బిసి హస్టళ్లలో అక్రమాలు జరుగుతున్న కూడా పట్టించుకునే వారే లేరని విద్యార్దులు ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని వనస్థలిపురం బిసి వెల్ఫేర్ హాస్టల్ లో సోమవారం తెల్లవారు జామున అందులో కుక్ గా పని చేసే వ్యక్తే అక్రమంగ సరుకులు ఎత్తుకెళుతుండగా విద్యార్దులు పట్టుకున్నారు. అతనిని ప్రశ్నించగా అక్కడి నుంచి పారిపోయాడు. అసలు వివరాలు ఏంటంటే…
వనస్థలిపురంలోని ఎంవీ రెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో బిసి హాస్టల్ బాయ్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో హాస్టల్ లో కుక్ గా పని చేసే భద్రం హాస్టల్ రూంలో ఉండే పని మనిషి రూంకి బేడం వేశాడు. భద్రం స్టోర్ రూంలోకి వెళ్లి వంట సాఃమాను, ఇతర సామాను అంతా సంచిలో నింపుకొని బయటికి వెళుతుండగా అప్పుడే నిద్రలేచిన విద్యార్దులు భద్రంను ఆపి ఎవరు అని ప్రశ్నించారు. ముసుగులో ఉన్న భద్రంను చూసే సరికి వారు షాకయ్యారు.

ఈ లోపు రూంలో ఉన్న మహిళ బయట బేడం ఉండడంతో అరిచింది. దీంతో అలర్ట్ అయిన విద్యార్దులు తలుపు తీశారు. ఎవరు చూడకుండా భద్రం దొంగతనంగా సామాన్లు ఎత్తుకుపోతున్నట్టు గుర్తించారు. ఈ ఘటన పై విద్యార్దులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం వచ్చిన సరుకులను దొంగతనం చేయడం పై వారు ఆయనను నిలదీశారు. ఇలా ఇంకా ఎంత దోపిడి జరుగుతుందో అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రం పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోలేదన్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని ప్రభుత్వ హాస్టళ్లలో జరుగుతున్న దోపిడిని అడ్డుకోవాలన్నారు.
హాస్టల్ లో జరిగిన ఘటన పై ప్రత్యక్ష సాకిగా ఉన్న విద్యార్ది ఏమన్నారంటే
“మేము ఉదయం నాలుగు గంటల సమయంలో నిద్ర లేచాం. ప్రిపరేషన్ లో ఉండడంతో ముఖం కడుకుందామని కిందికి వచ్చాం. అంతలోనే ఓ వ్యక్తి ముసుగు కప్పుకొని సంచుల్లో ఏమో తీసుకుపోతున్నాడు. ముందుగా మేం అతడు దొంగ అనుకొని భయపడ్డాం. కానీ అంతలోనే తేరుకొని ధైర్యంతో అతని వద్దకు వెళ్లి ఆపాం. తీరా చూస్తే అతను మా హాస్టల్ లో పని చేసే కుక్ భద్రం. ఆయన సంచులల్లో ఏముందో చూస్తే అంతా కూడా హాస్టల్ సామాను. ఇదేంటని ప్రశ్నిస్తే ఈ ఒక్కసారి వదిలేయండి. మళ్లీ తప్పు చేయనని వేడుకున్నాడు.”
బిసి హాస్టల్ విద్యార్ది, ప్రత్యక్ష సాక్షి, వనస్థలిపురం
విద్యార్ధి సంఘాల నాయకుల ఆగ్రహం
బిసి హాస్టల్ లో జరిగిన సంఘటన పై విద్యార్ధి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గొప్పలు చెబుతుంది తప్పా విద్యార్దులకు చేసిందేం లేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లలో ఇంకా ఎంత దోపిడి జరుగుతుందో అని అన్నింటి పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. పారదర్శకంగా బయోమెట్రిక్ సిస్టం అమలు చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ ఐ రాష్ట్ర నాయకులు జావీద్, జగదీష్, మహేష్, నర్సింహ్మరెడ్డి తదితర నాయకులు ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.