ఎల్జీ పాలిమర్స్ ఘటన మానవ తప్పిదమే.. మరి ఆ మానవుల మీద చర్యలేవి 

Andhra Pradesh
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు మానవ తప్పిదమే కారణమని తేలింది.  విశ్రాంత జడ్జి శేషశయనరెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేసిన ఐదుగురు సభ్యుల బృందం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.  సోమవారం జరిగిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణలో ఈ నివేదికను శేషశయనరెడ్డి బృందం బయటపెట్టింది.  నివేదికలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య తప్పిదమని నేరుగా చెప్పకపోయినా మానవ తప్పిదం అన్నారు.  మరిక్కడ మానవులు అంటే సంస్థ యాజమాన్యం, భద్రతా సిబ్బందే అవుతారు.
 
నివేదికలో ప్రధానంగా స్టైరీన్ గ్యాస్ పాలిమరైజేషన్ ప్రక్రియను నిలువరించే టీబీసీ తగిన మోతాదులో ప్లాంట్లో లేదని, ప్లాంట్లో 24 గంటలు రిఫ్రిజరేషన్ సిస్టం పని చేయడం లేదని, స్టోరేజ్ ట్యాంక్ వద్ద పర్యవేక్షకుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందని, స్టైరీన్ ట్యాంక్ టాప్ లేయర్లలో ఉష్ణోగ్రతలను పర్యవేక్షించే వ్యవస్థను పాటించడం లేదు.  ఇవన్నీ యాజమాన్య, సిబ్బంది తప్పిదాలే అవుతాయి.  కాబట్టి చర్యలు వారి మీదే తీసుకోవాలి.  ఆ భాద్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.  కానీ ప్రమాదం జరిగి దాదాపు నెల కావొస్తున్నా సంస్థ యాజమాన్యం, భద్రతా సిబ్బందిపై కనీస చర్యలు తీసుకోలేదు.  
 
పైగా అడుగడుగునా యాజమాన్యానికి కొమ్ముకాసే రీతిలో అధికారుల చర్యలున్నాయి.  వాటికి తోడు న్యాయం కోసం ఆందోళన చేసిన బాధితులపైనే కేసులు పెట్టారు.  ఈ నాటకీయ పరిణామాలతో కేసును కాలయాపన చేసి నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని బాధితులు ఆందోళన చెందుతున్నారు.  ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరు చూస్తే గతంలో ఆ సంస్థకు అనుమతులిచ్చారనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో తప్పించు తిరుగుతున్నారు.  
 
కేంద్ర ప్రభుత్వం సైతం ఈ వివాదంపై నెమ్మదిగానే వ్యవహరిస్తోంది తప్ప పెద్దగా కలుగజేసుకోవడం లేదు.  మరోపక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కేసును సుమోటోగా విచారణ చేయడానికి వీల్లేదని ఎల్జీ పాలిమర్స్ తరపు న్యాయవాది వాదిస్తున్నారు.  దీంతో బాధితుల్లో కంపెనీ యాజమన్యం శిక్ష నుండి సులువుగా తప్పించుకునే వీలుందని ఆందోళన చెందుతున్నారు.  కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన విశ్వసనీయతను కాపాడుకోవాలంటే త్వరితగతిన కేసు విచారణను ముగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.