రాజధాని గ్రామాల్లో ఒక్కసారిగా హై టెన్షన్ మొదలైంది. అసైన్డ్ భూముల రైతులకు కూడా పట్టా భూముల రైతులకు ఇచ్చినట్లే ప్యాకేజీ ఇవ్వాలంటూ కౌలు రైతులు ఒక్కసారిగా అసెంబ్లీని చుట్టుముట్టాలని ప్రయత్నించటంతో టెన్షన్ మొదలైంది. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబునాయుడు 27 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే రాజధానిగా ప్రకటించారో వెంటనే ఆ ప్రాంతంలోని రైతుల సాగుభూములను తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నిర్మాణం అనే సెంటిమెంటును ముందుకు తెచ్చి వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించింది.అయితే కొందరు రైతులు మాత్రం ఇవ్వలేదు. వారి భూముల సేమీకరణ కోసం ప్రభుత్వం అవస్తలు పడుతోందనుకోండి అది వేరే సంగతి.
రాజధాని నిర్మాణానికి భూములను ఇచ్చిన రైతులకు నెలకింత పరిహారమంటు ప్రభుత్వం లెక్క కట్టింది. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే భూములు తీసేసుకున్నా ఇంత వరకూ అందరికీ పరిహారమైతే అందటం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, ఇక్కడ విషయం ఏమిటంటే, భూములిచ్చిన రైతులందరూ సొంతదారులనే హక్కుతో పరిహారం అందుకోవటానికి అర్హత సంపాదించారు. కానీ నిజానికి ఆ భూములను సాగు చేస్తున్నది కౌలు రైతులే. ఒక్కసారిగా భూములు కోల్పోవటంతో తమకు కూడా పరిహారం అందించాలంటూ కౌలు రైతులు కూడా ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై చంద్రబాబు, మంత్రి నారాయణ తదితరులను ఎవరిని కలిసినా ఉపయోగం కనబడలేదు.
ప్రస్తుతం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి కదా ? ఆ అవకాశాన్ని ఉపయోగొంచుకోవాలని రైతులు నిర్ణయించారు. తమకు నెలకు రూ. 9 వేల పించన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అందుకనే ఇపుడు ఆందోళనకు పిలుపిచ్చి అసైన్డ్ రైతులు, కౌలు రైతులు అసెంబ్లీ ముట్టడి మొదలుపెట్టారు. దాంతో పోలీసులు అప్రమత్తమై అసెంబ్లీ చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆందోళన చేస్తున్న రైతులను, రైతు సంఘాల నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. కాకపోతే అరెస్టు చేసిన రైతులను, నేతలను ఏ పోలీసుస్టేషన్లలో పెట్టింది కూడా చెప్పటం లేదు. దాంతో అసైన్డ్, కౌలు రైతుల కుటుంబాలు ఆందోళన బాటపట్టాయి.