హ‌స్తం పార్టీకి చంద్ర‌బాబు హ్యాండిస్తారా?

ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియ‌ట్లేదు గానీ..నేష‌న‌ల్ మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోద‌నేది దాని సారాశం. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను చూసిన త‌రువాత చంద్ర‌బాబు త‌న మ‌న‌స్సు మార్చుకున్నార‌ని, కాంగ్రెస్‌ను కాద‌ని ఎస్పీ-బీఎస్పీ పొత్తు కుదుర్చుకోవ‌డంతో త‌మ అధినాయ‌కుడు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని ఇంగ్లీష్ న్యూస్ ఛాన‌ల్‌ ఓ క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది.

`పేరు చెప్ప‌డానికి ఇష్టం లేని` ఢిల్లీ స్థాయి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులను ఉటంకిస్తూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే కూడా జ‌నసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నార‌ట‌. ప‌వ‌న్ కూడా క‌లిసి రాక‌పోతే ఒంట‌రిగానే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే అభిప్రాయం చంద్ర‌బాబులో ఉన్న‌ట్లు వారు చెబుతున్నారు.

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్తే ఎలా ఉంటుంద‌నే అంశంపై తెలంగాణ‌లో ఓ ప్ర‌యోగం చేశామ‌ని, అది దారుణంగా విఫ‌ల‌మైంద‌ని వారు అభిప్రాయ‌డ్డారు. కాంగ్రెస్‌-టీడీపీల‌ది అనైతిక పొత్తు అనే అభిప్రాయం తెలంగాణ ఓట‌ర్ల‌లో ప్ర‌తిబింబించింద‌ని, అదే అభిప్రాయం ఏపీ ఓట‌ర్ల‌లోనూ ఉంటుంద‌ని తాము అంచ‌నా వేస్తున్న‌ట్లు చెప్పారు.

తెలంగాణ‌లో మ‌హాకూట‌మి చావుదెబ్బ తిన్నామ‌ని, దాన్నుంచి పాఠాలు నేర్చుకున్నామ‌ని టీడీపీ ఢిల్లీ స్థాయి నేతలు ఆ ఛాన‌ల్‌కు వివ‌రించారు. దీనికితోడు- ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో మారిన స‌మీక‌ర‌ణాలు కూడా త‌మ పార్టీ అధ్యక్షుడి నిర్ణ‌యాన్ని ప్ర‌భావితం చేసింద‌ని అన్నారు.

80 లోక్‌స‌భ స్థానాలు ఉన్న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోనే ఎస్పీ-బీఎస్పీ కూట‌మి కాంగ్రెస్‌ను ప‌ట్టించుకోలేద‌ని వారు వ్యాఖ్యానించారు. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డన‌ప్ప‌టికీ.. ఏపీ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో సీట్లు స‌ర్దుబాటు మాత్రం ఉండ‌ద‌ని తేల్చి చెబుతున్నారు.

ఈ క‌థనం ఎలా ఉన్న‌ప్ప‌టికీ..ఒంట‌రిగా ఎన్నిక‌ల్లో పోటీ చేసిన చ‌రిత్ర చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ లేదు. 1999లో బీజేపీతో క‌లిసి పోటీ చేశారు. విజ‌యం సాధించారు. 2004 ఎన్నిక‌ల్లో మ‌రోసారి అదే బీజేపీతో క‌లిసి పోటీ చేశారు. ఓడిపోయారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్లే ఓడిపోయామ‌ని క‌మ‌ల‌నాథుల‌ను నిందించారు.

ఆ త‌ప్పు జీవితంలో చేయ‌బోన‌ని శ‌ప‌థం కూడా చేశారు. ఆ శ‌ప‌థానికి క‌ట్టుబ‌డి ఉన్నారేమో! 2009లో టీఆర్ఎస్‌తో జ‌ట్టుక‌ట్టారు. అప్ప‌టి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని మ‌ట్టిక‌రిపించ‌డానికి టీఆర్ఎస్‌, సీపీఎం, సీపీఐల‌తో క‌లిసి మ‌హాకూట‌మిని ఏర్పాటు చేశారు. మ‌ళ్లీ ఘోర ప‌రాజ‌య‌మే.

ఆ త‌రువాత వైఎస్ హ‌ఠాన్మ‌ర‌ణంతో ప‌రిస్థితి త‌ల‌కిందులైంది. రాష్ట్రం విడిపోయింది. 2014 ఎన్నిక‌ల నాటికి న‌రేంద్ర‌మోడీ హ‌వా వీస్తుండ‌టంతో.. తాను చేసిన ఒట్టును గ‌ట్టు మీద పెట్టి మ‌రోసారి బీజేపీతో అంట‌కాగారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌నూ వెంటేసుకుని తిరిగారు. అధికారంలోకి రాగ‌లిగారు.

స‌రిగ్గా నాలుగేళ్ల‌లో బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్ పంచ‌న చేరారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను రిజ‌ర్వుడ్‌లో ఉంచారు. దీన్ని బ‌ట్టి చూస్తే- చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌ల్లోనూ ఎవ‌రితోనో ఒక‌రితో క‌లిసి పోటీ చేస్తారే త‌ప్ప ఒంట‌రిగా వెళ్ల‌లేరు. అది..ప‌వ‌న్ క‌ల్యాణ్ కావ‌చ్చు.