పెద్దపల్లి టీఆర్ఎస్ సీనులోకి కాంగ్రెస్ గీట్ల సవితారెడ్డి

2019 ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరు జయకేతనమెగుర వేయబోతున్నారు? ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారిక సర్వేల్లో పాస్‌ మార్కులు కూడా సంపాదించుకోలేని అధికార పార్టీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికే మళ్లీ పెద్దపల్లి టిక్కెట్‌ దక్కనుందా? కాంగ్రెస్‌ నుంచి మేమంటే మేమంటూ పోటీ కోసం పోట్లాడుతున్న యోధులలో సీటు దక్కేదెవరికి? కాంగ్రెస్ లో సీరియస్ ఆశావహుల జాబితాలో ఉన్న గీట్ల సవితారెడ్డి ని టిఆర్ఎస్ లోకి తీసుకుని టిఆర్ఎస్ టికెట్ ఇస్తారా? పెద్దపల్లి రాజకీయ చందరంగంపై ప్రత్యేక కథనం.
జిల్లా కేంద్రం అయ్యాక పెద్దపల్లి అసెంబ్లీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత టిఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి విద్యాసంస్థల అధినేతగా చాలా మందికి సుపరిచితుడు. కానీ ఈ సారీ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కుతుందా లేదా అనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. ప్రజల్లో ఆయనకు అంతగా బలం లేదన్న వాదన అధికారపార్టీ నాయకుల్లోనే ఉంది. పెద్దపల్లి అసెంబ్లీ సీటు కోసం అధికార పార్టీలో కొందరు ఉద్ధండులు ప్రయత్నిస్తున్నారు. గులాబీబాస్‌ తాజాగా చేయించిన సర్వేలో డేంజర్ లిస్టులో దాసరి మనోహర్ రెడ్డి పేరు కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రెండు పర్యాయాలు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి కూడా పెద్దపల్లి టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు కూడా ఇక్కడి నుంచి బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. చాలాకాలం నుంచీ రెడ్డీ సామాజికవర్గ ప్రాబల్యం ఉన్న వాళ్లే ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతుండటం వల్ల ఈ టిక్కెట్‌ను మరోసారి కూడా రెడ్డిలకే ఇవ్వాలన్న యోచనలో టీఆర్ఎస్ పెద్దలున్నట్టు తెలుస్తుంది.

ఎన్నికల వేళ ఏ జిమ్మిక్కులైనా జరగొచ్చు. పార్టీలన్నీ కప్పల తక్కెడగా మారొచ్చు. ఆ క్రమంలో అధికార టీఆర్ఎస్‌లోకి ఇప్పుడున్నవాళ్లే కాకుండా కొత్త ముఖాలు రావొచ్చని చర్చ జరుగుతోంది. ఎందుకంటే టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు రాహూల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత పోరెక్కువైంది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు. విజయరమణారావు నిత్యం జనంలో ఉండే నేతగా ఆయనకు సానుకూల వాతావరణమైతే కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీలో సహజంగా కనిపించే అంతర్గత పోరే ఆయన కొంప ముంచే పరిస్థితి కనిపిస్తుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు గీట్ల సవితారెడ్డి కూడా పెద్దపెల్లి టిక్కెట్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి వచ్చిన నాయకునికి టిక్కెట్‌ ఎలా ఇస్తారని సవితారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు అధిష్టానం పెద్దల వద్ద అడ్డుపడుతున్నట్టు తెలిసింది. విజయ రమణారావుకు ఉన్న మంచి పేరు కారణంగా ఆయనకు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమన్న చర్చ ఉంది. మరోవైపు ఎన్‌ఆర్‌ఐ, రాహూల్‌గాంధీతో కొంత సాన్నిహిత్యం ఉన్న గొట్టిముక్కల సురేష్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం ఇక్కడి నుంచి ప్రయత్నిస్తున్నారు. మత్స్యశాఖ మాజీ చైర్మన్‌గా పనిచేసిన చేతి ధర్మయ్య కూడా తానూ రేసులో ఉన్నట్టు ఇప్పటికే సంకేతాలిస్తుండటంతో కాంగ్రెస్‌‌లో టిక్కెట్ల గొడవ అప్పుడే మొదలైంది.
గులాబీ బాస్‌ కేసిఆర్ కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలను క్యాష్‌ చేసుకునేందుకు పెద్దపెల్లి సెగ్మెంట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పరిస్థితిలో మార్పు రాకపోతే ఈద శంకర్‌రెడ్డి పేరు పరిశీలించే అవకాశం ఉంది. లేని పక్షంలో కాంగ్రెస్‌లో అసమ్మతి నేతగా ఉన్న గీట్ల సవితారెడ్డిని టీఆర్ఎస్‌లోకి తీసుకొని మహిళా సెంటిమెంట్‌తో బరిలోకి దింపనున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి విపరీతమైన పోటీ ఉన్న నేపధ్యంలో తనకు టిక్కెట్‌ దక్కకపోతే గొట్టిముక్కల సురేష్‌రెడ్డి ఏకంగా నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణా జనసమితి పార్టీ నుంచి బరిలోకి దిగే యోచనలో ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపి నుంచి గతంలో పెద్దపెల్లి స్థానానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన గుజ్జుల రామకృష్ణారెడ్డి కూడా ఈసారి ఇక్కడంత దృష్టి సారించకపోవడంతో పెద్దపెల్లిలో బీజేపి పరిస్థితైతే అంతంత మాత్రంగా కనిపిస్తుంది. వామపక్షాల ప్రభావం కూడా అంతంత మాత్రంగా ఉంది. మిగిలిన పార్టీల సంగతైతే అంత క్రియాశీలకంగా కనిపించటం లేదు.

కొంత మంది ముఖ్య నాయకులతో పాటు మరికొంతమంది ద్వితీయశ్రేణి నేతలు కూడా ఈసారి పెద్దపెల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఆయా పార్టీల నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ నేపధ్యంలో పెద్దపెల్లిలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు దిగనున్నారు, వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి సెగ్మెంట్‌లో గెలుపెవ్వరిదనే ఉత్కంఠ అందరిలో మొదలైంది.