జిల్లా పంచాయతీ అధికారి పై వేటు వేసిన తెలంగాణ ఈసీ

తెలంగాణలో పంచాయతీ రాజ్ ఎన్నికలకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో వికారాబాద్ డిపిఓ మాజీద్ పై ఈసి వేటు వేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గత మూడు నెలలుగా కసరత్తు జరుగుతోంది. ఓటర్ల నమోదు, బిసి జనాభా గణన, ఓటరు లిస్టు వివరాలు, పంచాయతీ రిజర్వేషన్ల ఆధారంగా రిజర్వేషన్ల ఎంపిక ప్రక్రియ జరిగింది. 

డిపివో మాజిద్

ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలకు సామాగ్రి కూడా చేరింది. వాటిని మండలాలలకు తరలించారు. ఇటీవల పంచాయతీరాజ్ అసిస్టెంట్ కమీషనర్ అశోక్ కుమార్ వికారాబాద్ జిల్లా లో ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించారు. వికారాబాద్ జిల్లాలో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఆయన గ్రహించారు. దీనికి కారణం డిపివో మాజిదే అని ఆయన నివేదిక తయారు చేసి ఎన్నికల సంఘానికి నివేదించారు. అతని ప్లేసులో వేరొక సమర్దవంత అధికారిణి నియమించాలని ఆయన కలెక్టర్ కు సూచించారు.

దీంతో విచారించిన ఎన్నికల సంఘం డిపిఓ మాజిద్ ను విధుల నుంచి తప్పించింది. ఆయన ప్లేస్ లో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ ను ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో డీఆర్వో మోతీలాల్ కు పూర్తి బాధ్యతలు అప్పగించినట్టు కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రెండు రోజులకే  జిల్లా పంచాయతీ అధికారి పై వేటు పడడం చర్చనీయాంశమైంది.