అమరావతిలో రైతుకు కులం మరక అంటింది

మట్టి మనుషులు రైతు ఉద్యమకారుడు కాదు. రైతు అయినా, కౌలు రైతు అయినా, రైతు కూలీ అయినా, వారిలో పోరాట స్ఫూర్తి ఉండదు. పోరాట స్ఫూర్తి లేని మనుషులు ఇద్దరే – ఒకరు అమ్మ, ఇంకొకరు అన్నదాత. అమ్మకు కూడా కోపం రాదు. విసుగొస్తుంది. బాధ పడుతుంది. కుమిలిపోతుంది. అంతే. రైతు (రైతు అన్న ప్రతిసందర్భంలోనూ కౌలు రైతు, రైతుకూలీకి వర్తిస్తుంది) కూడా అంతే. విరక్తి కలుగుతుంది. భవిష్యత్తు అంధకారంగా అనిపిస్తుంది. నిరాశ, నిస్పృహలకు లోనవుతాడు. రైతు ఆత్మ హత్య చేసుకుంటాడే కానీ ఎదుటివారిని గాయపర్చడు.

ఉద్యమం చేసే లక్షణం రైతుకు ఉంటే 80 శాతం ప్రజలపై 20 శాతం పాలకులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు పెత్తనం చేయగలిగేవారు కాదు. నక్సల్బరీ ఉద్యమం అయినా, మరొకటి అయినా రైతులతో పాటు వేరే వర్గం కూడా చేరితేనే ఆ ఉద్యమం విజయవంతం అవుతుంది లేదా హింసాత్మకంగా మారుతుంది తప్ప కేవలం రైతులే పోరాటం చేసి విజయం సాధించిన లేదా హింసకు పాల్పడిన సందర్భాలు లేవు. రైతు ధ్యాసంతా మట్టిపైనే. రైతు అంటేనే మట్టి మనిషి. మట్టితోనే జీవితం. మట్టే జీవితం. దున్నడం, నీళ్ళు పెట్టడం, పంటవేయడం, పంట కోయడం… అంతవరకే తెలుసు. ఆ పంటను మార్కెట్లో అమ్ముకోవడం కూడా తెలియదు. గిట్టుబాటు ధర రానివ్వని మార్కెట్ శక్తులపై దాడి చేయడు. ఆత్మహత్య చేసుకుంటాడు లేదా పంట రోడ్డున పారేసి పోతాడు. తిరగబడడు. రైతు తిరగబడేది మట్టిపైనే.. మనుషులపై కాదు. బీడుభూమి ఇచ్చినా తిరగబడి దాన్ని అటు దున్ని, ఇటు దున్ని చివరికి పంటపండిస్తాడు.

గుండెపై తుపాకీ గురిపెట్టినా అది భోజనం వేళ అయితే పట్టెడన్నం పెడతాడు కానీ తుపాకీకి ఎదురు తిరగడు, గురిపెట్టినవాడి గుండెలపై పొడవడు. రైతు లక్షణమే అంత. రైతు కూలీల్లో 60 శాతం దళితులే. వారుకూడా రైతుకూలీలుగా ఉద్యమిస్తే అది ఉధృతం అవదు. కులం పేరున వచ్చే ఉద్యమం మాత్రమే ఉధృతం అవుతుంది. రైతు కూలీలుగా ఉండే ఎస్సీలు, కౌలు రైతులుగా ఉండే బీసీ కులాలు, కొన్ని ఓసీ కులాలు, ఇలా వ్యవసాయంలో ఉన్న ఏ కులం అయినా పోరాటం చేసి విజయం సాధించడమో, హింసాత్మకంగా మారడమో కనిపిస్తుంది కానీ రైతు పేరుతో ఉద్యమం విజయవంతం అవదు. ఇప్పుడు అమరావతి అయినా అంతే. రాజకీయమో, కులమో ఉంటే తప్ప రైతు రోడ్డుకు రాడు. పొలమా, పోరాటమా అంటే పొలమే అంటాడు రైతు. అలా పొలాన్ని నమ్ముకున్న రైతుకు ఇప్పుడు అమరావతిలో కులం మరక అంటింది. పొలంలో మరక అయితే సాయంత్రం కడిగేసుకుంటాడు. ఈ మరక కడిగితే పోయేది కాదు. అంటించిన వారే కడిగేయాల్సిన మరక అది. అధికారంలో ఉన్నవాళ్ళో, అధికారం కోల్పోయిన వాళ్ళో అంటించిన మరక ఇది. మొత్తానికి రాజకీయమే రైతులకు ఈ మరక అంటించింది. ఇందులో మీడియా పాత్ర కూడా ఉంది. అమరావతి రైతులపై పడ్డ ఈ మరకను కడిగేయాల్సిన బాధ్యత దాన్ని అంటించినవారిదే.