గాలిగాడు.. వైఎస్ జగన్‌పై లోకేష్ తీవ్ర పదజాలం.!

రాజకీయాల్లో విమర్శలు సహజం. అలాగని, జుగుప్సాకరంగా మాట్లాడటమే రాజకీయమనుకుంటే ఎలా.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘గాలిగాడు’ అనడం ఎంతవరకు సబబు.? గత కొంత కాలంగా నారా లోకేష్ తన స్థాయిని మరిచి, ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తున్నారు. వీటికి సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్.. బహుశా ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నట్టుంది. లోకేష్ మీద తీవ్రస్థాయిలో వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నా, ఇది పద్దతి కాదంటూ లోకేష్ మీద రాజకీయ విమర్శకులు సైతం పెదవి విరుస్తున్నా.. ఆయన మాత్రం తగ్గడంలేదు. తాజాగా పోలవరం నిర్వాసితులతో సమావేశమయ్యేందుకు వెళ్ళిన లోకేష్, పాదయాత్రలో వైఎస్ జగన్ గాలి మాటల చెప్పారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పోలవరం ముంపు బాధితులకి 19 లక్షల పరిహారమిస్తామని వైఎస్ జగన్, గతంలో ప్రకటించారనీ.. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మర్చిపోయారనీ నారా లోకేష్ సెలవిచ్చారు. నిజానికి, పోలవరం ప్రాజెక్టు.. చంద్రబాబు హయాంలోనే పూర్తయి వుండాలి. ఎందుకు పూర్తి చేయలేదట.? అంటే, తమ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పింది గాలి మాటలేనా.? అప్పట్లో నిర్వాసితుల్ని ఆదుకుంటామని చంద్రబాబు అండ్ టీమ్ చెప్పింది కూడా గాలి మాటలేనా.? వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళవుతోంది. అంతకు ముందు ఐదేళ్ళు రాష్ట్రాన్ని ఉద్ధరించింది టీడీపీనే. ఆ టీడీపీ హయాంలో నారా లోకేష్ కూడా మంత్రిగా పనిచేశారు. మరెందుకు ముంపు బాధితులకు పునరావాసం ఏర్పాటు చేయలేదట.? చంద్రబాబు హయాంలో కేంద్రం ఒప్పుకున్న మొత్తానికి నిధులు కేటాయించని కేంద్రాన్ని టీడీపీ ప్రశ్నించకపోవడం.. టీడీపీ బేలతనానికి నిదర్శనం.