చింతమనేని వెనక ఇంత చరిత్ర ఉందా?

(శివ రాచర్ల)

అసెంబ్లీ రౌడీ,కాలకేయుడు

ఇవి నేను పెట్టిన టైటిల్స్ కాదు మీడియా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు పెట్టిన పేర్లు.

స్వాతంత్ర పోరాట అనుభవం,చదువు,కుటుంబ నేపధ్యం, సమాజ సేవ లాంటి అనేక అర్హతలు దాటి 90 ల నాటికి డబ్బు ఎన్నికలల్లో పోటికి ప్రధాన అర్హత అయ్యింది,దీనికి అదనం కండబలం.

అత్యధిక మంది కొత్తవారు అసెంబ్లీకి ఎన్నికయిన 78(ఇందిరా కాంగ్రెస్), 83(టిడిపి) ఎన్నికల తరువాత చంద్రబాబు 1999 ఎన్నికల్లో చేసిన తటస్థుల ప్రయోగం ముఖ్యమైంది. రాజకీయాలతో సబంధం లేని వారిని ముఖ్యంగా వ్యాపారులను నేరుగా ఎన్నికల బరిలోకి దించారు.2004 ఎన్నికల్లో పెద్ద మార్పులు లేవు 2009 ఎన్నికల్లొ చిరంజీవి రాజకీయ ప్రవేశం , గత సంస్కృతికి భిన్నంగా కాంగ్రేస్ కూడ పెట్టుబడిదారులను ముఖ్యంగా రియలెస్టేట్ వ్యాపారులు ఎన్నికల బరిలో దించింది .

రాజకీయ నేపద్థ్యం లేకుండా కూడా రాజకీయాలలొ విజయవంతం కావొచ్చన్న నమ్మకం కలిగించిన ఎన్నికలు ఈ 2009 ఎన్నికలు.2014 ఎన్నికలు అటు వైసిపి,ఇటు టిడిపి ఇలాంటి ఆశావహులకు వేదికలయ్యాయి.

1999లో మొదలైన ఈ తటస్థుల,వ్యాపారుల రాజకీయ ప్రవేశం 2014 నాటికి అనేక నియోజకవర్గాలలో 30-40 సంవత్సరాలు రాజకీయం చేసిన కుటుంబాలను నామమాత్రం చేసింది, రాజకీయ వర్గాలను పెట్టటమో లేక బలాన్ని తగ్గించటం చేసింది.

ఈ మార్పును దెందులూరు నియోజకవర్గంలో గమనించవొచ్చు. 42 కేసులు ఎదుర్కున్న ,రౌడి అని పిలిపించుకుంటున్న (1996లొ ఆయన మీద రౌడి షీట్ తెరిచారు) స్థానిక తెలుగుదేశం శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ప్రత్యర్ధి పార్టీలకే కాకుండ సొంత పార్టీకి, ప్రజలకు,అధికారులకు కూడా సవాలు విసురుతున్నారు.ఆయనకు ధీటుగా నిలబడగల ప్రతర్ధి కోసం ప్రత్యర్ధి పార్టీలు అన్వేషిస్తున్నాయి.

శివ రాచర్ల ఫేస్ బుక్ టైమ్ లైన్ ఫోటో

వైసిపి నియోజకవర్గ బాధ్యుడు అబ్బాయి చౌదరి ఉన్నవారిలొ మెరగే కాని చింతమనేనికి సమ ఉజ్జి కాలేరు. 2009లొ వీరి తండ్రి రామచంద్ర రావ్ కాంగ్రెస్ తరుపున పోటిచేసి ఓడిపోయారు.

చింతమనేని రాజకీయ ప్రవేశమే సొంతపార్టికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఎన్టీఆర్  బంధువు అయిన గారపాటి సాంబశివరావ్ మీద దౌర్జన్యంతో మొదలైంది.

ఎన్టీఆర్ కూతురు లోకేశ్వరిని గారపాటి సాంబశివరావ్ తమ్ముడు వివాహం చేసుకున్నారు.గారపాటి కుటుంబం 1955 నుంచి దెందులూరు రాజకీయాలలొ ఉంది,పలుసార్లు ఎం ఎల్ ఎ    పదవికి పొటి పడి ఓడిపోయారు.తెలుగుదేశం ఆవిర్భావంతో సాంబశివరావ్ 1983,85,94,99 ఎన్నికల్లొ గెలిచారు.1989,2004లో తండ్రి కొడుకులు మాగుంట రవింద్రనాథ్ చౌదరి,మాగంటి బాబు మీద ఓడిపోయారు.

2004లొ సాంబశివరావ్ ఓటమి తరువాత యువకుడు మండలాధ్యక్షుడైన చింతమనేని ఎం ఎల్ ఎ పదవి మీద దృష్టి పెట్టి 65 సంవత్సరాల గారపాటి సాంబశివరావ్ కు జ్ఞాపక శక్తి తగ్గిందని,వినికిడి లోపం కూడా వొచ్చిందని కార్యకర్తల పేర్లు కూడ గుర్తుండటం లేదని ప్రతి సభలో తన అనుచరులతో గొడవచేయించాడు.పెద్దతరహా రాజకీయాలు చేసిన సాంబశివరావు ఆ దాడిని ఎదుర్కోలేక పోయ్యారు.తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా అయినా పోటిచేస్తానని చింతమనేని చంద్రబాబును భెదిరించారు.

2004 ఎన్నికల్లొ ఓటమి,నాయకులు ప్రజా రాజ్యంలోకి క్యూ కట్టటం 2009 చావోరేవో అనట్లు ఉండటం, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరిన మాగుంట బాబు కూడ మొగ్గు చూపటంతో చంద్రబాబు దెందులూరు టికెట్ చింతమనేనికి ఇచ్చారు.

దెందులూరుకు చెందిన కొమ్మారెడ్డి సూర్యనారాయణ(పర్వతనేని ఉపేంద్ర మామగారు) ఏలూరు లోక్ సభకు 1967,71,77లో ఎన్నికయ్యి 78లో జనతా పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.మాగంటి రవింద్రనాథ్ చౌదరి భార్య వరలక్ష్మిగారికి సుర్యనారాయణ గారితో దగ్గరి బంధుత్వం లేదు కాని “కొమ్మారెడ్డి” అమ్మాయి. వరలక్ష్మి గారి తమ్ముళ్లు కొమ్మారెడ్డి మాధవరావ్, రాంచంద్రమూర్తి బావ రవింద్రనాథ్ చౌదరి రాజకీయంగా చేదొడుగా ఉండేవారు.

పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ చైర్మన్ గా పనిచేసిన రవీంద్రనాథ్ చౌదరి 1989లో దెందులూరు నుంచి కాంగ్రేస్ తరుపున గెలిచి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఇంటికి వెళ్ళేదారిలో గుండపోటుతో మరణించారు. సారా వ్యాపారి మరియు సినిమా నిర్మాత (గ్యాంగ్ లీడర్,ఖైది 786) అయిన రవీంద్రనాథ్  చౌదరి 1989 ఎన్నికల్లో కాంగ్రేసుకు వనరులు సమకూర్చారు.

రవీంద్రనాథ్ చౌదరి మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య వరలక్షిగారు గెలిచి మంత్రి అయ్యారు,94లొఓడిపొయ్యారు. 99లో ఆమె తమ్ముడు కొమ్మారెడ్డి మాధవరావ్ దెందులూరు నుంచి పోటిచేసి ఓడిపోయారు.

మాగుంట బాబు 1996లొ ఏలూరు  ఎంపి గా ఓడిపొయ్యి 98లో గెలిచి 1999లో మరోసారి ఓడారు.2004లో దెందులూరుఎం ఎల్ ఎ  గా గెలిచి వైఎ స్ ఆర్  క్యాబినేట్లో మంత్రి అయ్యారు.2008లో జరిగిన  జడ్ పిటిసి ఉప ఎన్నికల్లో కాంగ్రేస్ ఓడిపోవటంతో YSR ఆయనతో రాజినామ చేపించారు.దీని అవమానంగా భావించి మాగుంట బాబు టిడిపి లో చేరి ఏలూరు ఎంపి గా పోటిచేశారు.

మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెసుకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచినా మాగంటి కుటుంబం టిడిపి లో చేరటంతో 2009లో తొలిసారి పోటికి దిగిన చింతమనేని సులభంగా గెలిచారు.

ఇప్పుడు TDP యేతర ఓటర్లను ఏకంచేసే నాయకుడు దెందులూరులో లేరు…ఈ ధైర్యంతోనే చింతమనేని గతంలో అసెంబ్లీల్లో జగన్కు ఇప్పుడు పవన్ కు సవాలు విసురుతున్నారు.

చింతమనేని పోరు తట్టుకోలేక చంద్రబాబు తన ప్రియ శిష్యురాలు పీతల సుజాతగారిని మంత్రిపదవి నుండి తప్పించారు.పీతల సుజాత చింతమనేనితో ప్రత్యక్ష్యంగా మాగంటి బాబుతో పరోక్ష్యంగా వర్గపోరు నెరపలేకపోయారు. 2019లో ఆవిడకు టికెట్ రాకపొయినా ఆశ్చర్యం లేదు.

చింతమనేని వేధింపులను తట్టుకోలేక తెలుగుదేశానికే చెందిన ఏలూరు రూరల్ మండలాధ్యక్షురాలు రాజినామా చేశారు. సొంతపార్టి కాదు చింతమనేని అనుచరులుగా ఉంటేనే అక్కడ ఎవరైనా మనగలిగేది.

2017లొ YCP ఫిరాయింపు MLA లకు మరియు కాంగ్రేస్ నుంచి TDPలో చెరి గెలిచిన పితాని సత్యనారాయణకు మంత్రిపదవి దక్కటంతో రగిలిపోయిన చింతమనేని TDPకి రాజినామాచేసి సొంతపార్టి పెడతానని ప్రకటించారు.2013లో ఇదే పితాని సహకారంతో కాంగ్రేసులోకి పోవటానికి ప్రయత్నం చేశారని పత్రికలు రాశాయి.2014 ఎన్నికల్లొ చింతమనేనికి టికెట్ రాదన్న అనుమానంతోనే కాంగ్రేసులోకి వెళ్ళే ప్రయత్నం చేశారని , ఎన్నికల ముందు YCP తో కూడ సంప్రదించారని కథనాలొచ్చాయి. ఇప్పుడు చింతమనేనికి టికెట్ నిరాకరించే ధైర్యం చంద్రబాబు చెయ్యరు.

2014 తరువాత మంత్రిపదవులు ఇవ్వలేక పోయినవారికి “అనధికార” మంత్రి పదవులు సృష్టించి జిల్లా వ్యాప్తంగా కొన్ని శాఖల వ్యవహారాలు అప్పచెప్పే కొత్త సాంప్రదాయాన్ని చంద్రబాబు మొదలుపెట్టారు. చింతమనేనికి కూడా పశ్చిమగోదావరి జిల్లాలో 2 శాఖలు మీద పెత్తనం అప్పచెప్పి ఆయన్ను శాంతపరిచారని చెప్తారు.తమ్మిలేరు నదిలో ఇసుక రిచ్ లు మొత్తం ఆయనవే,ఈ గొడవలోనే MRO వనజాక్షి మీద దాడి చేసింది. హోదా ,ఆదాయం దక్కితే మంత్రి పదవి లేక పోతేనేమి!

2019లో చింతమనేని ఓడించటం సులభం కాదు.ఈయన దూకుడు మనస్తత్వం ఒక వైపైతే ఓటర్లతో మంచి సంబధాలు ఏర్పచుకోవటం వారి అవసరాలకు సహాయం చెయ్యటం. పండగలకు చికెన్ , మటన్ పంఫిణి చెయ్యటం,కొడుకును ప్రభుత్వ స్కూల్లో చదివించటం తదితర కార్యక్రమాలతొ ప్రజలకు ఒకింత సన్నితం అయ్యారు.

తెలుగు దేశం ఏర్పడ్డప్పటి నుంచి వెలమ(కొటగిరి విధ్యాధర రావ్), క్షత్రియ(దండు శివరామ రాజు,కలిదిండి రాజు), కాపు(సుబ్బారాయుడు) తదితరుల నాయకత్వంలో నడిచిన చౌదరులకు పశ్చిమగోదావరి జిల్లాలొ చింతమనేని నాయకుడిగా ఎదిగారు.పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చౌదరి నాయకులు ఎవరైనా తెలుగుదేశం ప్రభుత్వాలలొ మంత్రి అయ్యారా?నాకు గుర్తుండి ఎవరు కాలేదు.ప్రత్యర్ధి పార్టీలు చౌదరిని పోటికి దింపినా వారి ఓట్లలో 10% కూడా సాధించలేరు.2009లో ప్రజారాజ్యం 20 వేల ఓట్లున్న గౌడ కులానికి చెందిన అశోక్ గౌడ్ ను పోటికి పెట్టి ప్రయోగం చేసింది.

చింతమనేని విజయంలో ముఖ్య పాత్ర మత్స్యకారులైన “వడ్డి” కులస్తులది.దాదాపు 30 కోల్లేరు గ్రామాలలొ కులకట్టుబాటు ఉంది, అందరు ఒకే పార్టీకి ఓటువేస్తారు.మొన్న పవన్ కల్యాణ్ సభకు వెళ్ళకుడదని,వెళ్ళిన వారికి 50,000 జరిమానా అని వడ్డి కులపెద్దలు చేసిన హెచ్చరికతో వారు పవన్ సభకు వెళ్ళలేదు.

వడ్డి కులస్తుడైన జయమంగళం వెంకట రమణ 2009లో కైకలూరు నుంచి తెలుగుదేశం తరుపున గెలిచారు. దెందులూరులో ప్రత్యర్ధి పార్టీలలో ఒకరు వీరికి సీట్ ఇచ్చి ప్రయోగం చేస్తే చింతమనేని ఉక్కిరిబిక్కిరి కావటం ఖాయం. గెలుపు ఓటమిలను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి వడ్డిలు పోటికి దిగితే మాత్రం చింతమనేని గట్టిపోటి ఎదుర్కోవటంఖాయం.

గతంలొ మంత్రిగా ఉన్న వట్టివసంత్ మీద దాడిచేసిన చింతమనేని మరో సారి గెలిస్తే అసెంబ్లీలోనే ఇతరపక్షాల మీద దాడికి దిగి నిజంగానే అసెంబ్లీ రౌడీ అవుతారేమో!

 

(శివ రాచర్ల పేస్ బుక్ వాల్ నుంచి తీసుకున్నది)