భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అపర చాణక్యుడన్నారు. అయన కాలుమోపిన నేల మీద కమలం వికసిస్తుందని, కాంగ్రెస్ పతనం తప్పదని అన్నారు. ఎన్నికల పండితులు,రాజకీయ విశ్లేషకులు, టివి యాంకర్లు, పోల్ సర్వేరాయళ్లు ఒకరేమిటి అంతా అమిత్ షాను మోదీ వెనక ఉన్నఅదృశ్యశక్తి అన్నారు. అందుకే అమిత్ షా రాష్ట్ర పర్యటనలకొస్తే చాలు తమ పార్టీ పవర్ లోకి వస్తుందని బిజెపి నేతలుకూడా ఆశిస్తారు. అమిత్ షా రాష్ట్ర పర్యటన కొస్తే ప్రధాని పర్యటనకు ధీటుగా కాన్వాయ్ ఉంటుంది. ఏర్పాట్లు ఉంటాయి. అయితే, ఇలాంటి అమిత్ షా ఈ మధ్య ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాలలో చతికలపడ్డారు. మూడు చోట్ల ఆయన వ్యూహం ఫలించక బిజెపి అధికారం కోల్పోయింది. మిజోరాంలో బిజెపినెవరూ ఖాతరు చేయలేదు. అంతే దారుణమయిన పరిస్థితి తెలంగాణలో కూడా ఉంది. అక్కడ గెల్చుకుంది రెండంటే రెండే సీట్లు. షా , మోదీ ల హూంకరింపులకు ఇది గిట్టుబాటు కాదు. పుండు మీద కారం చల్లినట్లు బిజెపి కోటల్లో కాంగ్రెస్ జండా ఎగరేసింది.
అమిత్ షా కు ఏమయింది?
నాలుగున్నరేళ్ల లో భారతీయ జనతా పార్టీ కమలాన్ని వూహించని బీడు భూముల్లో వికసింపి చేసిన అమిత్ షా ఒక్కటర్మ్ లోనే ఇలా కుప్పకూలి పోవడమేమిటి? ఆయన శక్తులు, యుక్తులు, కుయుక్తులు ఏమయ్యాయి? ఈ అయిదు రాష్ట్రాలలో బిజెపి అభాసు పాలవడమే కాదు, కాంగ్రెస్ ను పుంజుకునేలా చేసిన శక్తులెవరు? వాళ్లు అమిత్ షాను ఎందుకు వదిలేశారు? అనేవి ఇపుడొస్తున్న ప్రశ్నలు.
ఇక చాలు, మోదీని మార్చండి ప్లీజ్ అంటున్న బిజెపి నేత, ఎవరాయన … చదవండి
2014లో మోదీని కేంద్రంలో గెలిపించి ప్రధానిని చేశాకే అమిత్ షా జాతీయ వార్త అయ్యారు. అంతకు ముందు ఎవరో కొందరికి, అందునా బిజెపి వార్తలు జాగ్రత్తగా గమనిస్తున్న వారికి, తప్ప అమిత్ షా పేరు తెలియదు. మోదీ అఖండ విజయంతో అంతా అమిత్ షా వైపు కన్నెత్తి చూ శారు. అ మిత్ షా మామూలోడు కాదు, ఎన్నికల మాంత్రికుడన్నారు. ఎన్ డిఎ పేరుతో అనేక ప్రాంతీయ పార్టీల సహకారంతో కుంటుతూ నడుస్తున్న బిజెపిని సొంతకాళ్ల మీద నిలబెట్టే లా చేయడంతో అమిత్ షాను చూసి ఔరా అనుకున్నారు. దానికి తోడు ఆయన అనేక రాష్ట్రాలలో బిజెపిని గెలిపించి వోటర్ల మర్మం తెలిసిన మాంత్రికుడని నిరూపించుకున్నారు. ఎప్పటినుంచో కమ్యూనిస్టుల కంచుకోటలా ఉన్న త్రిపురలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుచేశారు. 14 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న బిజెపిని ఉత్తర ప్రదేశ్ లో రూలింగ్ లోకితెచ్చారు. హర్యానాలో పార్టీ ని గెలిపించారు. శివసేన మద్దతు లేకుండా మహారాష్ట్రలో బిజెపిని గెలిపించారు. ఇవి అల్లాటప్ప విజయాలు కాదు. వీటన్నింటిలో ముందు మోదీ ఫ్లెక్స్ బోర్డు వెనక అమిత్ యుద్ధతంత్రం ఉన్నాయి.
ఈ వరస విజయాలతో అమిత్ షా కూడా బాగా రెచ్చిపోయి మాట్లాడారు. వచ్చే 50 యేళ్లు బిజెపి ప్రభుత్వం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ బారెడు దూరంలో ఉందన్నారు. బిజెపి విజయ పరంపరలో ఇది నిజమేనని అంతా భావించారు. ఎంత గట్టిగా అమిత్ షా నాయకత్వాన్నిప్రశంసించారో, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీష్ గడ్ , మిజోరాం, తెలంగాణలలో బిజెపి పరాజయంతో అంతే గట్టిగా అమిత్ షా టైం అయిపోయిందా అని అనుమానిస్తున్నారు. అమిత్ షా ఎత్తులకు కాంగ్రెస్ పై ఎత్తులు నేర్చుకుందా అని కూడా ఆశ్చర్యపోతున్నారు.
అమిత్ ప్రోగ్రెస్ రిపోర్టు నొక సారి చూద్దాం:
అమిత్ షా నాయకత్వంలో భారతీయ జనతాపార్టీ జమ్ము కాశ్మీర్, ఝార్ఖండ్, అస్సాం, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోడా, మణిఫూర్, హిమాచల్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలలో ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
అయితే అమిత్ షా యుద్ధతంత్రాలు సర్వకాల సర్వావస్థలలో పనిచేసే సంజీవని కాదని, దానికీ కాలం చెల్లుతుందని చెప్పేందుకు చాలా దృష్టాంతాలున్నాయి. నిజానికి అమిత్ షాక ఫ్లాప్ షోలు చాలా కాలం కిందటే మొదలయ్యాయి. ఉదాహరణకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆయనకు భయంకరమయిన ఫ్లాఫ్ షో. బిజెపి జైత్రయాత్రకు ఢిల్లీ బ్రేక్ వేసిన వాడు అరవింద్ కేజ్రీవాల్. కాంగ్రెస్ చేయలేని పనిని ఆమ్ అద్మీ పార్టీ చేసింది. 70 సీట్లున్న అసెంబ్లీలో బిజెపికి వచ్చింది మూడంటే మూడే సీట్లు. తర్వాత రెండో దెబ్బ బీహార్ లో తగిలింది. అక్కడ నితిష్ కుమార్ నాయకత్వంలోని మహాకూటమి బిజెపిని చావు దెబ్బతీసింది. 2015లో జరిగిన బీహార్ ఎన్నికల్లో బిజెపి సంఖ్యా బలం అంతకు (2010లో) ముందు ఉన్న 91 నుంచి 53 సీట్లుకు పడిపోయింది. బీహార్ కూటమి విజయవంతమయితే సంతోషించేది పాకిస్తోనోళ్లే అని అమిత్ ఫా ఎగతాళి చేసినా బిజెపికే నష్టమే జరిగిందనాలి. ఎందుకంటే, ఆయన మాట ఖాతరు చేయకుండా బీహారీయులు నితిష్ కూటమికే పట్టం కట్టారు.
మూడోె పరీక్షఆయనకు గుజరాత్ లో నే ఎదురయింది. బిజెపి చాణుక్యుడు కాంగ్రెస్ చాణక్యుడు అహ్మద్ పటేల్ నురాజ్యసభ ఎన్నికల్లో ఓడించాలనుకున్నారు. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు. అందుకే అహ్మద్ పటేల్ ను ఓడిస్తే సోనియా ను ఓడించినట్లే నని బిజెపి అనుకుంది. షా పాచిక పారలేదు. అహ్మద్ పటేల్ గెల్చాడు.
తర్వాత గుజరాత్ ఎన్నికలొచ్చాయి. నిజానికి మోదీ ని రాజకీయ యోధుడిగా మార్చిన భూమి అది. గుజరాత్ బిడ్డ ప్రధానిగా ఢిల్లీ వెళ్లినపుడు ఆయన కానుకగా గుజరాత్ ను బిజెపికి అందివ్వాలి. గుజరాత్ ప్రజలు బిజెపిని గెలిపించారు గాని, బాాగా అవమానించారు.182 సీట్లున్న అసెంబ్లీలో బిజెపి పవర్ లోకి వచ్చినా సెంచురీ కొట్ట లేకపోయింది. బిజెపి 99 దగ్గిర ఆలవుట్ అయింది.
ఆ తర్వాత పరాజయం కర్నాటకలో ఎదురయింది. మోదీ కరిష్మా, అమిత్ షా యుద్దతంత్రం ఏవీ బిజెపిని పవర్ లోకి తీసుకురాలేకపోయాయి. అక్కడ కాంగ్రెస్ తెలివిగా జెడి ఎస్ తో చేతులకలిపి బిజెపి పక్కకు నెట్టేసింది. 224 సీట్లున్న అసెంబ్లీలో 104 సీట్లు గెల్చుకుని బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించినా కాంగ్రెస్ చాణక్యం అధికారం బిజెపి చేతుల్లోకి పోకుండా చేసింది. ఇది అమిత్ షా చాణక్యానికి ఎదురయిన పెద్ద సవాల్.
ఈ అయిదు రాష్ట్రాలో ఓటమి బిజెపి పరాజయాల పరంపరలో భాగమే అనిపిస్తుంది. ముందు ముందు ఇది కొనసాగుతుందేమోననికూడా అనిపిస్తుంది. అయితే, బిజెపి నేతలు చెబుతున్నట్లు ఒక్క మాట నిజం. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీష్ గడ్, మిజోరాం లలో పార్టీ వోడిపోవడంతో కథ ముగియలేదు… నిజమే ముగియలేదు. అసలు పరీక్ష 2019లో ఉంది. అప్పటికాదా అమిత్ షా చాణక్య నీతికి కాలం చెల్లిందనలేం. (బ్యానర్ ఫోటో twitter నుంచి)