అమరావతి కోసం త్యాగం చేస్తే నట్టేట ముంచుతున్నారు

(బిపి కుమార్)

రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు ఎంతో త్యాగం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి రైతులను కొనియాడని రోజు లేదు. అమరావతి కోసం 33 వేల ఎకరాలందించిన రైతుల త్యాగం  గురించి ఆంధ్రలోనే కాదు అంతర్జాతీయ సమావేశాలలో కూడ ఆయన చాలా ఆవేశంగా ప్రసంగిస్తుంటారు. వాళ్ల రుణం తీర్చుకోలేనిదని అంటుంటారు. ఇలాంటి త్యాగధలను సభల్లో ఆకాశానికెత్తి, రాజధానిలో  మాత్రం పాతాళానికి తొక్కేస్తున్నారు. రాజధాని రైతులకు ఇపుడు కొత్త చిక్కు వచ్చి పడింది.

 సీఆర్‌డీఏ నేరుగా రాజధాని భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెరతీయడంతో తమ భూములు కొనడానికి ఎవరూ ముందుకు రావడంలేదని రైతులు లబోదిబోమంటున్నారు. రాజధానిలో హ్యాపీనెస్ట్‌ పేరుతో 14 ఎకరాల్లో అపార్టుమెంట్ల నిర్మించి ఫ్లాట్లు అమ్మాలని నిర్ణయించిన సీఆర్‌డీఏ బుకింగ్‌లను సైతం ప్రారంభించింది. క్యాపిటల్‌ కాంప్లెక్స్‌ సమీపంలో 19 అంతస్తుల్లో నిర్మించే ఈ అపార్టుమెంట్లలో మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించి అçప్పుడే ఆన్‌లైన్‌లో 300 ఫ్లాట్లను అమ్మేసింది. త్వరలో మరో 300 ఫ్లాట్లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టనుంది. రెండో దశలో మరో 600 ఫ్లాట్లను విక్రయించనుంది. తొలి దశలో చేపట్టే ఆరు అపార్టుమెంట్ల నిర్మాణాన్ని నెలరోజుల్లో ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఆర్‌డీఏ అధికారులు ప్రకటించారు. రకరకాల కేటగిరీల్లో డబుల్, త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్లను చదరపు అడుగు రూ.3,492కు విక్రయిస్తామని  ప్రత్యేకంగా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల తరహాలో పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వడంతోపాటు బ్రోచర్లు ముద్రించారు. ప్రభుత్వమే నేరుగా ఫ్లాట్లు నిర్మించి అమ్మకానికి పెడుతుండడంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. 

లెక్క ప్రకారం, ప్రభుత్వం రాజధానిలో రైతులకు కేటాయించిన భూములను డెవెలప్ చేసి ఇవ్వాలి. మూడేళ్లలో ఇలా చేసి ఇస్తామన్నది ముఖ్యమంత్రి హామీ.

అయితే, సిఆర్ డిఎ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో  రాజధానిలో ఉన్న రైతులు డీలా పడిపోయారు. మూడున్నరేళ్ల క్రితం భూములు తీసుకునేటప్పుడు రైతులకిచ్చిన హామీలను పట్టించుకోకుండా ఇప్పుడు వారి భూముల్లోనే అపార్టుమెంట్లు నిర్మించి ప్రభుత్వమే అమ్ముకోవడం ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.   ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. 

తమకిచ్చిన భూములను ఖాళీగా వదిలేసి, వాటిని డెవలప్‌ చేయకుండా, అక్కడ ఇళ్లు కట్టుకోవడానికి సైతం ఆంక్షలు విధించారని రైతులు ఆవేదన చెందుతున్నారు. భూములిచ్చిన రైతులకు మూడేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించి అది అమలు కాలేదు. రైతులు భూములిచ్చి మూడున్నరేళ్లయినా ఇంకా వాటిని అభివృద్ధి చేసే పనులే మొదలుకాలేదు.

అమాటకొస్తే అసలు రైతుల చేతికి ఇంతవరకూ ప్లాట్లు రాలేదు. ప్లాట్ల పంపిణీని పూర్తి చేశామని చెబుతున్న అధికారులు కాగితాల్లో మాత్రమే ఆ పని చేశారనే విషయం చాలామందికి తెలియదు. మ్యాపులు, కాగితాల్లోనే సీఆర్‌డీఏ రైతులకు ప్లాట్లను చూపించింది. దీంతో మెజారిటీ రైతులకు అనుమానం వచ్చి తమ భూములను సీఆర్‌డీఏకు రిజిష్టర్‌ చేయకపోవడంతో దానిపైనా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రైతులు ఎంతోకొంత మొత్తానికి తమకు కేటాయించిన ప్లాట్లను అమ్ముకుంటున్నారు. ఇప్పుడు సీఆర్‌డీఏ నేరుగా అపార్టుమెంట్లు నిర్మిస్తామని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలా ముందుకు రావడంతో రైతుల ప్లాట్లను కొనేందుకు ఎవరూ ముందుకురావడంలేదు. తమ పక్కనే సీఆర్‌డీఏ ఫ్లాట్లు అమ్ముతుంటే బీళ్లుగా ఉన్న తమ ప్లాట్లు ఎవరు కొంటారని, కొన్నా రేటు ఎలా వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.