ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ముఖ్యంగా విపక్ష నేత వైఎస్ జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వరుసగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. పాలన పేరు చెప్పి వైసీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని జనగ్ విమర్శించారు. తాజాగా ఆయన పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామానికి వెళ్లారు.
ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన జగన్, రాష్ట్రంలో ప్రస్తుతం “రెడ్ బుక్ రాజ్యాంగం” అమలవుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలపై కుట్ర పూరితంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించిన ఆయన, పోలీస్ వ్యవస్థను కక్ష సాధింపు పనికే వినియోగిస్తున్నారని అన్నారు. “నాగమల్లేశ్వరరావు మృతి బాధాకరమన్న జగన్.. ఆయన ఆత్మహత్యకు ముందు తన తండ్రికి ఫోన్ చేసి పోలీసుల బెదిరింపులు చెప్పారని పేర్కొన్నారు. ఇది ఒక్కటే కాదు. ఇదే నియోజకవర్గానికి చెందిన లక్ష్మీనారాయణను కూడా స్టేషన్‌కు పిలిపించి బెదిరించారని తెలిపారు. ఇది శాసనానికి వ్యతిరేకంగా సాగుతున్న కుట్ర రాజకీయాలని జగన్ ఘాటుగా అన్నారు.
జగన్ రెంటపాళ్లకు వస్తున్న విషయాన్ని తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, గ్రామస్థులు తరలివచ్చారు. ట్రాఫిక్ ఇబ్బందులు కారణంగా ఆయన కుటుంబాన్ని సుమారు నాలుగు గంటల ఆలస్యంగా కలుసుకున్నారు.
జగన్ వ్యాఖ్యలపై అధికార కూటమి నుంచి సూటి ప్రతిస్పందన వచ్చింది. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. జగన్ పరామర్శ పేరిట బురద రాజకీయాలకే దిగజారుతున్నారని విమర్శించారు. నాగమల్లేశ్వరరావు వైసీపీ హయాంలోనే బెట్టింగ్ డబ్బుల వలన ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. జగన్ ఎన్నికల తర్వాత ఓటమిని మరిచేందుకు ఇలా తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సంవత్సరం తరువాత పరామర్శ పేరు చెప్పి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయ లబ్దికోసమే జగన్ వెళ్లారని నిమ్మల మండిపడ్డారు.