కొండ నాలుకకు మందేస్తే వున్న నాలుక ఊడినట్లు… 

 
 
(వి. శంకరయ్య) 
 
 
ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త పథకం లేదా విధానం అమలు జరపదలచి నపుడు లబ్ది దారులకు గతం కన్నా మెరుగైన సౌకర్యాలు వుండు నట్లు జాగ్రత పడాలి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అమలుకు పూను కోవాలి. పైపై మెరుగులు చూపెట్టి కొత్త పథకం అమలుకు పూనుకుంటే ఆచరణలో వ్యతిరేక ఫలితాలు ఎదురై ప్రజా వ్యతిరేకత మూట గట్టు కోవలసి వుంటుంది.
 
ప్రస్తుతం ప్రకటించిన 9 గంటలు విద్యుత్ సరఫరా ఆచరణలో పూర్తిగా వికటించ నున్నది.రైతులకు ఏమాత్రం అనుకూలంగా లేదు. ఎన్ని గంటలు ఇచ్చినా ఏక కాలంలో సరఫరా చేస్తే పొలం పారుదల కలసి వస్తుంది. కొమ్ములు తిరిగిన ఇంజనీరింగ్ నిపుణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టూ వుండి నెలకు లక్షలో జీతం తీసుకుంటూ వున్నా వారికి క్షేత్ర స్థాయి అనుభవం వున్నట్లు లేదు.
 
ప్రస్తుతం ప్రభుత్వం (ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో విద్యుత్ తో సాగు ఎక్కువ) రైతులకు ఒకే దఫా 7 గంటలు విద్యుత్ సరఫరా చేస్తోంది. ఒక వేళ అప్పుడప్పుడు బ్రేక్ వచ్చినా తిరిగి ఇస్తున్నారు. అయితే 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెబుతూ చేస్తున్న మార్పులు రైతుల పాలిట శాపంగా మార నున్నది. 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తూ రెండు దఫాలుగా ఇవ్వ నున్నట్లు ప్రకటించారు. బోర్లు కింద వ్యవసాయ చేసే అనుభవం ఏమాత్రం వున్నా ఇలాంటి నిర్ణయం తీసుకోరు.
 
ఉదాహరణకు చిత్తూరు ప్రకాశం నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతాల్లో  బోరుల కింద చెరకు వరి వేరుశనగ సాగు చేస్తున్నారు ఎక్కువ వరి చెరకు సాగు చేస్తున్నారు.
 
ఇది వరలో ఏక బిగిన కరెంట్ సరఫరా వుండటంతో ఒక కయ్యగాని చిన్నవిగా వుంటే రెండు కయ్యలు నీటి పారుదల జరిగేది. ఆ మాటకు వస్తే మోటారు నుండి నీళ్లు కయ్య లోనికి వెళ్లడానికి 15 నిమిషాల పట్టే సందర్భాలు వున్నాయి. వరసగా 7 లేక 6 గంటలైనా కరెంటు వుంటే ఎంతో కొంత పొలం పారుదల వుండేది. అంతే కాదు. ఒకవారం పగలు వస్తే మరో వారం రాత్రి పూట కరెంటు రావడంతో రైతులు అందుకు సిద్ధంగా వుండే వారు.
 
ప్రస్తుతం 9 గంటలు కరెంట్ సరఫరా పేరుతో ప్రతి రోజు అటు ఇటుగా పగలు రాత్రి కరెంటు ఇవ్వడంతో రైతు స్వతహాగా పని చేసుకుంటే తప్ప రోజులో రెండు ధఫాలు కూలీలు పని రారు. ఆలా రావడం కూడా అసాధ్యం.ఒక వర్గం రైతులకు తలకు మించిన భారం కానున్నది. 
 
ఈ హర్డిల్ కన్నా మరో ముఖ్య మైన ప్రమాదం పొంచి వుంది. పగటి పూట ఎప్పుడో ఒకప్పుడు నాలుగున్నర గంటలు మాత్రమే ఇచ్చినపుడు పూర్తిగా ఒక కయ్య పారే అవకాశం వుండదు. తిరిగి మరో మారు ఎప్పుడు ఇచ్చినా సగం పారి నిలిచి పోయిన కయ్య తొలి నుండి తిరిగి పార వలసి వుంది. పారిన ప్రాంతమే తిరిగి పార వలసి వుంటుంది. ఫలితంగా 9 గంటలు కరెంట్ ఇచ్చినా రైతుకు నీటి పారుదల కలసి రాదు. ఉదయం కరెంట్ తో సగం పారి నిలిచి పోయిన కయ్య తిరిగి రాత్రి మొదటి నుండి పార వలసి వుంటుంది. గతంలో 7 గంటలు కరెంటు ఇస్తున్న సమయంలో కూడా ఏ కారణం చేత నైనా మధ్యలో అర గంట బ్రేక్ వచ్చినా రైతులు ఈ దురవస్థ ఎదుర్కొనే వారు. ప్రస్తుతం 9 గంటలు కరెంటు ఇచ్చినా రైతులను సంతృప్తి పరచక పోగా వ్యతిరేకత మరింత మూట గట్టు కోనున్నారు. 7 గంటలు లేక 9 గంటలు కనీసం 6 గంటలు  నిరంత రాయంగా కరెంట్ ఇచ్చినపుడే రైతులను సంతృప్తి పరచిన వారౌతారు.