ మూడు జిల్లాలు జగన్‌ను భయపెట్టేస్తున్నాయి.. అందుకే వద్దంటున్నారా ?

 YS Jagan's plan goes wrong 
వైఎస్ జగన్ పంచాయతీ ఎన్నికల విషయంలో అంత మొండిపట్టు పట్టడానికి కారణం ఏమై ఉంటుందనేది చాలామంది ప్రశ్న.  151 సీట్లతో అధికారం దక్కించుకున్న జగన్ ఏమిటి, ఈ పంచాయతీ ఎలక్షన్లకు వెనకడుగు వేయడం ఏమిటని అంతా ఆశ్చర్యపోయారు.  హైకోర్టు, సుప్రీం కోర్టు అంటూ అడ్డుకోవడానికి అన్ని గడపలు తొక్కేసి చివరకు ఎన్నికలు నిర్వహించాల్సిందే అనే సుప్రీం కోర్టు తీర్పుకు తలొగ్గాల్సి వచ్చింది.  ఈ క్రమంలో ప్రభుత్వం ఎన్నో భంగపట్లకు గురైంది.  రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరిస్తున్నారనే అపవాదును మూటగట్టుకుంది.  కేవలం పంతమే అయితే ఇంత దూరం వెళ్లారు.  దీని వెనుక ఏదో బలమైన కారణమే ఉందని చెప్పుకుంటున్నారు.  
 
YS Jagan to face problems from Guntur, Krishna
ఆ కారణం మరేమిటి కాదని అమరావతియేనని తేల్చి పారేస్తున్నారు కొందరు.  అమరావతిని కాదని జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఆ పార్టీ పట్ల జనంలో సుముఖతను పెంచిందో లేదో తెలియదు కానీ మూడు ప్రాంతాల్లో మాత్రం వ్యతిరేకతను లేవదీసింది.  ప్రధానంగా  కృష్ణా,గుంటూరు జిల్లాల్లో అమరావతి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.  రైతులు ఏడాది కాలంపైనే దీక్షలు చేస్తున్నా పట్టించుకోవట్లేదు ప్రభుత్వం.  ఇక మీదట పట్టించుకుంటుందనే నమ్మకం కూడ లేదు.  జనంలో అసలు అమరావతి సెంటిమెంట్ లేదనేది ప్రభుత్వం వాదన.  అదే నిజమైతే మూడు రాజధానుల కోసం కూడ ప్రజలు విపరీతమైన మక్కువతో కాలేరనేది కూడ నిజం.  ప్రధాన రాజధాని కానున్న విశాఖ జిల్లాలోని ప్రజలనే తీసుకుంటే ఇప్పటికే వైజాగ్ అభివృద్ధి చెందిన ప్రాంతం, ఇక్కడ రాజధాని పెట్టడం వలన కొత్తగా జరిగే డెవెలప్మెంట్ ఏదీ ఉండదని అంటున్నారు. 
 
రాయలసీమ వాసుల్లో అయితే హైకోర్టును పెట్టడం మూలాన రాజధానిగా పిలిపించుకోవాలనే ఆశ తీరుందే తప్ప ఈ కరువు కాటకాలు పోతాయా కావాల్సింది  ప్రాజెక్టులు అనేవారు లేకపోలేదు.  ఇక అమరావతి సెంటిమెంట్ అనేది రాష్ట్రవ్యాప్తంగా లేకపోవచ్చు కానీ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా కొంతమేర ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కనబడుతోంది.  ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు ఇక్కడ ఉన్నారు.  వీరంతా పంచాయతీ ఎన్నికలో వైసీపీకి గట్టిగా కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నారు. వీరిని చూసుకునే చంద్రబాబు పంచాయతీ ఎన్నికలు పెడితే తమదే పైచేయి అనుకుంటున్నారు.  జగన్ సైతం ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు అంటే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నష్టపోక తప్పదని అంచనా వేస్తున్నారట.  అందుకే ఎన్నికలను నిలువరించాలని అనుకున్నారట.