అసలే అప్పుల్లో, రెవెన్యూ లోటులో ఉన్న రాష్ట్రానికి పోలవరం లాంటి భారీ ప్రాజెక్ట్ భారాన్ని మోయడం అంటే దాదాపు అసాధ్యమే అనాలి. వెయ్యి కాదు రెండు వేలు కాదు 55 వేల కోట్ల ప్రాజెక్ట్ అది. కాలం గడిచే కొద్దీ అంచనా వ్యయం కొండలా పెరిగిపోతూ ఉంటుంది. 2005, 06 లో 10,150 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం 2017,18 కి 55,500 కోట్లకు పెరిగింది. ఎంత ఆలస్యం చేస్తే అంత భారమన్నమాట. ఈ భారాన్ని మోయలేకే ఆనాడు జాతీయ హోదా తెచ్చుకుని కేంద్రం భరించాలని మాట తీసుకున్నారు. విభజన హామీల్లోనూ పోలవరం ప్రస్తావన ఉంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే మోయాలని. కానీ ఆనాడు కాంగ్రెస్ సర్కారుకు కానీ ఈనాడు బీజేపీ ప్రభుత్వానికి ఆ ఉద్దేశ్యం లేదు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడ ఇదే జరిగింది. నిధులు విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఒట్టి చేతులు చూపుతుండేసరికి ఆయన చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ఒకానొక బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్రం కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కట్టలేదా అని నిలదీశారు. వచ్చే నిధులు ఎప్పుడైనా వస్తాయి ముందు సొంత ఖర్చులతో కట్టేసి పైనుండి వచ్చే నిధులను సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది అంటూ వేలమంది జనం ముందు సలహా ఇచ్చారు. జగన్ మాటలు విన్న జనం ఇది కదా పౌరుషమంటే.. వాళ్ళు కట్టివ్వకపోతే మనం కట్టుకోలేమా అనుకున్నారు.
ఇపుడు మనమే కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ కట్టగలిగే స్థితిలో ఉన్నామా లేదా అనేదే చూసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా కట్టలేం. అన్నిటికీ అప్పుల మీదే ఆధారపడుతున్నాం. ఎక్కడ పాతిక వేల కోట్లు అప్పు పుడుతుందా వెళ్లి తెచ్చుకుందామా, నిర్వహణకు ఖర్చు పెట్టుకుందామా అనే స్టేజి మనది. ఈ పరిస్థితుల్లో జగన్ కూడా ఏమీ చేయలేరు. నాడు చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడ ఇందుకు భిన్నమేమీ కాదు. కాకపోతే అప్పుల బెడద కొంచెం తక్కువ ఉండేది అంతే. ఖజానాలో డబ్బులు లేక కేంద్రం ఎప్పుడు ఇస్తుందో తెలీక అయోమయం పరిస్థితి.
అప్పటికీ చంద్రబాబు సర్కార్ 12,500 కోట్లు ఖర్చు పెట్టింది. వాటిలో 8,500 కోట్లు కేంద్రం నుండి వెనక్కి రాగ ఇంకా 4000 కోట్లు బాకీ ఉన్నాయి. అవి ఎపుడొస్తాయో తెలీదు. ఈ లెక్కలన్నీ చూశాఖ ఆనాడు జగన్ చంద్రబాబుకు సొంత ఖర్చులతో కట్టేయండి అంటూ సలహా ఇచ్చినంత ఈజీ కాదు ప్రాజెక్ట్ కట్టడమని తేలింది. సో.. కష్టమో నష్టమో కేంద్రంతో పోరాడి ప్రాజెక్ట్ పూర్తిచేసుకోవడమే తక్షణ కర్తవ్యం.