వెంకటేష్ , వరుణ్ తేజ్ ల ‘ఎఫ్ -2’ రివ్యూ

-సికిందర్
Rating: 3

సంక్రాంతి సినిమాల పెర్ఫార్మెన్స్ రోజుకో రకంగా వుంటూ వచ్చింది. ఒక బయోపిక్, రెండు మాస్ యాక్షన్లు నిన్నటి వరకూ విడుదలయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ తో పైకి లేచిన గ్రాఫ్, రజనీ కాంత్ ‘పేట’ తో కాస్త కిందికి, రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ తో పూర్తిగా కిందికి దూసుకెళ్ళి మంటగలిసి పోయింది. ఇక సంక్రాంతి చివరి ఘట్టమే మిగిలింది. ఇప్పుడు ఇంకో సంక్రాంతి ఆఫర్, వెంకటేష్ – వరుణ్ తేజ్ ల ‘ఎఫ్ -2’ దిల్ రాజు నిర్మాణంలో పరీక్షకి నిలబడింది. పండగ సినిమాలని పేరేగానీ పండగ మూడ్ ని ఎలివేట్ చేసే సరైన ఎంటర్ టైనర్లు లేక, ప్రేక్షకుడు మార్కెట్లో పిచ్చి పట్టిన వాడిలా తిరుగుతున్నాడు.

వాడితో ఆడుకోకుండా ఆదుకుంటూ ఈ చివరాఖరి సినిమా అయినా వుంటుందాని పండగ మార్కెట్ లో ‘ఎఫ్ -2’ వైపు ఆశగా చూస్తున్నాడు. రెండు ‘ఎఫ్’ లు ఏమిటంటే, మొదటిది ‘ఫన్’, రెండోది ‘ఫ్రస్ట్రేషన్’. మొదటిది పండగ మూడ్ కి బాగానే వుందిగానీ, రెండోది మళ్ళీ భయపెట్టేదిలా వుంది. మళ్ళీ దీంతో కూడా పూర్తి ఎంటర్ టైన్ చేయకుండా ఫ్రస్ట్రేషన్ లో పడేస్తారా ఏమిటని భయం పట్టుకుంది. అయినా ఆశ అనేది బాధితుడైన ప్రేక్షకుడిని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ధైర్యంగా థియేటర్ వైపు కెళ్తే…

కథ

వెంకీ (వెంకటేష్) ఒక ఎమ్మెల్యే దగ్గర పియ్యేగా పని చేస్తూ బాగా సంపాదించుకుంటాడు. అతడికి హారిక (తమన్నా) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరుతో పెళ్ళవుతుంది. హారికకి హనీ (మెహ్రీన్) అనే చెల్లెలుంటుంది. ఇద్దరూ తలబిరుసు మొండి ఘటాలు. వీళ్ళకి తోడు ఇంట్లో తల్లి (ప్రగతి), ఇద్దరు బామ్మలు (అన్నపూర్ణ, వై విజయ). ఒక నోరు లేని తండ్రీ (ప్రదీప్) వుంటారు. ఇంట్లో అంతా ఆడపెత్తనమే. అలా వెంకీ అల్లుడై బకరా అయిపోతాడు. భార్యా బాధితుడిగా తనే చస్తుంటే, వరుణ్ యాదవ్ (వరుణ్ తేజ్) అనే హైదరాబాద్ బస్తీ శాల్తీ రెండో అల్లుడిగా జాయినవబోతాడు. వెంకీ వారించినా విన్పించుకోడు.

హారిక చెల్లెలు హనీతో ఎంగేజి మెంటు అయ్యాక గానీ తనూ వెంకీ లాగే బకరా అయ్యాడని అర్ధం గాదు. ఇప్పుడెం చేయాలి? ఈ ఆడవాళ్ళకి బుద్ధి చెప్పాలంటే, తాము లేని లోటు అర్ధమై దారికి రావాలంటే పారిపోవాలని యూరప్ పారిపోతారు. ఈ ప్లాను ఇంకో ఇద్దరు భార్యల బకరా (రాజేంద్ర ప్రసాద్) వేస్తాడు. ముగ్గురూ యూరప్ పారిపోయి ఏం చేశారు? అనుకున్నట్టు జరిగిందా? మళ్ళీ అక్కాచెల్లెళ్ళు ఏం ఎత్తుగడలు వేశారు? వీళ్ళని ఎలా జయించారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

తెలుగులో జంధ్యాల, వంశీ, ఈవీవీల తర్వాతి తరంలో కామెడీ దర్శకుల్లేరు. యాక్షన్ కామెడీల, రోమాంటిక్ కామెడీల దర్శకులే అవసరానికి మించి తయారై కామెడీ సినిమాలని ప్రేక్షకులకి దూరం చేశారు. పూర్తి స్థాయి హాస్యకథా చలన చిత్రమనే ఒక ప్రధాన జానర్ వుందన్న విషయం కూడా తెలియనట్టు తయారయ్యారు. ఇప్పుడు అనిల్ రావిపూడి ఈ అవతారమెత్తి, మర్చి పోయిన కామెడీ జానర్ లేని లోటు తీర్చాడు.

కథ బార్యాబాధితుల పాత ఫార్ములా కథే. హిందీలో ‘వెల్కమ్’ (2007) అనీ, ‘హౌస్ ఫుల్’ (2010) అనీ బిగ్ స్టార్స్ లో ఇలాటి కామెడీలు హిట్టయ్యాయి. ఇవీ పాత కథలే. కాకపోతే తెలివితేటలతో కొత్తగా నవ్వించే క్రియేటివిటీకి పాల్పడ్డారు. ఈ కాలపు కామెడీలుగా యూత్ అప్పీల్ తో కూడిన స్పీడు వీటి లక్షణం. అనిల్ రావిపూడి దీన్ని ఫాలో అయ్యాడు. ఈ ప్రయత్నంలో పాక్షికంగా సక్సెస్ అయ్యాడు.

ఎవరెలా చేశారు

విక్టరీ వెంకటేష్ మళ్ళీ వస్తూ పెద్ద బ్యాంగ్ ఇచ్చిన పండగ ఘట్టమిది. టైమింగ్, రీపార్టీ, ఐరనీ, ఎక్స్ ప్రెషన్స్ లతో కూడిన టాలెంట్ ని ప్రదర్శించి పండించిన హాస్యమిది. తనకాలంలో ఇలాటి పాత్రలు కొట్టిన పిండే. అదే ఎనర్జీతో ఇప్పుడు యువతరం ప్రేక్షకులతో సైతం కేరింతలు పెట్టిస్తూనే పోయారు సీను సీనుకీ. ఫ్లాపుల్లో వున్న దిల్ రాజు వెంకటేష్ కెంతో రుణపడాలి. సంక్రాంతి సినిమాల్ని సీనియర్ స్టార్లు ఆదుకునే కార్యక్రమం కొనసాగుతూనే వుంది. 2016 లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ తో నాగార్జున ఎలా దుమ్మురేగ్గొట్టారో, వెంకటేష్ ఇప్పుడలా వచ్చి సంక్రాంతి సినిమాలకి పట్టిన తుప్పు వదిలించారు.

రెండో హీరో తెలంగాణా యాస పాత్ర పోషించిన వరుణ్ తేజ్ కూడా ఈ కామెడీకి ప్లస్ అయ్యాడు. వెంకటేష్ తో, మెహ్రీన్ తో చేసిన సీన్లన్నీ తన స్టయిల్లో ఫన్నీగా చేశాడు. తమన్నాది కామెడీ పాత్ర కాదు, సీరియస్ గా పెత్తనం చెలాయిస్తూ వెంకేష్ కి నరకం చూపించే నటన. మెహ్రీన్ మాత్రం తనకి దక్కిన వెర్రిమాలోకం పాత్రలో పూర్తిగా జీవించి ఎంజాయ్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ పెత్తందార్లు ప్రగతి, అన్నపూర్ణ, వై. విజయ, వీళ్ళ బాధితురాలైన వరుణ్ తేజ్ తల్లిపాత్ర ఝాన్సీ – అందరూ ఈ హోల్ సమ్ కామెడీని తలా ఓ చెయ్యేసి లాక్కెళ్ళారు. దీనుడైన ఎమ్మెల్యే పాత్రలో రఘుబాబు కూడా. ఇక సెకండాఫ్ లో వచ్చే ప్రకాష్ రాజ్, నాసర్, వెన్నెల కిషోర్ లు అప్పటికి కామెడీ సరుకంతా కథలో ఫస్టాఫ్ లో అయిపోవడంతో ఉన్నమేరకు ఫర్వాలేదనిపించారు.

అనిల్ రావిపూడి కామిక్ డైలాగులు షార్ప్ గా వున్నాయి. కృత్రిమ టెంప్లెట్ డైలాగులుగానీ, ప్రాస డైలాగులుగానీ లేకుండా శుభ్రమైన హాస్యముంది. దేవీశ్రీ ప్రసాద్ పాటలు సన్నివేశాల వరకూ బాగానే అన్పిస్తాయి. సమీర్ రెడ్డి కెమెరా వర్క్ ఉన్నతంగా వుంది.

చివరి కేమిటి

కామెడీ కథనంలో ఫస్టాఫ్ వరకూ డైనమిక్స్ బావున్నాయి గానీ అది మరీ ఎక్కువైపోయి, సెకండాఫ్ కి వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. డైనమిక్స్ ని ఫస్టాఫ్ లో పరిమితంగా వుంచితే, సెకండాఫ్ కామెడీని ప్లే చేయడానికి తగిన పాచికలు చేతిలో వుండేవి. ఫస్టాఫ్ అంతా తెగ కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించేశాక, ఇలా ఎంత సేపని నవ్విస్తారు. ఫస్టాఫ్ కామెడీ సీన్లన్నీ ఎలా వున్నాయంటే, పొడిగించిన క్లయిమాక్స్ సీన్లలాగా వున్నాయి. ఫస్టాఫ్ లో ఒక స్థాయికి కామెడీని పరిమితం చేస్తూ పొదుపు చేసి, సెకండాఫ్ లో విరివిగా వాడుకుంటూ కామిక్ ఆర్క్ ని పెంచినప్పుడు ప్రేక్షకులు ఈజీగా ట్రావెల్ అయిపోతారు.

ఫస్టాఫ్ లోనే అలసిపోయేట్టు చేస్తే, సెకండాఫ్ లో కామెడీ వున్నా అది రిపిటీషన్ గా అన్పించి నవ్వలేకపోతారు. ఇక్కడేం జరిగిందంటే, సెకండాఫ్ లో కథలోనే కామెడీ లేకుండా పోయింది. మామూలు మాస్ సినిమాలు వేరు, పూర్తి స్థాయి కామెడీలు వేరు. మాస్ యాక్షన్లో ఫస్టాఫ్ ఎంతైనా నవ్వించుకోవచ్చు, ఎందుకంటే సెకండాఫ్ లో నవ్వులు ముగిసి యాక్షన్ మొదలవుతుంది కాబట్టి. కానీ పూర్తి స్థాయి కామెడీకి ఫస్టాఫ్ -సెకండాఫ్ నవ్విస్తూనే పోవాలి. మాస్ యాక్షన్ లాగా ఫస్టాఫ్ లోనే కామెడీనంతా నింపేస్తే, సెకండాఫ్ లో ఇలా జరుగుతుంది- ఇంకా ప్రేక్షకులు నవ్వలేకపోవడం లేదా కథలో కామెడీ అయిపోవడం!

ఇంటర్వెల్ లో కథేమిటో – పాయింటేమిటో చెప్పారు – హీరోలిద్దరికీ యూరప్ పారిపోవాలన్న గోల్ నేర్పాటు చేసి. సెకండాఫ్ లో హీరోయిన్లు వాళ్ళ వేరే పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న కౌంటర్ గోల్స్ తో రావడమనే ఎత్తుగడ బావుంది. కానీ ఇప్పుడు హీరోలకీ హీరోయిన్లకీ వాళ్ళ గోల్స్ పరంగా చూపించాల్సిన సంఘర్షణే కొరవడింది. ఈ లోపాలు దిద్దుకుని వుంటే, ఇదింకా మంచి బలమైన కామెడీ అన్పించుకునేది. అయితే తెలుగులో మాయమైపోయిన ఓ కామెడీ సినిమా ప్రయత్నమంటూ చేసినందుకు దిల్ రాజుకి, రావిపూడికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పొచ్చు.

తెర వెనక..తెర ముందు

నటీనటులు: వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ, వై.విజయ, నాజర్‌ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
ఎడిటింగ్‌: బిక్కిని తమ్మిరాజు
నిర్మాత: దిల్‌రాజు
దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
విడుదల: 12-01-2019