Chandrababu: బాబు ప్రైవేటు మంత్రం ఏపీలో వైద్యవిద్యకు శాపం

ఆంధ్రాలో మెడిసిన్‌ చదవడం ఇక మరింత కాస్ట్‌లీయా? , పేదలకు వైద్య విద్య మరింత దూరం కానుందా?, ఏపీ విద్యార్థులు మెడిసిన్‌ కోసం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలసపోవలసిందేనా?, కూటమి ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాలకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తోందా?, అనే ప్రశ్నలకు ఔను అన్న సమాధానమే వినిపిస్తోంది.

ఏపీ శాసనమండలిలో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్‌ చెప్పినదాన్ని బట్టి జనం ఈ అభిప్రాయానికే వస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులిచ్చి నాణ్యమైన వైద్యవిద్యను అందించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అందుకే కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని నిర్ణయించామని కూడా ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన 10 వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోకి తీసుకెళతామని, ఇందుకు పెట్టుబడిదారులను అన్వేషిస్తామని ఆయన వివరించారు. ఈ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంత పెద్ద యంత్రాంగం, వనరులు, సాధన సంపత్తులు ఉన్న ప్రభుత్వం నాణ్యమైన వైద్య విద్యను అందించలేనని చేతులెత్తేస్తే ఇక ప్రైవేటు యాజమాన్యాల్లో మాత్రం నాణ్యతను ఎలా ఆశించగలమనే సందేహం కలుగుతోంది. విద్య, వైద్యం, రోడ్ల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవడానికే ఈ పీపీపీ విధానాన్ని ముందుకు తెస్తోందని అంటున్నారు. కూటమి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో వైద్య విద్య మరింత కాస్ట్‌లీగా మారుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాక నాలుగోసారి ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు అధికారులనుద్దేశించి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో మూడు పీపీపీల స్థానంలో అంటే పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌కు బదులు నాలుగు పీపీపీపీలు అంటే పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్స్‌ పార్టనర్‌ షిప్‌ను చూస్తారని అన్నారు. అలాగే ఇకపై తనలో 1996 నాటి చంద్రబాబును చూస్తారని ఆయన చెప్పారు. అప్పటి నుంచి ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఒక్క రోడ్ల విషయంలోనే కాక ప్రతి రంగంలో పీపీపీపీ విధానం తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అంటే గతంలో పీపీపీపీ విధానంలో పొందే ప్రతి సేవకు జనం నుంచి యూజర్‌ చార్జీల్లాగ సొమ్ము వసూలు చేస్తారన్నమాట. 1996లో చంద్రబాబు తనను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాక ఒక సీఈవోగా సంబోధించాలని అనేవారు.

వరల్డ్‌ బ్యాంక్‌ సూచనలకు అనుగుణంగా అన్ని రంగాలను ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తున్నారని అప్పట్లో కమ్యూనిస్టులు చంద్రబాబును విమర్శించేవారు. మళ్లీ ఇన్నేళ్లకు సీఎం చంద్రబాబునాయుడు ప్రైవేట్‌ జపం చేయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో కేవలం 11 వైద్య కళాశాలలు ఏర్పాటయితే గత ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో 17 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని వైఎస్సార్‌ సీపీ నాయకులు చెబుతున్నారు. ఒకే ఏడాది ఐదు వైద్య కళాశాలలు ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్‌ సీట్లను తమ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేస్తున్నారు.

పీపీపీపీ విధానంలో ప్రభుత్వ పెత్తనమే ఉంటుందని మంత్రి సత్యకుమార్‌ చెబుతున్నప్పటికీ అంత నమ్మశక్యంగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సహజంగా లాభాపేక్షతో పనిచేసే ప్రైవేటు యాజమాన్యాలు వైద్య విద్యను మరింత ఖరీదైన వస్తువుగా మార్చేస్తాయే తప్ప పేదల గురించి ఆలోచించవని అంటున్నారు. మెడికల్‌ కాలేజీ అంటే కేవలం విద్య అందించే కేంద్రమే కాదు సామాన్య ప్రజలకు వైద్యం కూడా అందులో భాగమే. పీపీపీపీ విధానంలో ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపులో పారదర్శకత ఉండదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక పేదలకు ఉచిత వైద్యం ప్రైవేటు యాజమాన్యాలు ఎలా అందిస్తాయని ప్రశ్నిస్తున్నారు. వైద్య విద్యను ప్రైవేటీకరించడమంటే దోపిడీకి గేట్లు బార్లా తెరిచినట్టేనని అంటున్నారు. ఇక రాష్ట్రంలో పేదల పిల్లలకు వైద్య విద్య అందడం అసాధ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీప్‌గా, క్వాలిటీగా చదవాలనుకొనే విద్యార్థులు ఇకపై పక్క రాష్ట్రాలకు, దేశాలకు వలసపోతారని అంటున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో పేదలకు వైద్య విద్య, ఉచిత వైద్యం ఇక వెంటిలేషన్‌పైకి వెళ్లినట్టేనని సమాజంలో వివిధ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నాయి. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో.. చూద్దాం..

Public EXPOSED: Pawan Kalyan Pithapuram Meeting || Ap Public Talk || Chandrababu || Ys Jagan || TR