ReNew Power: దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ గేట్‌వేగా ఏపీ.. ఏకంగా 22 వేల కోట్ల పెట్టుబడులు!

ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన రంగంలో మరో విప్లవానికి వేదికగా మారుతోంది. అనంతపురం జిల్లా బేతపల్లిలో రెన్యూ సంస్థ ఏర్పాటు చేయనున్న మెగా రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌కు ఈ నెల 16న మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.22 వేల కోట్లతో ఏర్పడనున్న ఈ కాంప్లెక్స్ దేశంలోనే అతిపెద్దది కావడం విశేషం.

ఈ ప్రాజెక్టు మొదటి దశలోనే 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లపై రూ.7 వేల కోట్ల పెట్టుబడి ప్రవహించనుంది. మొత్తం మూడు దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల స్టోరేజ్ యూనిట్ల నిర్మాణం జరుగనుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే, రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా మారనుంది.

చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ (ICE) రాష్ట్రంలో పెట్టుబడులకు నూతన దిక్సూచి అయింది. దావోస్ సదస్సులో మంత్రి లోకేశ్ చేసిన చర్చల ఫలితంగా రెన్యూ సంస్థ మళ్లీ ఏపీ వైపు మళ్లింది. ఈ పాలసీతో పలు దేశీ, విదేశీ కంపెనీలు రాష్ట్రాన్ని గమ్యంగా ఎంచుకుంటున్నాయి.

రిలయన్స్, టాటా పవర్, వేదాంత, బ్రూక్ ఫీల్డ్, ఎస్ఈఎల్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులకు అంగీకారం తెలపగా, రాష్ట్రవ్యాప్తంగా రూ.65 వేల కోట్ల విలువైన CBG ప్లాంట్లు, భారీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. లబ్ధిదారులకు ప్రోత్సాహకాలతో పాటు వేగవంతమైన అనుమతుల ప్రక్రియ ద్వారా ఏపీ గ్రీన్ ఎనర్జీ రేసులో ముందంజ వేసింది.