Vizag Data Center: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ (Google) మరియు దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో లోకేశ్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధానంగా విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న ‘డేటా సెంటర్’ పనులపై చర్చించారు.
శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినందుకు గూగుల్ ఉన్నతస్థాయి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైజాగ్‌లో ఏర్పాటు చేయనున్న ఏఐ (AI) డేటా సెంటర్ ప్రాజెక్ట్ పనుల ప్రారంభం, పురోగతిపై ఇరువురు సమీక్షించారు. ఏపీలో రాబోతున్న ‘డ్రోన్ సిటీ’లో డ్రోన్ అసెంబ్లీ, క్యాలిబరేషన్, టెస్టింగ్ యూనిట్లను నెలకొల్పే అంశాన్ని పరిశీలించాలని సుందర్ పిచాయ్‌ను మంత్రి కోరారు. ఈ భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే కూడా పాల్గొన్నారు.
గూగుల్‌తో పాటు పలు అంతర్జాతీయ సంస్థల అధినేతలతో మంత్రి లోకేశ్ వరుసగా సమావేశమయ్యారు.

అడోబీ (Adobe): అడోబీ సీఈవో శంతను నారాయణన్‌తో భేటీ అయిన లోకేశ్, విశాఖపట్నంలో ‘అడోబ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్’ లేదా డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
ఎన్విడియా (Nvidia): గేమింగ్, చిప్ డిజైనింగ్, జిపియు తయారీలో దిగ్గజమైన ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్మిర్ పూరితో శాంటాక్లారాలో చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్న లోకేశ్ ప్రతిపాదనపై.. తమ బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజ్మిర్ తెలిపారు.

జూమ్ (Zoom): జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం, సీఓఓ అపర్ణ బావాలతో సమావేశమయ్యారు. అమరావతి లేదా విశాఖపట్నంలో జూమ్ ఆర్‌అండ్‌డీ (R&D) సెంటర్ లేదా ఇంజినీరింగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇంటెల్ (Intel): ఇంటెల్ ఐటీ విభాగం సీటీవో శేష కృష్ణపురతో సమావేశమైన మంత్రి, ఏపీలో ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ATMP) యూనిట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు ఈ పర్యటన దోహదపడుతుందని మంత్రి లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

