ఎవరికి ఎడ్జ్?… గతం గుర్తుచేస్తున్న 2024 ఎన్నికలు!

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో అధికార విపక్షాలు ఎవరి వ్యూహాలతో వారు బిజీగా ఉన్నారు. మరోపక్క అభ్యర్థుల ఎంపికలపై కసరత్తులు చేస్తున్నారు. ఈ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీస్థాయిలో ఇన్ ఛార్జ్ ల మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారు. మరోపక్క పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే సీట్లు, తమ్ముళ్ల బుజ్జగింపులతో బాబు బిజీగా ఉన్నారని తెలుస్తుంది.

ఈ సందర్భంగా 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమని, ఆ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాల్లో జరగబోయే మార్పులు న భూతో న భవిష్యతీ అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో 2004, 2009, 2014 ఎన్నికలను గుర్తుచేస్తూ… ఈసారి గెలుపు ఎవరిని వరించినా… అతిస్వల్ప మెజార్టీలే తప్ప… వార్ వన్ సైండ్ వంటి సీన్ ఉండదని అంటున్నారు.

ఉదాహరణకు 2004 ఎన్నికల సమయంలో టీడీపీపై జనాలకు గట్టి ఆగ్రహమే ఉందనేది తెలిసిన సంగతే! అదే సమయంలో వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర ఒక్కసారిగా ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. 185 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ.. నాడు యూపీఏ లో భాగస్వామిగా ఉన్న టీఆరెస్స్ కూడా 26 సీట్లు గెలుచుకోవడంతో భారీ మెజారిటీనే సాధించింది.

కట్ చేస్తే… 2009 ఎన్నికల సమయానికి వైఎస్సార్ సంక్షేమ పథకాలపై ప్రజల్లో మాంచి అభిప్రాయం ఉన్నప్పటికీ నాడు జలయజ్ఞంలో అవినీతి కూడా పెద్ద ఎత్తునే జరిగిందన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో 156 సీట్లకే పార్టీ పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్ కి బొటాబొటీగా చేరుకుంది! ఈ విషయంపై ఆత్మపరిశీలన అవసరం అని నాడు వైఎస్సార్ గట్టిగా నేతలకు పిలుపునిచ్చారు.

2014 ఎన్నికల్లో ఆ అవకాసం వైఎస్సార్ పార్టీకి ఇవ్వలేదు చంద్రబాబు. బీజేపీతో కలిసి బరిలోకి దిగారు.. 117 స్థానాల్లో విజయం సాధించారు. అయితే అక్కడితో తృప్తి చెంది, ప్రజల మేన్ డేట్ కు విలువ ఇవ్వని బాబు… 23 మంది ఎమ్మెల్యేను వైసీపీ నుంచి అనౌతికంగా కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఇది ప్రజలకు ఏమాత్రం రుచించలేదు.. తమ ఓటును, తమ తీర్పును బాబు అవహేళన చేశారని భావించారు.

2019 ఎన్నికల్లో ఆ 23 సీట్లే చంద్రబాబుకు ఇచ్చి… వైసీపీకి 151 సీట్లు కట్టబెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… అప్పటి అధికార పార్టీ చేసిన తప్పిదాలవల్లో, విపక్షాల పోరాటాలవల్లో అధికారం మారుతూ ఉంటుంది. అంటే… ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టాక అదేదో రాచరికంలా ప్రవర్తించడం, ఒంటెద్దుపోకడలకు పోవడం వల్ల… తర్వాత ఎన్నికల్లో కర్ర కాల్చి వాతపేడతారనే విషయం 2004 నుంచి 2019 వరకూ జరిగిన ఎన్నికల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక ప్రస్తుత విషయానికొస్తే… వైఎస్ జగన్ కు గత ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత క్లీన్ మెజారిటీ ఇచ్చారు ఏపీ ప్రజలు. కరోనా సమయంలోనూ, సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ జగన్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే… కేవలం సంక్షేమమే కాదు.. అభివృద్ధిపై కూడా దృష్టిపెట్టాలనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి.

గ్రామస్వరాజ్యం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని… అభివృద్ధి అని జనం భావించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రహదారుల పరిస్థితి జగన్ ప్రభుత్వానికి పెద్ద డ్యామేజే కలిగిస్తున్నాయి. అయితే గత ప్రభుత్వం రోడ్లు వేసుంటే అవి కనిసీం ఐదేళ్లు పూర్తవ్వకుండా నాశనం అయిపోయాయా అనే విషయాన్ని జగన్ సర్కార్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయింది.

ఏది ఏమైనా… జగన్ పాలనపై ప్రజలు పూర్తి భరోసాతో ఉన్నారా.. లేక, 2009 లో వైఎస్సార్ పై ఉన్నట్లు సంక్షేమంలో ఫుల్ మార్కులు, అభివృద్ధిలో పాస్ మార్కులు మాత్రమే వేసి గట్టెక్కిస్తారా… లేక, 2014లో చంద్రబాబు పాలనతో విసిగి వేశారిన ప్రజానికం 2019 ఎన్నికల్లో టీడీపీకి ఇచ్చిన ఫలితాలు కట్టబెడతారా అనేది వేచి చూడాలి!! ఏది ఏమైనా… ఈసారి ఏ పార్టీకీ భారీ మెజారిటీ రాదనేది మాత్రం స్పష్టం అవుతుందని అంటున్నారు పరిశీలకులు.