బిజెపికి ఉన్నదే గోచి..చంద్రబాబేం విప్పుతారు

జాతకాలు విప్పుతాం…మీ జాతకాలు విప్పితే తలెత్తుకుని తిరగలేరు..ఇలాగే చెబుతూ చంద్రబాబునాయుడు కాలక్షేపం చేసేస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో కూడా అవే డైలాగులు కొడుతుంటే బిజెపి జాతకాలు ఇంకెపుడు విప్పుతారు ? అసలు చంద్రబాబు దగ్గర బిజెపి జాతకాలేమున్నాయి విప్పడానికి ? ఎన్డీఏలో నుండి చంద్రబాబునాయుడు బయటకు వచ్చేసిన కొత్తల్లో చంద్రబాబుకు నమ్మినబంటు, ప్లానింగ్ కమీషన్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు మాట్లాడుతూ తొందరలో మోడి, అమిత్ షా జాతకాలు విప్పుతామని చెప్పారు.

అయితే ఎన్ని రోజులైనా ఇంకా జాతకాలు విప్పలేదు. తాజాగా అదే పాటను చంద్రబాబు అందుకున్నారు. ఒకవైపేమో గుంటూరు బహిరంగసభలో చంద్రబాబుపై మోడి ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుతో కలిపి పుత్రరత్నం నారా లోకేష్ అవినీతి మీద కూడా మోడి మండిపడ్డారు. మోడియేమో నేరుగా చంద్రబాబు, లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి చంద్రబాబు మాత్రం విప్పుతా..విప్పుతా అంటారే కానీ ఎంతకీ విప్పిచూపరే.

ఆ విప్పి చూపించేదేదో ఒకసారిగా చూపించేస్తే బిజెపికి వస్తాయనుకుంటున్న సీట్లు కూడా రాకుండా చేయొచ్చు కదా ? పోనీ బిజెపిని చచ్చినపాముతో పోల్చినపుడు దాన్ని వదిలేయాలి. విప్పిచూపేది లేదు అలాగని వదిలేసేదీ లేదు. బిజెపితో పెట్టుకోవటమంటే గాలితో కత్తియుద్ధం చేయటమన్న విషయం చంద్రబాబుకు తెలీదా ? ఎందుకేంటే రాష్ట్రంలో బిజెపికున్న బలమేంటి? బిజెపికి వచ్చేది లేదు పోయేదీ లేదు.

మోడి, బిజెపి, పవన్ కలుసున్నపుడే బిజెపికి వచ్చింది ముష్టి నాలుగు అసెంబ్లీ సీట్లు. ‘ఉన్నదే గోచీపాత ఉంటే ఎంత పోతే ఎంత’ అన్న పద్దతిలో వాళ్ళే ఉంటే ఇక చంద్రబాబు బిజెపికి ఊడపీకేదేముంది కొత్తగా ? వాళ్ళతో పెట్టుకుంటే ఏమన్నా నష్టం జరిగేది చంద్రబాబుకే తప్ప బిజెపికి కానే కాదు. కాబట్టి నిజంగానే మోడి, అమిత్ షా జాతకాలు చంద్రబాబు దగ్గరుంటే విప్పి చూపించాలి. లేకపోతే వాళ్ళని వదిలేస్తే చంద్రబాబుకు సమయమన్నా కలిసివస్తుంది. ఈ విషయాన్ని చంద్రబాబు ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది.