కాంగ్రెస్-టిడిపి పొత్తంటే కెసియార్ బెదిరిపోతున్నారా?

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిజామాబాద్ ఉపన్యాసం పైకి ఫుల్ తిట్లు శాపనార్థాలతో బాగా హుశారుగా సాగినా లోలోపుల  అంత ధీమా ఉన్నట్లనిపించదు. ఇందులో చాలా మీనింగ్ దాక్కుని ఉంది.

ఒక విధంగా ఇది అసాధారణ ఉపన్యాసం. పైకి ఆయన తెలంగాణ కాంగ్రెస్ ను, తెలుగుదేశం పార్టీని ఏకిపారేశాననుకోవచ్చు. ఏమితిట్టాడురా అని  భజన బృందం చప్పట్లు ఈలలు కొట్టి ఉండవచ్చు.  కాంగ్రెస్ చీల్చి చెండాడిన ముఖ్యమంత్రి అని  ప్రభుత్వం ప్రకటనల నుంచి కోట్లు దండుకుంటున్న పత్రికలు రాసి ఉండవచ్చు.

అయినా సరే ముఖ్యమంత్రి ప్రసంగంలో దాక్కుని ఉన్న అర్థం… చదువుకున్నోళ్లకంటే చదువు రానోళ్లకే బాగా అర్థమయింది. నిన్న ఆయన తాను నాలుగున్నరేళ్లలో చేసింది చెప్పడం కన్నా, మరొక సారి ప్రభుత్వం వస్తే చేసేదేమిటో చెప్పడం కన్నా, కాంగ్రెస్, టిడిపి లనువిడివిడిగా కొద్ది సేపు, కలిపి కొద్దిసేపు దమ్ము రేగ్గొట్టారు.

ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలలో ఏకాభిప్రాయం ఉంది. తిట్టడంలో… అదే కోపంతోనో, బాధతోనో, తిట్టడడం మొదలుపెడితే, ఆయన్నిమించినోడు మరొక లేడు. ఈ గుర్తింపు వచ్చేసింది. అయితే,ఎవరికయినా సరే తిట్లు వూరికే రావు. ఏదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్లు కంటెంట్ వీకయితేనే పబ్లిసిటీ ఫీక్ లో ఉంటుంది. పబ్లిసిటీయేకాదు, తిట్లుకూడ పీక్ లో ఉంటాయి. అందుకే తిట్టు వెనక మీనింగ్ ఉండితీరాలి.

   ముఖ్యమంత్రి  నిన్నతిట్టిన తిట్లలో దాక్కున్న విషయాన్ని బయటకు చెప్పుకోవలసిందే. ఉద్యమనేతగా పేరున్న చంద్రశేఖర్ రావు, నాలుగన్నరేళ్లు పరిపాలించి, బ్రహ్మాండమయిన అనేక కార్యక్రమాలు, పథకాలు ప్రారంభించి, ప్రాజక్టు కట్టి… ఎన్నికలకు వెళ్లుతన్నపుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరినీ తిట్టాల్సిన అవసరం లేదు.  శత్రువు కుంటివాడు, ఆయుధం పట్టడం  కూడా తేలేని వాడు అని తెలిసినపుడు సైనికుడు యుధ్దానికి ఎలా వెళ్తాడు. ఆ గెలుపు ధీమా నిన్న నిజామాబాద్ ప్రసంగంలో కనిపించలేదు. ఆయన ప్రసంగంలో బెదురు కనిపిపించింది. అంతరించి పోతున్న ఆంధ్రా పార్టీ, ప్రజల తిరస్క్రుతికి గురయిన కాంగ్రెస్ పార్టీ కలిస్తేఏముంది, కలవకపోతే ఏముంది, నా బంగారు తెలంగాణ నన్ను కాపాడుతుందని ధైర్యంగా ముందుకు సాగుతున్న ధీమా నిన్నినిజామాబాద్ సభ ప్రసంగంలో కనిపించలేదు. నాలుగేళ్ల పాటు ఏటా లక్ష కోట్ల నిధులు వెచ్చింపు, సర్వేలు చేయించి, లొసుగులన్నీ పూడ్చి, గవర్నమెంట్ మిషినరీ అండ, తెలంగాణ నిండా టివిలు, పత్రికల సపోర్టుతో… పరిపాలించిన మహానేతకు ఉండాల్సిన దర్పం నిన్నకెసిఆర్ లో కనిపించలేదు. తిట్టే ఆయుధం అయింది. తిట్టకు చప్పట్లు కొట్టినప్పుడల్లా ఆయన తిట్టడం ఎక్కువ చేశారు. ఇలాంటిది సినిమా హీరో ల సమావేశాలలో ఉంటాయి. వాళ్లు ప్రసంగం వినకుండా తమకు నచ్చిన మాట వినపడినప్పుడల్లా చప్పట్లు కొడుతూ ఉంటారు. అలాగే జరిగింది. 

ఇపుడు న్న దేశ రాజకీయనేతలలో విశిష్టమయిన వ్యక్తి కెసియార్. ఈ మూడక్షరాలకు చాలా మంత్ర శక్తి ఉంది. అది రుజువయింది కూడా. దేశంలోనేతలందరిలో ఆయన స్థానం యూనిక్. ఆయన అంటే దేశమంతా ప్రజాస్వామిక వాదులు ఇష్టపడతారు. ఎందుకంటే, ఆయన తెలంగాణ నినాదానికి 30 సంవత్సరాల తర్వాత వూపిరిపోసి, పెంచి, పెద్ద చేసి, ఫలాలందించేస్తాయికి తీసుకువచ్చారు. ఏవరే మన్నా దీనికి తిరుగులేదు. ఇలాంటి వ్యక్తి తెలంగాణను నాలుగున్నర సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఒక చిన్నఅవకాశవాద (రాజకీయాలంటేనే అవకాశ వాదం) అలయన్స్ నుచూసి జడిసి పోవడమేమిటి. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని, కాంగ్రెస్ పార్టీ అనరాని మాటలనడం ఏమిటి? హిమాలయసమున్నతమయిన ఆయన పర్సనాలిటి వ్యక్తిత్వం ఒక్కసారి కుంచించకుపోయి భూమ్మిద మరుగుజ్జుగా నిలబడిపోయింది. ఆశ్చర్యం. ఒక అలయన్స్ గురించి ఇంతసేపు మాట్లాడటమా? ఈ అపవిత్ర అలయన్స్ మీద ప్రజలలో వ్యతరేకత వచ్చేందుకు ఇలా ఒక వ్యూహం ప్రకారం ఆయన ప్రసంగిస్తున్నారా?

దీనికి కారణమేమయి ఉంటుంది? తెలుగుదేశం కాంగ్రెస్ చేతులు కలుపుతూనే అంత మహాశక్తి గా మారాయా. మారుతున్నాయని ఆయన భయపడుతున్నారా? రాజకీయాలను రంగురుచివాసనను ఆయన చాలా దూరాన్నుంచి కూడా పసిగట్ట గల నేర్పరిగా ఆయనకు పేరుంది. అందువల్ల ఆయన నిజంగానే ప్రమాదం పసిగడుతున్నారా? కాంగ్రెస్ – తెలుగుదేశం కలిస్తే ఆయనకు వచ్చిన నష్టం ఏమిటి? అదంత పనికిమాలిన, రాష్ట్ర ద్రోహ కలయిక అయితే, టిఆర్ ఎస్ కు మంచిది కదా. దానిని ప్రజలు తిరస్కరిస్తారు, టిఆర్ ఎస్ అఖండ విజయం సాధిస్తుంది. అలాంటపు తెలంగాణ ద్రోహితో కాంగ్రెస్ చేతులు కలిపితే సంతోషంతో ఎగిరిగంతేయాలిగాని, ‘మీరు కలిస్తే నేనొప్పుకోను, మీరు కలిసి నా కొంపముంచాలనుకుంటున్నారా,’ అనే అర్థం వచ్చేలా అంత భారీ బహిరంగసభలో అంతగా ఆ అలయన్స్ ను అడిపోసుకోవడం ఏమిటి?

నిజామాబాద్ లో ఆయన ఉపన్యాసం పూర్తయినప్పటినుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకు వరకు తెలుగు రాజ్యం ఒక క్విక్ సర్వే 45 మందితో నిర్వహించింది. ఈ సర్వేలో మాతో మాట్లాడిన వారిలో 60 (27) శాతం మంది చంద్రశేఖర్రావు కాంగ్రెస్-టిడిపి పొత్తుతో భయపడుతున్నారనే అన్నారు. మిగతా వారిలో కొందరు (6) ఉపన్యాసం వినలేదు. మరికొందరు (12) ఆయనతో ఏకీభవించి, కాంగ్రెస్ టిడిపిపొత్తు ఎలా పెట్టుకుంటాయి, అది తప్పు అని అన్నారు. 45 మందిలో కొందరిని టెలిఫోన్ ద్వారా సంప్రదిస్తే, మిగతావారిని రోడ్డు మీద వాకబు చేశారు. మొత్తం 71 మందిని సంప్రదిస్తే స్పందించింది 45 మంది మాత్రమే. మిగతావారు టైం లేదు, అర్జంటుగా వెళ్లున్నామనో, మాకు అవసరం లేదనో, మాకేమీ తెలియదనో చెప్పారు.

ఎందుకు కెసియార్ కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు గురించి భయపడుతున్నారు. వారసత్వ సమస్య. ఎపుడు దేశంలో చాలా రాష్ట్రాలలో లీడర్లకు వారసత్వం నిలుపుకోవడం సవాల్ గా మారింది. తండ్రులకు వయసయిపోతున్నది, లేదా ఆనారోగ్యం. కొడుకులను లేదా కూతుళ్లను లేదా ఇద్దరికి రాజ్యం అప్పగించి తాము ప్రశాంతంగా రాష్ట్రపతిగానో, కేంద్రమంత్రిగానో సెటిలయిన వానప్రస్తం ఢిల్లీలో గడపాలనుకుంటున్నారు. అందువల్ల ఇలాంటి ముఖ్యమంత్రులందరికి 2019 ఎన్నిక కీలకమయింది. ఈ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయితే, ఇదొక అసంపూర్ణ ప్రాజక్టవుతుంది. ఆ తర్వాత ఎపుడు పూర్తవుతుందోచెప్పలేం.రాజకీయాలు కక్షలు కార్పణ్యాలతో నడుస్తున్నాయి. సిబిఐ కేసులు, ఐటి దాడులు, ఇడి విచారణలు… వీటిని ప్రయోగించడం మామూలయింది. ఇందులో నేతలు ఇరక్కుపోతున్నారు. అందువల్ల వారసుడికి రాజ్యం అప్పగించే ప్రాజక్టు అగిపోతుందనే భయం ఈ కాలపు ముఖ్యమంత్రులలో చాలా మందిలో కనిపిస్తుంది.

దానికి తోడు, అంతా అనుకున్నట్లు తెలంగాణలో తెలుగుదేశం చచ్చిపోలేదు. తెలుగుదేశం పార్టీ ఎంత కమ్మ పార్టీ అయినా, దానిపుట్టుకలో ఒక బిసి సానుకూలత జీన్ ఉంది. ఆరోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నత కులాలతోఒక వైపు ఎస్ సి మైనారిటీలతో ఇంకొక  వైపు మద్దతు కూడగట్టి అధికారంలోకి వస్తూ ఉండింది. అందుకే కాంగ్రెస్ ను పార్టీ ఎక్స్ ట్రీమ్స్ (Party of extremes) అని పాల్ ఆర్ బ్రాస్ వంటి రాజనీతి పండితులు చెబుతూ వచ్చారు. కాంగ్రెస్ ఎపుడూ బ్రాహ్మణులు- ఎస్ సిల మధ్య ఉన్న కులాలు (బిసి) లను పట్టించుకోనేలేదు. తెలుగుదేశం పార్టీ ఈ కులాలనుటార్గెట్ చేసుకుంది. ఈ విషయాన్ని జస్టిస్ శ్రీక్రిష్ణ కమిషన్ నివేదికలో కూడా పేర్కొన్నారు. తెలంగాణలో తెలుగుదేశం బలం అదే అన్నారు. ఎన్టీరామారావు ప్రయోగం విజయవంతమయింది.

2014లో తెలంగాణ వేవ్ లో తెలుగుదేశం పార్టీకి 15 సీట్లొచ్చాయంటే కారణం ఎవరు? పాల్ ఆర్ బ్రాస్ చెప్పిన ఈ మధ్య కులాల వోటర్లే. వాళ్లకు కెసిఆర్ కు వ్యతిరేకం, కాంగ్రెస్ కు వ్యతిరేకం. వాళ్లు కమ్మ పార్టీ అయినా తెలుగుదేశం మద్దతుదారులే. తెలుగుదేశం పార్టీ టిఆర్ ఎస్ తో పొత్తు పట్టుకుంటుందన్న వార్తలొచ్చినపుడు టిడిపిలో వచ్చిన చిన్న పాటి అలజడికి కారణం వారే. ఆ మధ్య తెలుగుదేశం పార్టీ, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించినపుడు విజయవంతం చేసిందీ వారే. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇంకా అంతరించిపోలేదు. అంతేకాదు, కాంగ్రెస్ తో పొత్తుతో బలపడే అవకాశం ఉంది. ఈ యాంటి- కెసిఆర్ బిసి వోట్లు… ఒక వేళ ఉంటే గింటే.. రేపు పొత్తుతో కాంగ్రెస్ వైపు వెళితే ఎలా అనే బెంగ కేసియార్ లో ఉండవచ్చు. టిడిపికి బిసి వోట్లున్నాయని కాంగ్రెస్ మనసారా నమ్ముతూ ఉంది.అందుకే టిడిపితో పొత్తు పెట్టుకుంటుంది. ఆ పార్టీ తెలంగాణ జనసేనతో కలవడం కంటే తెలుగుదేశంతో కలవడం ముఖ్యమనుకుంటూ ఉందంటే, తెలుగుదేశం పునాది ఇంకా బలంగా ఉన్నట్లే గా.

ఈ భయంతోనే కెసియార్ నిన్న నిజామాబాద్ సభలో ఆ విధంగా ఒక ‘అవకాశ వాద రాజకీయ పొత్తు’ గురించి అంతసేపు, అంత శక్తి ధారపోసి, అంత భాష ప్రయోగించి  ప్రసంగించాల్సి వచ్చింది. 

తెలుగుదేశం టిఆర్ ఎస్ వ్యవహారం చూస్తే ఒక విషయం నిజమనిపిస్తుంది: కెసియార్ అంటే చంద్రబాబుకు ఎంత భయమో, చంద్రబాబు ను చూసిన కెసియార్ అంత భయపడుతున్నారని పిస్తుంది.

తెలుగుదేశానికి తెలంగాణలో ఉన్న బలమెంత నిజమో ఎన్నికలయ్యే దాకా తెలియదు. అయినా సరే, తెలంగాణ లో అధికారంలోకి వచ్చేందుకు తెలుగుదేశం సహకారం అవసరమని కాంగ్రెస్ భావిస్తున్నది. అదే విధంగా ఈ అలయెన్స్ లో ఏదో నెగెటివ్ ఫోర్స్ ఉందని తెలంగాణ రాష్ట్రసమితి ఆందోళన చెందుతూ ఉంది. ఈ బెదురు నిజామాబాద్ కెసియార్ ప్రసంగంలో పుష్కలంగా కనిపిస్తుంది.