రాష్ట్రంలో వైకాపా పాలన మొదలైన తర్వాత పోలీసులు చేపడుతున్న విధానాలపై తరచూ కోర్టులు తీవ్ర మైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర పోలీసు బాస్ హైకోర్టు మెట్లెక్కవలసి వచ్చింది. అయినా పోలీసు శాఖలో ఏమాత్రం మార్పు రావడం లేదు. పైగా ఒక ఘటన వెంబడి మరో ఘటనలో మరింత స్పీడ్ పెంచి కోర్టుల వద్ద తలవంచుకొంటున్నారు. గతంలో ఈలాంటి అవాంఛనీయ పరిస్థితి రాజకీయ నాయకుల యెడల వ్యక్త మయ్యేది కాదు. మామూలు ఖైదీలు లాకప్ డెత్ ల సందర్భంగా ప్రదర్శితమయ్యేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.
టిడిపి ఎమ్మెల్యే అచ్చమ నాయుడు అరెస్టు సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనపై అప్పట్లో ప్రతి పక్షాలు పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు చేశాయి. టిడిపితో ఎట్టి రాజకీయ మైత్రి లేని బిజెపి నేతలు కూడా తప్పు పట్టారు.అచ్చమ నాయుడు ఉగ్రవాది కాదని పోలీసులు గోడ దూకి ఇంటిలో ప్రవేశించడం ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని అమానవీయంగా 600 కిలోమీటర్లు కారులో తీసుకురావడంపై ప్రతి పక్షాలు చేసిన విమర్శలు అటుంచగా సామాన్య ప్రజల్లో కూడా ఇది చర్చనీయాంశమైంది. .
అయితే ఈ కథ ఇంతటితో ముగియ లేదు. అనిశా పోలీసులు తమ దూకుడు తగ్గించ కుండా స్పీడ్ మరింత పెంచారు. డాక్టర్ల సిఫార్సు ప్రకారం ఆసుపత్రిలో చేర్చబడి రెండవ మారు ఆపరేషన్ చేసిన నేపథ్యంలో అనిశా పోలీసులు పోలీసు కష్టడీ పేరుతో ఆసుపత్రినుండి మధ్యంతరంగా డిశ్చార్జికి యత్నం చేశారు. అచ్చమ నాయుడు విషయంలో అనిశా పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం విమర్శల పాలైంది. ఏది ఏమైతేనేం ఆఖరుగా జైలుకు తరలించారు.
ఈ ఎపిసోడ్ అంతా గమనించిన న్యాయ స్థానం చేసిన వ్యాఖ్యానాలతో ప్రస్తుతం అనిశా పోలీసులు తల వంచుకోవలిసి వచ్చింది. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చమని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అటు పోలీసులు ఇటు ప్రభుత్వం ఆసుపత్రి డాక్టర్లు సమాధానం చెప్పుకోవలసిన వస్తోంది.
సాధారణంగా పోలీసు అధికారులు తమ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కో సమయంలో అనుకోకుండా కట్టుతప్పడం జరుగుతూ వుంటుంది. ఇది సర్వ సాధారణమే. ఒక్క పోలీసు శాఖలోనే కాదు ప్రభుత్వ ఇతర శాఖల్లో కూడా ఈలాంటి సంఘటనలు అనివార్యంగా సంభవించుతుంటాయి. కాని ఒక దాని వెంబడి మరో సంఘటన జరిగితే కట్టు తప్పినట్లే లెక్క. ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారని ఎవరైనా భావించక తప్పదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. నియమ నిబంధనలకు పాతరేసి పోలీసు అధికారులు వ్యవహరించితే న్యాయ స్థానాలకు జవాబు చెప్పుకోవలసినది- అధికార పార్టీ నేతలు కాదు. పోలీసు అధికారులే కోర్టుల ముందు నిలబడివలసి వుంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు విశాఖ వెళ్లిన సమయంలో పోలీసు అధికారులు తిరిగి వెనక్కి పంపారు. ఈ విషయంలో పోలీసు బాస్ హైకోర్టుకు హాజరు కావలసి వచ్చింది. అప్పటికే విమానాశ్రయం వద్ద చేరిన వైకాపా శ్రేణులను చెదర గొట్టి తమ విధి నిర్వహించి వుంటే చంద్రబాబు నాయుడు అంశంలో పోలీస్ బాస్ హైకోర్టు మెట్లెక్కవలసి వుండేది కాదు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని పోలీసు బాస్ హైకోర్టుకు చెప్పవలసి వుండేది కాదు. పోనీ విశాఖ సంఘటన అనుకోకుండా జరిగిందని భావింప బడినా అమానవీయంగా తిరిగి అచ్చమ నాయుడు యెడల వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో వున్నామనే వారు ఎవరైనా పోలీసు శాఖ నిబద్ధతను విశ్వసించ గలరా? ఈలాంటి సంఘటనల్లో టిడిపి నేతలు నిమిత్తమాత్రులు. సంఘటన తీరు మాత్రమే ప్రాతినిధ్యం సంతరించుకొంటుంది.
గతంలో పోలీసు అధికారులు దొంగతనం చేసిన వారి యెడల హత్య లేక అత్యాచారం క్రిమినల్ కేసుల్లో నిందితుల విచారణ సందర్భంగా థర్డ్ డిగ్రీ పేరుతో పైశాచికంగా వ్యవహరించే వారు. చాలా కాలం నుండి ఈ విషయంలో కూడా న్యాయ స్థానాలు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చాలా వరకు తగ్గి పోయాయి. తుదకు ఇటీవల కాలంలో పోలీసు బాస్ లు కూడా కటువుగా వ్యవహరించ కూడదని ఫ్రేండ్లీ పోలీసు విధానం అమలుకు పలు చర్యలు చేపట్టారు. మరి ఈ ఫ్రెండ్లీ విధానం అచ్చమ నాయుడు యెడల ఎందుకు అమలు జరగ లేదో హైకోర్టు వద్ద ఎందుకు మాట పడవలసి వచ్చిందో ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఆత్మ పరిశీలన చేసుకోవడం మంచిది.
రాష్ట్రల్లో గాని కేంద్రంలో గాని ఎన్నికలు జరిగినపుడల్లా కొత్త పార్టీలు అధికారం చేపడుతూ వుంటాయి.అవి మంత్రి వర్గాలను ఏర్పాటు చేసి పరిపాలన సాగిస్తాయి. అయితే అవి శాశ్వతంగా వుండవు. తిరిగి అయిదు ఏళ్లకు మరో పార్టీ అధికారం చేపడుతుంది. మంత్రి వర్గాలు మాత్రం మారుతుంటాయి. కాని ప్రభుత్వం యంత్రాంగం అధికారులు మాత్రం శాశ్వతంగా వుంటారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన కార్యనిర్వాహక వర్గం రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. కాకుంటే అధికార పార్టీ తమకు నమ్మకస్తులైన అధికారులను కీలక స్థానాల్లో నియమించుకుంటుంది. అధికార పార్టీ తనకు నమ్మకస్తులను కీలక స్థానాల్లో నియమించుకొన్నంత మాత్రాన వారు రాజ్యాంగ బద్దంగా అమలులో వున్న నియమనిబంధనలకు లోబడి పనిచేయాలేగాని లక్ష్మణ రేఖను అతిక్రమించి ఎటుబడితే అటు వ్యవహరించ కూడదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ లక్ష్మణ రేఖను పోలీసులు అధికారులు అతిక్రమించుతున్నందున ప్రతి పక్షాల ఆరోపణలు పక్కన బెడితే పదే పదే హైకోర్టు చేత కూడా అక్షింతలు వేసుకోవలసి వస్తోంది.అధికారం చేపట్టే ప్రతి పార్టీకి దాని స్వంత ఎజెండా వుంటుంది. అది అసహజమేమీ కాదు. అయితే కార్యనిర్వాహక వర్గం రాజ్యాంగ నిర్దేశించిన విధి విధానాలను అమలు చేయవలసి వుంది. ఆ విధంగా అధికార పార్టీకి సూచనలు చేయ వలసి వుంది. ఆ బాధ్యత విస్మరించితే ఇప్పుడు కాకున్నా మున్ముందు కార్యనిర్వాహక వర్గమే చిక్కుల్లో పడుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ దురవస్థ పోలీసు శాఖ ఎదుర్కొంటోంది.