టిడిపికి 130 అసెంబ్లీ, 20 ఎంపి సీట్లు ఖాయమట

వచ్చే ఎన్నికల్లో  మళ్ళీ అధికారం అందుకునే విషయంలో తెలుగుదేశంపార్టీ నేతలు పెద్ద ఆశలే పెట్టుకున్నట్లు కనబడుతోంది.  రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి 130 అసెంబ్లీ సీట్లు ఖాయమంటూ విజయవాడ ఎంపి కేశినేని నాని జోస్యం చెప్పారు. ఒకవైపేమో క్షేత్రస్దాయిలో పార్టీ పరిస్దితి రోజురోజుకు అధ్వాన్నంగా తయారవుతోంది. ఆ విషయం టిడిపి నేతలే ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. అదే సమయంలో మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో సీమాంధ్రులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఏం జరిగిందో అందరూ చూసిందే.

 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుకట్ పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్ గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్, చేవెళ్ళ, సికింద్రాబాద్, మలక్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గతాల్లో తెలుగుదేశంపార్టీతో పాటు కాంగ్రెస్ అభ్యర్ధులు కూడా తుడిచిపెట్టుకుపోయారు. ఒక్కళ్లంటే కనీసం ఒక్క అభ్యర్ధి కూడా గెలవలేదు. పైగా చంద్రబాబునాయుడు ప్రచారం చేసిన 12 నియోజకవర్గాల్లో 11 చోట్ల దారుణంగా ఓడిపోయారు. సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేసినా, పోటీ చేసిన టిడిపి అభ్యర్ధులందరూ ఎందుకు ఓడిపోయారు ? ఈ ప్రశ్నకు టిడిపి నేతలు సమాధానం చెబితే చాలు. ఏపిలో చంద్రబాబు పాలనపై ఆగ్రహంతో ఉన్న జనాలు తెలంగాణా ఎన్నికల్లో మహాకూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్నది వాస్తవం.

 

ఏపిలో జనాల మనోభావాలు మొన్నటి తెలంగాణాలోని సీమాధ్రుల ఓట్లు ఎక్కువగా నియోజకవర్గాల్లో ప్రతిఫలించిందని అనుకుంటున్నారు. వాస్తవాలు ఇలావుండగా కేశినేని లాంటి వాళ్ళు మాత్రం రివర్సులో మాట్లాడటం విచిత్రంగా ఉంది. మరీ విడ్డూరమేమిటంటే, మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఓడిపోవటమంటే టిడిపికి మంచి సూచనలే అంటున్నారు. మూడు రాష్ట్రాల్లో బిజెపి ఓడిపోవటానికి ఏపిలో మళ్ళీ టిడిపి రావటానికి ఏమి సంబంధమో ఎవరు చెప్పలేకున్నారు. 130 అసెంబ్లీ సీట్లతో పాటు 20 పార్లమెంటు సీట్లలో టిడిపి గెలవటం ఖాయమంటూ నాని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. మరి వాళ్ళ లెక్కలేంటో అర్ద కావటం లేదు.